సంఘటనా స్థలంలో రక్తం మడుగులో ఆటో డ్రైవర్ పెద్దన్న, అశ్వని
సాక్షి, బుక్కరాయసముద్రం: కాలం కలిసి రాకుంటే కర్రే పామై కాటేస్తుందనే నానుడి ఓ ఎంబీఏ విద్యార్థిని విషయంలో నిజమైన దుర్ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ‘మాకు ఏ దిష్టీ తగలకుండా చూడు స్వామీ’ అంటూ ఆర్టీసీ బస్సులోంచి రోడ్డుపైన ఎవరో కొట్టిన టెంకాయ చిప్ప కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన పెద్దన్న గార్లదిన్నె–అనంతపురం మధ్య ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం గార్లదిన్నె పీహెచ్‌సీ నుంచి ఏఎన్‌ఎంలు వెంకటలక్ష్మి, చంద్రకళ, ఎస్తేరి, ఫార్మసిస్ట్ హర్ష, షాకీర్ డెంగీ దినోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకుని పెద్దన్న ఆటోలో అనంతపురానికి బయల్దేరారు.
కాగా, అనంతపురంలోని సీఆర్‌ఐటీ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న రొద్దం మండలం సోలేమర్రి గ్రామానికి చెందిన హనుమంతరాయుడు కుమార్తె అశ్వని (22) బుక్కరాయసముద్రం మండలం వడియంపేట వద్దనున్న షిరిడిసాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఎంబీఏ సప్లిమెంటరీ పరీక్ష రాసి వస్తోంది. అనంతపురం వచ్చేందుకు అదే ఆటోలో ఆమె కూడా ఎక్కింది. ఆటో సోములదొడ్డి దాటి తడకలేరు వద్దకు రాగానే గుంతకల్లుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులోనుంచి ఎవరో దిష్టి మొక్కు తీర్చుకునేందుకు టెంకాయను రోడ్డుపైన బలంగా కొట్టారు. పగిలిన ఆ టెంకాయ చిప్పలు వేగంగా దూసుకురావడంతో పెద్దన్న ఆటోకు తగిలి అద్దం పగిలింది.
ఈ హఠాత్పరిణామంతో ఆటో వేగం అదుపుకాక రోడ్డుపై నుంచి కిందకు బోల్తా పడింది. ప్రమాదంలో అశ్వని, ఆటో డ్రైవర్ పెద్దన్న, ఫార్మసిస్ట్ హర్ష, ఏఎన్‌ఎంలు వెంకటలక్ష్మి, చంద్రకళ, ఎస్తేరి, షాకీర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఎంబీఏ విద్యార్థిని అశ్వని మృతి చెందింది. మిగిలిన ఆరుగురు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment