bukkaraya samudram
-
చూస్తే ప్రకృతి ధామంలా ఆహ్లాదంగా ఉంటుంది! కానీ అది..
అక్కడికి అడుగుపెట్టగానే పచ్చనిచెట్లు స్వాగతం పలుకుతాయి. ప్రకృతి రమణీయత ఆహ్లాదాన్ని పంచుతుంది. పాడిపంటలు కనువిందు చేస్తాయి. జీవవైవిధ్యం ముచ్చటగొలుపుతుంది. ఒకసారి ప్రవేశిస్తే ఎంతసేపైనా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అలాగని అదేమీ అందమైన అటవీ ప్రాంతం కాదు. జనారణ్యం నడుమ ఉన్న ఓ జైలు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. అదే రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు (ఖైదీల వ్యవసాయ క్షేత్రం). ఖైదీల పరివర్తన కేంద్రంగా, అందమైన వ్యవసాయ క్షేత్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. సాక్షి, అనంతపురం: క్షణికావేశంలో చేసిన నేరాలు జైలుగోడల మధ్యకు నెడతాయి. సుదీర్ఘకాలం అక్కడే ఉండిపోవాల్సి వస్తే జీవితమే నరకంగా మారుతుంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి కానీ అది పరివర్తనకు దోహదపడినప్పుడే అర్థవంతమవుతుంది. ఖైదీల్లో పరివర్తన, చట్టాలను గౌరవించే పౌరులుగా తీర్చిదిద్దడం, పునరావాసానికి దోహదపడాలనే ఉద్దేశంతో ఓపెన్ ఎయిర్‌జైలు వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి వద్ద ఓపెన్ ఎయిర్ జైలును 1965 సంవత్సరంలో అప్పటి కేంద్రమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతపురం నగరానికి అత్యంత చేరువలో ఉండే ఈ జైలును మొదట్లో 1,427.57 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. తర్వాత క్రమంలో జిల్లా జైలు, ఏపీఎస్పీ బెటాలియన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీకి 623.44 ఎకరాలను కేటాయించారు. దీంతో ప్రస్తుతం 804.13 ఎకరాల్లో ఓపెన్ ఎయిర్‌జైలు కొనసాగుతోంది. స్వేచ్ఛ జీవితం, నైపుణ్య శిక్షణ సాధారణ జైల్లో శిక్ష అనుభవించే సమయంలో క్రమశిక్షణతో మెలిగి, పరివర్తన చెందేవారిని చివరిదశలో రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్‌జైలుకు పంపుతారు. ఇక్కడి స్వేచ్ఛా వాతావరణంలో ఖైదీల్లో ఒత్తిడి తగ్గించి.. వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు సమగ్ర వికాసానికి దోహదం చేస్తున్నారు. వారు విడుదలైన తర్వాత సమాజంలో సాఫీగా బతకడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. వాస్తవానికి ఈ జైలును 300 మంది ఖైదీల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అయితే..జిల్లా జైళ్లలోనే సెమీ ఓపెన్‌ఎయిర్ సిస్టం తేవడం, నేరాల సంఖ్య తగ్గడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం ఇక్కడ 32 మంది మాత్రమే ఉన్నారు. పంటల సాగు పెట్రోల్ నిర్వహణ రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్‌జైలు ఖైదీలు వ్యవసాయ, అనుబంధ విభాగాలతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణలోనూ సత్తా చాటుతున్నారు. దాదాపు అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వీటిని గతంలో ట్రాక్టరులో అనంతపురానికి తెచ్చి విక్రయించేవారు. ఇప్పుడు జైలు వద్దే అనంతపురం–తాడిపత్రి రహదారి పక్కన అమ్ముతున్నారు. తక్కువ పురుగు మందుల వాడకంతో నాణ్యమైన కూరగాయలు పండిస్తుండడంతో వీటి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మామిడి, సపోటా, ఉసిరి తదితర పండ్లతోటల సాగుతో పాటు డెయిరీ నిర్వహణ, గొర్రెలు, పశువుల పెంపకంలోనూ ఖైదీలు నైపుణ్యం సాధించారు. ఇక పెట్రోల్ బంకుల నిర్వహణలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ రూ.పది లక్షల దాకా వ్యాపారం చేస్తున్నారు. ప్రకృతి రమణీయత..జీవవైవిధ్యం ఓపెన్ ఎయిర్‌జైలు ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉంది. ఎటుచూసినా చెట్లు, పండ్ల తోటలు, పంటలతో అలరారుతోంది. వన్యప్రాణులకూ ఆశ్రయమిస్తోంది. పచ్చనిచెట్ల మధ్య నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు, ముంగిసలు తదితర వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. వీటిని ఖైదీలు, జైలు అధికారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, వైవిధ్యం కల్గివున్నందునే అది ఒక జైలన్న భావన కల్గదు. అక్కడున్న వారు ఖైదీలన్న విషయమూ మరచిపోతాము. (చదవండి: -
పెన్నహోబిలంలో విషాదం..వెలికి తీసేలోపు..
సాక్షి, ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న జలపాతంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి ఓ బాలిక మృతి చెందింది. వివరాలు.... బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లికి చెందిన గోపాలకృష్ణారెడ్డి, హిమబిందు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహిత (14) అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో గురువారం ఉదయం పిల్లలను పిలుచుకుని తల్లి పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చింది. ఆలయంలో పూజలు ముగించుకుని దిగువన ఉన్న జలపాతం వద్దకు చేరుకున్నారు. సెల్‌ఫోన్‌తో సరదాగా ఫొటోలు దిగారు. ఈ క్రమంలో జలపాతానికి ఎగువన పిల్లలు వరుసగా నిలబడి ఉండగా తల్లి ఫొటో తీసింది. అదే సమయంలో నీళ్లలో ఉన్న పాచి పట్టిన రాతిపై కాలు పెట్టిన మహిత ఒక్కసారిగా జారిపడి జలపాతం దిగువకు కొట్టుకుపోయింది. గమనించిన తల్లి ఒక్కసారిగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయడంతో కొందరు యువకులు జలపాతంలోకి దూకి మహిత కోసం గాలింపు చేపట్టారు. అప్పటికే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మహితను జలపాతానికి ఫర్లాంగు దూరంలో యువకులు గుర్తించి వెలికి తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని మహితను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: నా చావుకు ఎవరూ కారణం కాదు! అంటూ సెల్ఫీ వీడియో పంపి..) -
కొండమీదరాయా.. గోవిందా
బుక్కరాయసముద్రం: గోవింద నామస్మరణతో బుక్కరాయసముద్రం మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి దివ్యమంగళరూపం దర్శనంతో పులకించిపోయింది. భక్తుల జయజయ ధ్వానాలు..అర్చకుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ దేవరకొండపై వెలసిన వెంకటరమణుడు భక్తుల చెంతకే చేరేందుకు కొండ దిగిరాగా... బుక్కరాయసముద్రం ఆధ్యాత్మిక సాగరమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం కొండమీద రాయుని రథోత్సవం రమణీయంగా సాగింది. కమనీయం... కల్యాణం రథోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటలకే అర్చకులు బుక్కరాయసముద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కొండమీదరాయునికి, శ్రీదేవి భూదేవికి కల్యాణ మహోత్సవం జరిపించారు. 10.30 గంటలకు కొండమీదరాయుడిని భూదేవి, శ్రీదేవిని సూర్య ప్రభ వాహనంపై కొలువుదీర్చారు. రథం ముందర బ్రాహ్మణులు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. 11.30 గంటలకు రథోత్సవం ప్రారంభం కాగా, జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక నుంచి తరలివచ్చిన భక్తులు ‘‘కొండమీదరాయా...గోవిందా’ అంటూ దేవదేవున్ని కీర్తించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పాత పంచాయతీ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం సాయంత్రం వేళ పాత పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమై బ్రాహ్మణవీధి మీదుగా వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గరకు చేరింది. అనంతరం భక్తులు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కొండపై వెలసిన కొండమీద వెంకటరమణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ కమిటీవారు, దాతలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. -
టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, అనంతపురం: బుక్కరాయసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ నేతలు అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసి.. గ్రామాల మధ్య చిచ్చుపెడుతున్నారని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ కార్యకర్త నాగరాజు ఇంటికి వెళ్లే దారి మూసేశారంటూ ఫోటోలు తీసి.. తన ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎల్లోమీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన రెవెన్యూ, పోలీసు అధికారులు టీడీపీ నేతల ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి దారి మూసేయలేదని.. తన స్థలం హద్దుల్లో బండలు వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై టీడీపీ నేతలను ప్రశ్నించగా వారి మధ్య వివాదం రాజుకుంది. -
కొనసాగుతున్న టీడీపీ దాడులు
సాక్షి, అనంతపురం : మండలంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆదివారం సంజీవపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తెలిపిన మేరకు.. సంజీవపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ నేత ఈశ్వరరెడ్డి, టీడీపీ నాయకుడు సోమశేఖర్‌రెడ్డి మధ్య భూమిలో పైపులైన్ వివాదం ఉంది. దీనిపై రెండు గ్రూపుల మధ్య మాటల యుద్ధం సాగింది. కక్ష పెంచుకున్న సోమశేఖరరెడ్డి, సూర్యప్రతాప్‌రెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులు కర్రలతో ఈశ్వరరెడ్డి, అతని కుమారుడు మహేశ్వరరెడ్డి, తమ్ముడు రాజశేఖరరెడ్డిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈశ్వరరెడ్డి, రాజశేఖరరెడ్డిని కుటుంబసభ్యలు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. కాగా, ఈశ్వరరెడ్డి, అతని బంధువులు గతంలో టీడీపీలో ఉండేవారని, గత ఎన్నికల సమయంలో వారు వైఎస్సార్సీపీలో చేరడంతో జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు కక్ష పూరితంగానే దాడులకు తెగబడినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. -
ఊహించని ప్రమాదం.. అయ్యో పాపం!
సాక్షి, బుక్కరాయసముద్రం: కాలం కలిసి రాకుంటే కర్రే పామై కాటేస్తుందనే నానుడి ఓ ఎంబీఏ విద్యార్థిని విషయంలో నిజమైన దుర్ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ‘మాకు ఏ దిష్టీ తగలకుండా చూడు స్వామీ’ అంటూ ఆర్టీసీ బస్సులోంచి రోడ్డుపైన ఎవరో కొట్టిన టెంకాయ చిప్ప కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన పెద్దన్న గార్లదిన్నె–అనంతపురం మధ్య ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం గార్లదిన్నె పీహెచ్సీ నుంచి ఏఎన్ఎంలు వెంకటలక్ష్మి, చంద్రకళ, ఎస్తేరి, ఫార్మసిస్ట్ హర్ష, షాకీర్ డెంగీ దినోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకుని పెద్దన్న ఆటోలో అనంతపురానికి బయల్దేరారు. కాగా, అనంతపురంలోని సీఆర్ఐటీ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న రొద్దం మండలం సోలేమర్రి గ్రామానికి చెందిన హనుమంతరాయుడు కుమార్తె అశ్వని (22) బుక్కరాయసముద్రం మండలం వడియంపేట వద్దనున్న షిరిడిసాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఎంబీఏ సప్లిమెంటరీ పరీక్ష రాసి వస్తోంది. అనంతపురం వచ్చేందుకు అదే ఆటోలో ఆమె కూడా ఎక్కింది. ఆటో సోములదొడ్డి దాటి తడకలేరు వద్దకు రాగానే గుంతకల్లుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులోనుంచి ఎవరో దిష్టి మొక్కు తీర్చుకునేందుకు టెంకాయను రోడ్డుపైన బలంగా కొట్టారు. పగిలిన ఆ టెంకాయ చిప్పలు వేగంగా దూసుకురావడంతో పెద్దన్న ఆటోకు తగిలి అద్దం పగిలింది. ఈ హఠాత్పరిణామంతో ఆటో వేగం అదుపుకాక రోడ్డుపై నుంచి కిందకు బోల్తా పడింది. ప్రమాదంలో అశ్వని, ఆటో డ్రైవర్ పెద్దన్న, ఫార్మసిస్ట్ హర్ష, ఏఎన్ఎంలు వెంకటలక్ష్మి, చంద్రకళ, ఎస్తేరి, షాకీర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఎంబీఏ విద్యార్థిని అశ్వని మృతి చెందింది. మిగిలిన ఆరుగురు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జగన్ రావాలి.. నీరు పారాలి
సాక్షి,బుక్కరాయసముద్రం: నియోజకవర్గంలో సాగు నీటి కోసం వైఎస్సార్సీపీతో పాటు రైతులు కూడా ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయిందని... మరోసారి టీడీపీకి ఓటు వేస్తే మళ్లీ సాగునీళ్లు అందకుండా చేస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. సాగునీరు పారాలంటే.. వైఎస్సార్సీపీకి పట్టంకట్టాలన్నారు. ఆదివారం బుక్కరాయసముద్రం మండలంలోని బాట్లో కొత్తపల్లి , వడియంపేట, పొడరాళ్ల, రేగడి కొత్తూరు, గోవిందపల్లి, భద్రంపల్లి, కొట్టాలపల్లి, బోయకొట్టాల, రాఘవేంద్ర కాలనీ, బీజేపీ కాలనీల్లో జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు అభివృద్ధిని పక్కన పెట్టి దోచుకోవడం.. దాచుకోవడంలోనే ఈ ఐదేళ్లు బిజీగా ఉన్నారని విమర్శించారు. శింగనమల నియోజకవర్గంలో సాగునీళ్లు లేక ఓ వైపు రైతులు, తాగునీరు లేక మరోవైపు ప్రజలు అల్లాడిపోతున్నా అధికార పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కళ్లెదుటే హెచ్ఎల్సీ కాలువ ద్వారా నీళ్లు వెళ్తున్నా వాటిని వాడుకోలేని దుస్థితిని కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల అసమర్థతను ఆసరాగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఈ నీటిని అక్రమంగా తరలించుకుపోయారని గుర్తు చేశారు. అంతే కాకుండా వారి చెప్పు చేతుల్లో ఉం డేవారికే టిక్కెట్లు ఇప్పించారని, మరోసారి టీడీపీకి ఓటు వేస్తే శింగమల నియోజకవర్గానికి నీటిగండం తప్పదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శింగనమల నియోజకవర్గం లోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించి తీరుతామన్నారు. ఒక్క అవకాశం ఇస్తే శింగనమల ని యోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. జోరుగా ప్రచారం బుక్కరాయసముద్రం మండలంలో జొన్నలగడ్డ పద్మావతి నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మండలంలోని బాట్లో కొత్తపల్లి, వడియంపేట, పొడరాళ్ల, రేగడికొత్తూరు, గోవిందపల్లి కొట్టాలపల్లి గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున జొన్నలగడ్డ పద్మావతికి ఘన స్వాగతం పలికారు. గ్రామాలలో భారీగా టపాసులు పేలుస్తూ పూలతో స్వాగతం పలికారు. దళిత కాలనీలలో జొన్నలగడ్డ పద్మావతికి మహిళలు స్వాగతం పలికి సమస్యలు చెప్పుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటామని పద్మావతి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ అంకే నరేష్ తో పాటు ఆలూరి రమణారెడ్డి, కొర్రపాడు బాల నాగిరెడ్డి, గువ్వల రాజశేఖర్‌రెడ్డి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు
బుక్కరాయసముద్రం : మండలంలో కొండమీదరాయుని ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నారు. అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటికే మండలవాసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 3న శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తి విగ్రహాలను సాయంత్రం కొండపైకి తీసుకెళతారు. 4న దేవరకొండపై ఉత్సవ విగ్రహాలకు పుణ్యహవచనము, అంకురార్పణ నిర్వహిస్తారు. 5న సింహవాహనం, 6న శేష వాహనం,7న హనుమద్వాహనం,8న గరుడ వాహనం, 9న గజ వాహనంపై ఊరేగిస్తారు.10న కళ్యాణ మహోత్సవం అనంతరం సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తారు. 11న అశ్వవాహనంపై , 12న హంస వాహనంపై ఊరేగిస్తారు. -
వెలుగు బుక్ కీపర్ అదృశ్యం
బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన సుంకన్న(28) అదృశ్యమైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. వెలుగులో బుక్ కీపర్‌గా పని చేసే సుంకన్నకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గూగూడులో జరిగిన పీర్ల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం రాత్రి వెళ్లిన ఆయన, తిరిగి బైక్‌లో స్వగ్రామానికి బయలుదేరాడన్నారు. బుక్కరాయసముద్రంలోని హెచ్ఎల్సీ కాలువ వద్ద బైక్ ఉండగా, సుంకన్న సెల్‌ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. అప్పటి నుంచి అతని ఆచూకీ లేకపోవడంతో బంధువులు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏదైనా హాని తలపెట్టారా?అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పారిపోయిన జీవిత ఖైదీ అరెస్ట్
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జిల్లా ఓపన్ ఎయిర్ జైలు నందు ఇటీవల పారిపోయిన ఓ జీవిత ఖైదీని అరెస్ట్ చేసినట్లు జైలు సూపరిండెంట్ ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓపన్ ఎయిర్ జైలు నందు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అనంతపురం మహాత్మాగాంధీ కాలనీకి చెందిన వడ్డే చంద్రశేఖర్‌రెడ్డికి 2004 మార్చిలో హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. ఐదేళ్లు పూర్తయిన తర్వాత 2009లో అనంతపురం ఓపన్ ఎయిర్‌జైలుకు తీసుక వచ్చారు. ఇక్కడ జైలు నందు వ్యవసాయ పనులు చేసుకుంటూ శిక్షను అనుభవిస్తూ ఉండేవాడు. అయితే ముద్దాయి చంద్రశేఖర్‌రెడ్డి జనవరి 2013లో అధికారులకు కల్లుకప్పి పారిపోయాడు. అప్పటిలో బీకేఎస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి జైలు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని అన్నా నగర్లో ఉన్నట్లు సమాచారం అందడంతో హెడ్ వార్డెన్ క్రిష్ణయ్య, వార్డెన్ రంగనాయక్‌లు గురువారం చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. -
కాలువలో పడి వ్యక్తి గల్లంతు
అనంతపురం: ముఖం కడుక్కుందామని కాలువలో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతపురం మండలం తాడ్చర్ల గ్రామానికి చెందిన పుల్లయ్య(55) కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పనికోసం కేకే అగ్రహారం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కాళ్లు చేతులు కడుక్కోవడానికి వెంకటాపురం సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలోకి దిగాడు. ప్రమాదవశాత్తు అందులో జారిపడి నిళ్లలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతయిన వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించారు. (బుక్కరాయసముద్రం)