నిరుపేదలకు దూరదర్శనం
రూ.50 టిక్కెట్ తీసుకుంటేనే స్వామి సన్నిధికి..
వీరికే హారతి, తీర్థప్రసాదం
రూ.10 భక్తులకు కనిపించని స్వామి
నిరాశతో వెనుదిరుగుతున్న భక్తులు
ఆళ్లగడ్డ టౌన్ : దేవుని దృష్టిలో అందరూ సమానమే. దూర దర్శనం.. సర్వదర్శనం.. ప్రత్యేక దర్శనం.. ఇలాంటివెన్ని ఉన్నా.. స్వామి వద్దకు వచ్చే సరికి అందరినీ ఒకేలా చూడాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. పేద, ధనిక భక్తులను రెండుగా విభజించి మనోభావాలను దెబ్బతీయడం చర్చనీయాంశమవుతోంది. నిరుపేదలు కనీసం గర్భగుడి గడప తాకేందుకు కూడా అవకాశం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ తేడా పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న భక్తులు పలువురు ఆలయ అధికారుల తీరును నిరసించారు.
వీఐపీ టిక్కెట్ తీసుకున్నా.. క్యూలో నిల్చోకుండా నేరుగా స్వామి వద్దకు పంపుతారే తప్ప, ఇలా డబ్బు ఎక్కువగా ఇచ్చిన వారిని మాత్రమే స్వామి సన్నిధికి తీసుకెళ్లడం ఏమిటని వారు ప్రశ్నించారు. పైగా వీరికి మాత్రమే అర్చన, హారతి, తీర్థం, శఠగోపంతో ఆశీర్వదించడం వివాదాస్పదమవుతోంది. రూ.10 టిక్కెట్ తీసుకున్న సామాన్య భక్తులను చాలా దూరం నుంచి లోపలకు వెళ్లిన వెంటనే క్షణాల్లో బయటకు పంపేయడం విమర్శలకు తావిస్తోంది. వీరికి మూలవిరాట్ లక్ష్మీనరసింహ స్వామి సరిగ్గా కనిపించకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.
రూ.50 టిక్కెట్ తీసుకున్న గర్భగుడిలోకి వెళ్లిన భక్తులు స్వామికి అడ్డంగా నిల్చొని కుటుంబ సభ్యుల గోత్రాలు, నక్షత్రాలు చెప్పి అర్చన చేయించుకుంటుండటంతో సామాన్యు భక్తులకు స్వామి దర్శనభాగం లభించడం లేదు. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నరసింహ స్వామి నామస్మరణతో తమ భాగ్యం ఇంతేనని సరిపెట్టుకుంటున్నారు. ఇదిలాఉంటే ఆలయ ఆవరణలో ఏ టిక్కెట్ తీసుకుంటే.. ఎలాంటి దర్శనం కల్పిస్తారనే సమాచారం ఎక్కడా లేకపోవడం కూడా భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
భక్తులకు ఇబ్బంది కలగనీయం: గాయత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్
రూ.50 టిక్కెట్ తీసుకుంటే స్వామి సన్నిధికి తీసుకెళ్లి పూజలు చేయించడం.. రూ.10 టిక్కెట్ తీసుకున్న భక్తులకు గుడి బయట తీర్థం ఇస్తున్న విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. స్వామి దృష్టిలో భక్తులంతా సమానమే. ఆ మేరకు చర్యలు చేపడతాం.
దేవదేవుడు.. కొందరివాడు!
Published Sun, May 17 2015 4:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement