మీరా.. రైతుల గురించి మాట్లాడేది?
⇒ ఉత్తమ్, జానాలపై మంత్రి హరీశ్ ధ్వజం
♦ మీ పాలనలో గోస పెట్టినందుకు ధర్నాలు చేస్తున్నారా?
♦ మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
సాక్షి, నల్లగొండ: రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురు వారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియో జకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రు లు జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డిలు దేనికోసం ధర్నాలు చేస్తున్నా రని ప్రశ్నించారు.‘‘కాంగ్రెస్ హయాంలో ఎరువులు ఇవ్వక రైతులను గోస పెట్టారనా? టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కొరత లేనందుకు ధర్నా చేస్తారా? మీ హయాంలో విత్తనాలు దొరకక పోలీసు స్టేషన్ల ముందు రైతులు నిలబడినందుకా..? లేక చాలీచాలని, రాత్రిపూట కరెంట్ ఇచ్చినందుకు, మోటార్లు, స్టార్టర్లు కాలలేదని ధర్నా చేస్తారా? అని నిలదీశారు.
యాసంగిలో ప్రతి గింజా కొనుగోలు
యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని, రైతుల వద్ద ఉన్న ప్రతి గింజా కొనుగోలు చేసి రూ.6,500 కోట్లు ఇచ్చామ న్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో లోలెవల్ కెనాల్, మహ బూబ్‌నగర్‌లో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కరీంనగర్‌లో ఎల్లపల్లి, ఖమ్మంలో భక్తరామదాసు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నీళ్లిచ్చామన్నా రు. వచ్చే ఏడాది నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ వచ్చిన తర్వాత సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిందన్నారు.
డిండితో సస్యశ్యామలం
డిండి ఎత్తిపోతల కింద నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు ప్రాంతాలను సస్య శ్యామలం చేసేందుకు రూ.6 వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని హరీశ్ అన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2తో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు కాళేశ్వరం ద్వారా సస్యశ్యామలం చేస్తామన్నారు. గంధమళ్ల, బస్వాపురం రిజర్వాయర్లు నిర్మించి భువన గిరి, ఆలేరు నియోజకవర్గాల భూములకు నీళ్లిస్తామని చెప్పారు.
ఉత్తమ్ పిట్టల దొర: జగదీశ్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిట్టల దొరలా అబద్ధాలు మాట్లాడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో సబ్‌స్టేషన్ల నిర్మాణం చేశామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు సంక్షోభంలో ఉన్నారని, రైతులు సంక్షోభంలో ఉన్నట్లు మాట్లాడుతు న్నారన్నారు.