సిద్దిపేటకు అరుదైన గౌరవం
- - హరితమిత్ర అవార్డుకు ఎంపికైన పట్టణం
- - రేపు గవర్నర్, సీఎం చేతుల మీదుగా ప్రదానం
- - రూ.2 లక్షల నగదు, జ్ఞాపికతో సత్కారం
- - ఫలించిన మంత్రి ప్రయత్నం
సిద్దిపేట జోన్: సిద్దిపేటకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ పట్టణం హరితమిత్ర అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు శనివారం సిద్దిపేట మున్సిపాలిటీకి హరితమిత్ర అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది పట్టణంలో లక్ష మొక్కలు నాటిన స్ఫూర్తితో ఈసారి 2.30 లక్షల మొక్కలను నాటి రికార్డు సృష్టించింది. ఇందులో భాగంగా హరితమిత్ర అవార్డును పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా సోమవారం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌ల చేతుల మీదుగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి అందుకోనున్నారు.
జ్ఞాపికతోపాటు రూ.2లక్షల నగదును స్వీకరించనున్నారు. 1998లో అప్పటి ఎమ్మెల్యే కేసీఆర్ తొలి ప్రయోగంగా సిద్దిపేటలో మొక్కలు నాటే క్రమంలో హరితహారానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే పట్టణ ప్రజలు, వ్యాపారులు పెద్ద ఎత్తున కదిలారు. ఇదే స్ఫూర్తితో కేసీఆర్ గత ఏడాది సీఎం హోదాలో సిద్దిపేటలో హరితహారానికి నాంది పలికారు. గత ఏడాది మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో పట్టణంలో లక్ష మొక్కలను నాటగా ఈ ఏడాది 2.30లక్షల మొక్కలు నాటారు.
సిద్దిపేట ప్రజలకు అంకితం...
స్వచ్ఛ సిద్దిపేట లక్ష్యాన్ని సాధించి, గ్రీన్ సిద్దిపేట దిశగా ముందుకు సాగుతోన్న ఈ పట్టణానికి హరితమిత్ర అవార్డు రావడం సంతోషదాయకం. ఈ విజయం ప్రజలకు అంకితం. అన్ని వర్గాల ప్రజలు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమష్టిగా హరితహార లక్ష్యాన్ని అధిగమించారు. నాటిన ప్రతి మొక్క బతికినప్పుడే నిజమై ఆనందం కలుగుతుంది. రాష్ర్ట స్థాయిలోనే సిద్దిపేటకు హరితమిత్ర అవార్డు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో సిద్దిపేట ముందుకు సాగాలి.
- టి.హరీశ్‌రావు, మంత్రి