
శింగనమల: ఎన్నికల్లో శింగనమల ఫలితంకోసం జిల్లా వాసులంతా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే 1978 నుంచి ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే...ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ ఈ సెంటిమెంట్ పండింది. శింగనమల నియోజకవర్గం 1978లో ఎస్సీకి రిజర్వ్ కాగా అప్పుడు జనతా పార్టీ నుంచి బి.రుక్మిణీదేవి ఇక్కడి నుంచి గెలవగా... రాష్ట్రంలో జనత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983లో టీడీపీ తరఫున పి.గురుమూర్తి ఎమ్మెల్యేగా ఎన్నికాగా, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 1985లో టీడీపీ తరఫున కె.జయరాం ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి పి.శమంతకమణి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కె.జయరాం ఎన్నిక కాగా, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 1999లోనూ టీడీపీ తరఫున మళ్లీ కె.జయరాం ఎమ్మెలేగా గెలవగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా సాకే శైలజానాథ్ ఎన్నికకాగా...రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009లో కాంగ్రెస్ తరఫున సాకే శైలజానాథ్ విజయం సాధించగా.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. 2014లో టీడీపీ తరఫున యామినీబాల గెలువగా, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. తాజాగా 2019లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించగా... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇలా శింగనమల సెంటిమెంట్ మరోసారి నిజమైంది.
Comments
Please login to add a commentAdd a comment