
సాక్షి, అనంతపురం : మండలంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆదివారం సంజీవపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తెలిపిన మేరకు.. సంజీవపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ నేత ఈశ్వరరెడ్డి, టీడీపీ నాయకుడు సోమశేఖర్‌రెడ్డి మధ్య భూమిలో పైపులైన్ వివాదం ఉంది. దీనిపై రెండు గ్రూపుల మధ్య మాటల యుద్ధం సాగింది. కక్ష పెంచుకున్న సోమశేఖరరెడ్డి, సూర్యప్రతాప్‌రెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులు కర్రలతో ఈశ్వరరెడ్డి, అతని కుమారుడు మహేశ్వరరెడ్డి, తమ్ముడు రాజశేఖరరెడ్డిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈశ్వరరెడ్డి, రాజశేఖరరెడ్డిని కుటుంబసభ్యలు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. కాగా, ఈశ్వరరెడ్డి, అతని బంధువులు గతంలో టీడీపీలో ఉండేవారని, గత ఎన్నికల సమయంలో వారు వైఎస్సార్‌సీపీలో చేరడంతో జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు కక్ష పూరితంగానే దాడులకు తెగబడినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.