చంద్రబాబు పరార్
♦ ‘ఓటుకు కోట్లు’ దెబ్బతో హైదరాబాద్ వదిలారు
♦ ‘సాక్షి’తో మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అది మంత్రి హరీశ్‌రావు అధికారిక నివాసం.. ‘నా కొడుకు గుండెకు రంధ్రం పడింది.. ఆపరేషన్‌కు డబ్బు లేదు’ అని ఓ తండ్రి కన్నీళ్లు. ‘నా పెనిమిటిని పోలీసులు పట్టుకపోయిండ్రయ్యా’ అని ఓ మహిళ ఆవేదన. ‘బోరు బాయికి కరెంటు కనెక్షన్ అడిగితే ఏఈ సారు దమ్ము దమ్ము జేస్తున్నడు’ అని ఓ రైతు మొర..
వారందరి బాధలు వింటూ అధికారులకు ఫోన్లు కలుపుతున్నారు మంత్రి. కచ్చితంగా పని చేయాలని ఆదేశాలిస్తున్నారు. ఎన్నికల స్పెషలిస్టుగా.. టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన హరీశ్‌రావును ‘సాక్షి’ పలకరించగా.. తన మనసులోని భావాలను ఇలా బయటపెట్టారు. మంత్రి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
బాబు ఎత్తుగడలు తెలియనివి కావు..
చంద్రబాబు నాయుడు ఎన్నికల ఎత్తుగడలు మనకు తెలియనివి కావు. ఆరు నెలల ముందే డబ్బు ఎక్కడెక్కడకు చేర్చాలో అక్కడకు చేర్చి రాజకీయాలు చేస్తారు. పత్రికలు, ప్రెస్‌మీట్లతో నానా హడావుడి చేసేవారు. కానీ ‘ఓటుకు కోట్లు’ దెబ్బతో హైదరాబాద్ వదిలి పరారయ్యారు. ఆరు నెలల నుంచి ఇక్కడ అసలు కనిపించడం లేదు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి నాయకుడు లేని సేనల తీరుగా మారింది.
ఇక గ్రేటర్‌లో వాళ్లకు గెలుపు పరిస్థితి ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ. దీటుగా నడిపించే నాయకుడు లేడు. మెజారిటీ స్థానాలు కాదు... నాకు ఉన్న సమాచారం మేరకు కాంగ్రెస్ గ్రేటర్‌లో కేవలం 10 సీట్లయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. కేవలం ఆ 10 సీట్ల మీదనే కసరత్తు చేస్తూ కాలం గడుపుతోంది. హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యతో బీజేపీ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. అందులోంచి ఎలా బయట పడాలని వాళ్లు ఆలోచన చేస్తున్నారు. ఈ కేసు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మెడకు చుట్టుకుంది. ఆయన పదవిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఇంకా ఉసురు పోసుకోవాలా?
నాకు తెలిసి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నారాయణఖేడే. ఇక్కడి ప్రజలు కనీస మౌలిక వసతులకు దూరంగా ఉన్నారు. తాగడానికి సురక్షితమైన నీళ్ల సంగతి దేవుడెరుగు. కనీసం తాగడానికి నీళ్లు లేవు. రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కాలేజీలు ఏమీ లేవు. కుటుంబంలో సగటున ఒకరి జీవితం మొత్తం నీళ్లు మోయడానికే సరిపోతుంది. రికార్డులు చూస్తే రూ.వందల కోట్లు నారాయణఖేడ్‌కు కేటాయించినట్లు ఉంది. మరి ఈ నిధులు ఎటుపోయాయి. ఆస్పత్రులు, కాలేజీలు అన్ని వాళ్ల కుటుంబాలకే. వైద్యం చేయించుకోవాలంటే వాళ్ల ఆసుపత్రికే వెళ్లాలి..
చదువుకోవాలంటే వాళ్ల కాలేజీకే వెళ్లాలి. ఇక్కడి ప్రజల ప్రధాన జీవన ఆధారం వ్యవసాయం. కానీ ఇప్పటి వరకు ఇక్కడ వ్యవసాయ మార్కెట్ లేదు. ఎవరు కారణం? సింపతీ కోసమని మళ్లీ ఆ కుటుంబానికే అధికారం అప్పగించి లక్షల మంది నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకోవాలా? మిగిలిన రాష్ట్రా ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయిన చోట కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. రాష్ట్రానికో నీతి అవలంబిస్తామంటే ఎలా కుదురుతుంది? పైగా ఓ కుటుంబం ఈ పర్యాయం పోటీ చేస్తే, మరో కుటుంబం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. ప్రజా సేవ అంటే ఒప్పంద పత్రాలు రాసుకోవడమా?
త్వరలోనే చెంచులను కలుస్తా
ఓ జర్నలిస్టు మిత్రుడు రాసిన ‘మరణం అంచున’ పుస్తకావిష్కణ సభలో నల్లమల చెంచులను కలవటం జరిగింది. నిజంగా చెంచులు కల్మషం లేని మనుషులు. చెంచు జాతి అభివృద్ధి కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని ఆ రోజు సభలో మాట ఇచ్చాను. వాళ్లు నా కోసం ఎదురు చూస్తుంటారు. వీలైనంత త్వరలో మరోసారి నల్లమలకు వెళ్తా. అడవిలో తిరిగి చెంచులను కలుస్తాను. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తా. చెంచు జాతి రక్షణ కోసం ఏమేమి చేయాలో అవి తప్పకుండా చేస్తాం. అపురూపమైన ఆ జాతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత.
నీళ్లు కావాలా? మొసలి కన్నీళ్లు కావాలా?
నారాయణఖేడ్‌లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాం. దాదాపు రూ.750 కోట్లతో మిషన్ భగీరథ పనులు ప్రారంభించాం. ప్రతి గ్రామాన్ని కలుపుతూ బీటీ రోడ్డు వేస్తున్నాం. నారాయణపేట, పెద్ద శంకరంపేట పట్టణాల్లో వ్యవసాయ మార్కెట్‌ను మంజూరు చేశాం. దుబ్బాక తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంతకాలం నియోజకవర్గ అభివృద్ధి నిరోధకులే మళ్లీ ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. తండ్రి చనిపోయాడంటూ మొసలి కన్నీళ్లతో సింపతీ ఓట్లు పిండుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నీళ్లు కావాలో? మొసలి కన్నీళ్లు కావాలో నారాయణఖేడ్ ప్రజలకు తెలుసు. అభివృద్ధి అంటే ఏమిటో కళ్లారా చూస్తున్నారు. ఎవరికి ఓటేయాలో.. ఎవరిని గెలిపించాలన్నదానిపై ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు.