మహిళల సమస్యలు తెలుసుకుంటున్న పద్మావతి, ప్రచారంలో కార్యకర్తల కోలాహలం ఇలా..
సాక్షి,బుక్కరాయసముద్రం: నియోజకవర్గంలో సాగు నీటి కోసం వైఎస్సార్‌సీపీతో పాటు రైతులు కూడా ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయిందని... మరోసారి టీడీపీకి ఓటు వేస్తే మళ్లీ సాగునీళ్లు అందకుండా చేస్తారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. సాగునీరు పారాలంటే.. వైఎస్సార్‌సీపీకి పట్టంకట్టాలన్నారు. ఆదివారం బుక్కరాయసముద్రం మండలంలోని బాట్లో కొత్తపల్లి , వడియంపేట, పొడరాళ్ల, రేగడి కొత్తూరు, గోవిందపల్లి, భద్రంపల్లి, కొట్టాలపల్లి, బోయకొట్టాల, రాఘవేంద్ర కాలనీ, బీజేపీ కాలనీల్లో జొన్నలగడ్డ పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు అభివృద్ధిని పక్కన పెట్టి దోచుకోవడం.. దాచుకోవడంలోనే ఈ ఐదేళ్లు బిజీగా ఉన్నారని విమర్శించారు. శింగనమల నియోజకవర్గంలో సాగునీళ్లు లేక ఓ వైపు రైతులు, తాగునీరు లేక మరోవైపు ప్రజలు అల్లాడిపోతున్నా అధికార పార్టీ నేతలు ఏమాత్రం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కళ్లెదుటే హెచ్‌ఎల్‌సీ కాలువ ద్వారా నీళ్లు వెళ్తున్నా వాటిని వాడుకోలేని దుస్థితిని కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రజా ప్రతినిధుల అసమర్థతను ఆసరాగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఈ నీటిని అక్రమంగా తరలించుకుపోయారని గుర్తు చేశారు. అంతే కాకుండా వారి చెప్పు చేతుల్లో ఉం డేవారికే టిక్కెట్లు ఇప్పించారని, మరోసారి టీడీపీకి ఓటు వేస్తే శింగమల నియోజకవర్గానికి నీటిగండం తప్పదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శింగనమల నియోజకవర్గం లోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించి తీరుతామన్నారు. ఒక్క అవకాశం ఇస్తే శింగనమల ని యోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు.
జోరుగా ప్రచారం
బుక్కరాయసముద్రం మండలంలో జొన్నలగడ్డ పద్మావతి నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మండలంలోని బాట్లో కొత్తపల్లి, వడియంపేట, పొడరాళ్ల, రేగడికొత్తూరు, గోవిందపల్లి కొట్టాలపల్లి గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున జొన్నలగడ్డ పద్మావతికి ఘన స్వాగతం పలికారు. గ్రామాలలో భారీగా టపాసులు పేలుస్తూ పూలతో స్వాగతం పలికారు. దళిత కాలనీలలో జొన్నలగడ్డ పద్మావతికి మహిళలు స్వాగతం పలికి సమస్యలు చెప్పుకున్నారు.
పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటామని పద్మావతి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ అంకే నరేష్ తో పాటు ఆలూరి రమణారెడ్డి, కొర్రపాడు బాల నాగిరెడ్డి, గువ్వల రాజశేఖర్‌రెడ్డి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment