ప్రమాదానికి ముందు చెల్లెళ్లతో కలిసి ఫోటో దిగిన మహిత(అరెంజ్ కలర్ డ్రెస్)
సాక్షి, ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న జలపాతంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఓ బాలిక మృతి చెందింది. వివరాలు.... బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లికి చెందిన గోపాలకృష్ణారెడ్డి, హిమబిందు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహిత (14) అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో గురువారం ఉదయం పిల్లలను పిలుచుకుని తల్లి పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చింది.
ఆలయంలో పూజలు ముగించుకుని దిగువన ఉన్న జలపాతం వద్దకు చేరుకున్నారు. సెల్‌ఫోన్‌తో సరదాగా ఫొటోలు దిగారు. ఈ క్రమంలో జలపాతానికి ఎగువన పిల్లలు వరుసగా నిలబడి ఉండగా తల్లి ఫొటో తీసింది. అదే సమయంలో నీళ్లలో ఉన్న పాచి పట్టిన రాతిపై కాలు పెట్టిన మహిత ఒక్కసారిగా జారిపడి జలపాతం దిగువకు కొట్టుకుపోయింది. గమనించిన తల్లి ఒక్కసారిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయడంతో కొందరు యువకులు జలపాతంలోకి దూకి మహిత కోసం గాలింపు చేపట్టారు.
అప్పటికే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మహితను జలపాతానికి ఫర్లాంగు దూరంలో యువకులు గుర్తించి వెలికి తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని మహితను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: నా చావుకు ఎవరూ కారణం కాదు! అంటూ సెల్ఫీ వీడియో పంపి..)
Comments
Please login to add a commentAdd a comment