గోవిందా..హుండీ సొమ్ము మాదంటే మాది! | Dominant Feud Between Monastery And Endowment in Ahobilam | Sakshi
Sakshi News home page

గోవిందా.. ఏమైనా బాగుందా?

Published Mon, Jun 24 2019 7:09 AM | Last Updated on Mon, Jun 24 2019 7:11 AM

Dominant Feud Between Monastery And Endowment in Ahobilam - Sakshi

అహోబిలంలో మఠం, దేవదాయ ధర్మదాయ శాఖల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నో ఏళ్లుగా మఠం, దేవదాయ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పాలనపై మఠం వర్గాలకు నచ్చలేదు. తమ పాలన తామే చేసుకుంటామని కోర్టును ఆశ్రయించడమే గాకుండా రాష్ట్రస్థాయి అధికారులను ఒప్పించి తమకు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవసరం లేదని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు స్టేటస్‌ కో ఉత్తర్వులను  (ఇప్పుడు ఎలా ఉంటే అలాగే పరిపాలన కొనసాగించుకోండి) కోర్టు ఇచ్చింది. ఇలా మూడు నెలలకు పైగా రెండు వర్గాలు ఎత్తులకు, పై ఎత్తులు వేస్తుండటంతో అంతర్గతపోరు తారాస్థాయికి చేరింది.

సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : అహోబిల క్షేత్రంలో వివాదాలు ముదురుతున్నాయి. మఠం, దేవదాయ ధర్మదాయ శాఖ.. పాలన తమేదనంటూ కోర్టును అశ్రయించారు. ప్రస్తుతం పాలన వ్యవహారాలను మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల చర్యలతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

స్టేటస్‌ కో పై ఎవరి వాదన వారిదే.
కోర్టు స్టేటస్‌ కో ఇవ్వడంతో గతంలో ఇక్కడ ఈఓ పరిపాలన ఎలా ఉందో అలా చేసుకోమనే ఇచ్చిందని.. మఠం వారు అడ్డుకుంటున్నారని ఈఓ వాదిస్తుండగా, కాదు స్టేటస్‌ కో ఇచ్చేటప్పటికి (ఆరోజుకు) ఎలా ఉందో అలానే పరిపాలన కొనసాగించుకోవాలని ఇచ్చిందని దీంతో స్టే ఇచ్చే రోజుకు ఈఓ పరిపాలన లేదని న్యాయస్థానంలో సమస్య పరిష్కారమయ్యే వరకు అలానే కొనసాగిస్తామని మఠం ప్రతినిధులు చెబుతున్నారు.  

తారాస్థాయికి చేరుకున్న కుమ్ములాటలు..  
మొన్నటి వరకు దేవస్థాన, మఠం వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు తాజాగా  దేవుడి హుండీ సొమ్ములు బ్యాంకులో జమ చేసే విషయంలో ఇరు వర్గాలు బుధవారం రాత్రి రోడ్డెక్కాయి. రెండు రోజుల పాటు నవనారసింహ క్షేత్రాల్లో హుండీ సొమ్ముల లెక్కింపు చేపట్టారు. లెక్కించిన నగదు దిగువ అహోబిలం బ్యాంక్‌ అధికారులు అక్కడికే వచ్చి ఖాతాలో జమ చేసుకుంటారు. ఈ క్రమంలో జమ చేసుకునేందుకు వచ్చిన బ్యాంక్‌ అధికారులు నగదును అహోబిల మఠం ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఖాతాలో జమ చేసుకుంటుండగా.. అందులో ఎలా జమ చేస్తారు.. ఈఓ ఆధ్వర్యంలోని దేవస్థాన ఖాతాలో జమ చేయాలని ఈఓ మల్లికార్జున ప్రసాద్‌ అడ్డుతగిలారు.

దీంతో మఠం మేనేజర్‌ స్పందిస్తూ..కాదు తమ ఖాతాలోనే జమ చేయాలని సూచించారు. దీంతో కొంత సేపు వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. ఏం చేయాలో దిక్కుతెలియని బ్యాంక్‌ అధికారులు, పెద్ద మనుషుల సూచనల మేరకు సస్పెన్స్‌ ఖాతా తెరిచి జమ చేశారు. గతంలో కూడా ఈఓ ఆధ్వర్యంలో ఎగువ అహోబిలంలో నిత్యన్నదాన సత్రం ప్రారంభించగా తమ అనుమతి లేకుండా ఎలా ప్రారంభిస్తారని.. అన్నప్రసాద సత్రానికి సరుకులు ఇవ్వద్దని మఠం ప్రతినిధులు ఆదేశించడంతో ఈఓ భక్తుల సహాయంతో సత్రం నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న ఈఓ కొందరు తాత్కలిక సిబ్బందిని  నియమించారు. తమను సంప్రదించకుండా ఎలా ఉద్యోగాలిస్తారని, వారికి తామెందుకు వేతనాలివ్వాలని మఠం ప్రతినిధులు వేతనాలు నిలిపివేశారు. అనంతపురం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉన్న మాన్యంను వేలం వేసేందుకు సిబ్బందిని కారులో పంపగా.. అందుకయ్యే ఖర్చులను తాము ఇవ్వమని తెగేసి చెప్పారు. ఇలా రోజుకో ఘటనతో నిత్యం ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం మఠం ఆధ్వర్యంలోనే పాలన..   
గతంలో పనిచేసిన ఈఓ చేసిన అక్రమాలను, స్వామి సొమ్ములు దుర్వినియోగం చేసిన వైనం.. ఆమె  కొనసాగించిన నిర్లక్ష్య పాలనతో పాటు దేవస్థాన ఈఓగా ఉంటూ జైలుకు వెళ్లిన ఘటనలను మఠం ప్రతినిధులు  ఉన్నతస్థాయి అధికారులకు వివరించడంలో సఫలీ కృతులయ్యారు. ఇదే సాకుగా చూపి దేవస్థాన పరువు, ఆదాయం రెండూ పోతున్నాయని ఉన్నతస్థాయి నుంచి సిఫారసు చేయించుకొని ఈఓను బదీలీ చేయించి పరిపాలనను చేతిలోకి తీసుకొని మేనేజర్‌ను నియమించారు. ప్రస్తుతం పాలన మొత్తం మఠం ఆధ్వర్యంలోనే ఉంది.

ఎప్పటిలాగే జమ చేయమని చెప్పాం 
మఠం ఖాతాలో జమ చేయమని చెప్పలేదు. పూర్వం నుంచి ఎలా జమ చేస్తున్నారో అలానే  దేవస్థానం ఖాతకు జమ చేయమని చెప్పాం. ఈ ఖాతా ఆళ్లగడ్డలో ఆంధ్రాబ్యాంక్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఉంది. ఈ ఖాతాలో ఉన్న సొమ్మును ఎవరు పడితే వారు తీయడానికి ఉండదు. మఠం పీఠాధిపతికి మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని అవకతవకలు జరగడంతో ఈఓ అకౌంట్‌ రద్దు చేయించాం.                    
– బద్రీనారాయణ్, అహోబిల మఠం మేనేజర్‌ 

1961 నుంచి తమ పాలన ఉంది 
1961నుంచి అహోబిలంలో దేవదాయ ధర్మదాయ శాఖ పరిపాలన కొనసాగుతోంది. మరి ఇప్పుడు ఎందుకు తమ పాలన ఎందుకు వద్దంటున్నారో అర్థం కావడంలేదు. ప్రస్తుతానికి హుండీ ఆదాయం సస్పెన్సన్‌ అకౌంట్‌లో జమ చేశారు. ప్రస్తుతం హుండీ లెక్కింపు సొమ్మును తమ ఖాతాలో జమ కాకుండా చేయడం సరికాదు.
– మల్లికార్జున ప్రసాద్, ఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement