సాక్షి, అహోబిలం (ఆళ్లగడ్డ): అహోబిల లక్ష్మీనారసింహుడు ఎందరో భక్తుల ఇష్టదైవం. వివిధ ప్రాంతాల నుంచి ఏటా లక్షలాది మంది స్వామి దర్శనానికి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కుకుని ముడుపులు కుడుతారు. భక్తులకు, అన్నార్థులకు అన్నదానం చేస్తే మహా పుణ్యం వస్తుందని ఇక్కడి పండితులు చేసే ప్రవచనాలకు ప్రభావితమై అన్నదాన పథకానికి లక్షలాది రూపాయలు విరాళాలు ఇస్తారు. ఇలా యేటా కోటిరూపాయల దాక వస్తుంటాయి. ఇంత భారీగా నిధులు వస్తున్నా అన్నప్రసాదం తయారీ విషయంలో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. ఇక్కడి భోజనం తిని పలువురు భక్తులు నిత్యం అస్వస్థతకు గురవుతున్నా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
మొక్కుబడి బియ్యం, బేడలతోనే వంట
స్వామి, అమ్మవారికి మొక్కుబడిలో భాగంగా భక్తులు బియ్యం, బేడలు సమర్పించడం ఆనవాయితీ. ఒక్కో భక్తుడు ఒక్కో రకం బియ్యం తీసుకు వచ్చి హుండీలో పోస్తుంటాడు. ఈ మధ్యం కాలంలో చాలా మంది స్టోర్ బియ్యం సమర్పిస్తున్నారు. వాటిని మఠం సిబ్బంది, అధికారులు సంచుల్లో పోసి ఓ గదిలో మూలన పడేస్తారు. అక్కడ ఎలుకలు, కొక్కులు తిరుగుతుంటాయి. తర్వాత ఆ బియ్యం, బేడలను శుభ్రం చేయకుండానే అన్నం, పప్పు చేసి భక్తులకు వడ్డిస్తున్నట్లు సమాచారం.
దీంతో అన్నం గంజికట్టుకు పోయి, మెత్తబడి ఉంటుంది. దేవుడి ప్రసాదం కావడంతో ఆ అన్నం పారవేయలేక అలాగే తింటున్నట్లు భక్తులు చెబుతున్నారు. ఇక పప్పు మరీ అధ్వానంగా ఉంటుంది. పప్పుగుత్తి లేదని ఎనపకుండనే కందిబేడలు, ఆకు ఉడకబెట్టి వడ్డిస్తున్నారు. తర్వాత అది అజీర్ణం కాక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సాంబరు కూడా ఇక్కడ రంగునీళ్ల మాదిరిగా ఉంటుందని వారు చెబుతున్నారు.
కోట్లలో నిధులు.. వందల్లో ఖర్చు
మీ పేరు మీద అన్నదానం నిర్వహిస్తామంటూ ఎగువ, దిగువ, పావణ నరసింహ స్వామి గుళ్లదగ్గర ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసుకుని భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తుంటారు. ఈ విరాళాలేకాక మొక్కుబడి ఉన్న భక్తులు కార్యాలయంలో సంప్రదించి లక్షల రూపాయలు నేరుగా లేదా చెక్కుల రూపంలో అందజేస్తుంటారు. ప్రస్తుతం రూ. 6 కోట్ల మేర అన్నదాన నిధి నిల్వ ఉన్నట్లు సమాచారం. గత ఒక యేడాదే సుమారు రూ. 2.5 కోట్లు విరాళాల రూపంలో వచ్చినట్లు సమాచారం. ఇంత భారీగా విరాళాలు వస్తున్నా భక్తులకు రోజు వందల రూపాయల్లో కూడా ఖర్చు పెట్టి అన్నప్రసాదం పంపిణీ చేయలేక పోతున్నారు. రోజుకు 50 మందికి మాత్రమే భోజనం టోకన్లు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment