బుక్కరాయసముద్రం: గోవింద నామస్మరణతో బుక్కరాయసముద్రం మార్మోగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి దివ్యమంగళరూపం దర్శనంతో పులకించిపోయింది. భక్తుల జయజయ ధ్వానాలు..అర్చకుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ దేవరకొండపై వెలసిన వెంకటరమణుడు భక్తుల చెంతకే చేరేందుకు కొండ దిగిరాగా... బుక్కరాయసముద్రం ఆధ్యాత్మిక సాగరమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం కొండమీద రాయుని రథోత్సవం రమణీయంగా సాగింది.
కమనీయం... కల్యాణం
రథోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటలకే అర్చకులు బుక్కరాయసముద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కొండమీదరాయునికి, శ్రీదేవి భూదేవికి కల్యాణ మహోత్సవం జరిపించారు. 10.30 గంటలకు కొండమీదరాయుడిని భూదేవి, శ్రీదేవిని సూర్య ప్రభ వాహనంపై కొలువుదీర్చారు. రథం ముందర బ్రాహ్మణులు హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. 11.30 గంటలకు రథోత్సవం ప్రారంభం కాగా, జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక నుంచి తరలివచ్చిన భక్తులు ‘‘కొండమీదరాయా...గోవిందా’ అంటూ దేవదేవున్ని కీర్తించారు.
వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పాత పంచాయతీ కార్యాలయం వరకూ సాగింది. అనంతరం సాయంత్రం వేళ పాత పంచాయతీ కార్యాలయం నుంచి ప్రారంభమై బ్రాహ్మణవీధి మీదుగా వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గరకు చేరింది. అనంతరం భక్తులు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కొండపై వెలసిన కొండమీద వెంకటరమణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ కమిటీవారు, దాతలు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment