గత ప్రభుత్వంలో మంజూరై మొదలుకాని కొత్త ఆలయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రేక్
పురాతన ఆలయాల పునరుద్ధరణకు సంబంధించిన 243 పనులు..
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద తలపెట్టిన 1,797 దేవాలయాల పనులూ నిలిపివేత
ఇప్పటికే మొదలైన పనులను మాత్రమే పూర్తిచెయ్యాలని ఆదేశం
అర్చకుల వేతనాలు.. ధూపదీప నైవేద్యం మొత్తం కూడా పెంపు
నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు.. దేవదాయ శాఖ సమీక్షలో నిర్ణయం
సాక్షి, అమరావతి: కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పాత ఆలయాల పునరుద్ధరణకు కామన్ గుడ్‌ఫంఢ్ (సీజీఎఫ్), శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో ఇంకా ప్రారంభంకాని వాటన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టాలని సీఎం చంద్రబాబు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదలైన పనులను మాత్రమే పూర్తిచెయ్యాలన్నారు.
దేవదాయ శాఖ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజీఎఫ్ కార్యక్రమంలో పాత ఆలయాల పునరుద్ధరణకు సంబందించి గత ప్రభుత్వంలో మంజూరై ఇంకా మొదలుకాని 243 పనులను సైతం పక్కన పెట్టాలంటూ సీఎం ఆదేశించారు. అలాగే, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1,797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదని, వాటినీ నిలిపివేయాలని ఆయన చెప్పారు.
గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షలు ఇచ్చేవారని.. వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యంకావడంలేదని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ మొత్తాన్ని పెంచడానికి, ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం సూచించారు.
ఆలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదు..
దేవాలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో స్పష్టంచేశారు. ఏ మతంలో అయినా భక్తుల మనోభావాల ముఖ్యమని.. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా దేవాదాయ శాఖాధికారులు పనిచేయాలని సూచించారు.
అలాగే, రాష్ట్రంలో ఇకపై ఎక్కడా బలవంతపు మత మారి్పళ్లు ఉండకూడదన్నారు. రూ.20 కోట్లు కంటే ఎక్కువ వార్షికాదాయం ఉండే ఆలయ ట్రస్టు బోర్డుల్లో ప్రస్తుతం 15 మందిని సభ్యులుగా నియమిస్తుండగా, ఆ సంఖ్యను 17కు పెంచే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. అదనంగా పెంచిన సభ్యుల సంఖ్యలో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణునికి అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.
ఇక రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని.. ఈ విషయంలో ప్రణాళికలతో రావాలని సీఎం అధికారులను కోరారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయించారు.
అర్చకుల వేతనాలు పెంపు..
దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే పలువురు అర్చకుల వేతనాల పెంపుపైనా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా..
» ప్రస్తుతం రూ.10 వేల వేతనంతో పనిచేసే అర్చకులకు ఇకపై రూ.15 వేలు చెల్లించాలని నిర్ణయించారు.
» తక్కువ ఆదాయం ఉండే ఆలయాలలో ధూపదీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు అందజేసే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు.
» అలాగే, వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని సీఎం సూచించారు.
» అంతేకాక.. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
» వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు.
గోదావరి, కృష్ణా నదీ హారతులు మళ్లీ..
గోదావరీ, కృష్ణా నదీ హారతులు మళ్లీ నిర్వహించాలని సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే, ప్రతి దేవాలయంలో ఆన్‌లైన్ విధానం అమలుచేయాలని, అన్ని సర్విసులు ఆన్‌లైన్ ద్వారా అందాలన్నారు. అవసరమైతే ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతులు కల్పించాలన్నారు. దేవాలయాలకు విరాళాలిచి్చన వారిని ప్రోత్సహించాలని.. వారి పేర్లు ప్రకటించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment