పోలింగ్ కేంద్రం వద్ద విక్టరీ సంకేతాన్ని చూపుతున్న సింహాద్రి
సాక్షి, అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే అయిన సింహాద్రి రమేష్‌బాబు రికార్డు మెజారిటీ సా«ధించారు. మొత్తం 19 రౌండ్లకుగానూ 17 రౌండ్లలో వైఎస్సార్‌సీపీ అత్యధిక మెజారిటీ సాధించగా, టీడీపీ రెండు రౌండ్లలో స్వల్ప ఆధిక్యత మాత్రమే కనబరచింది. దివిసీమలో తొలిసారి వైఎస్సార్‌సీపీ విజయ బావుటా ఎగురవేయడంతో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
రికార్డు మెజారిటీ...
అవనిగడ్డ నియోజకవర్గంలో మొత్తం 2,07,240 మంది ఓటర్లు ఉండగా, గత నెల 11న జరిగిన ఎన్నికల్లో 1,82,603 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున సింహాద్రి రమేష్‌బాబు, టీడీపీ తరఫున మండలి బుద్ధప్రసాద్, జనసేన తరఫున ముత్తంశెట్టి కృష్ణారావు పోటీచేయగా త్రిముఖ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్‌బాబు రికార్డు స్థాయిలో 20,725 మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీగా నమోదైంది. 1962లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983లో జరిగిన తొలి ఎన్నికల మెజారిటీ 10,668 ఇప్పటి వరకూ అత్యధిక మెజారిటీగా నమోదైంది.
అంతకంటే రెట్టింపు మెజారిటీ సాధించిన సింహాద్రి దివిసీమ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేశారు. ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మరణంతో 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన తనయుడు అంబటి శ్రీహరి ప్రసాద్ పోటీచేయగా, ఇంటిపెండెంట్ అభ్యర్థిపై 61,644 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నిక కావడం, ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో సింహాద్రికి పోస్టల్ బ్యాలెట్స్‌తో కలుపుకుని 78,434 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి మండలి బుద్ధప్రసాద్‌కు 57,701 ఓట్లు వచ్చాయి. 20,725 ఓట్ల బంపర్ మెజారిటీతో సింహాద్రి విజయ దుందుభి మ్రోగించారు.
Comments
Please login to add a commentAdd a comment