రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | harish rao at warangal | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Published Sun, Oct 16 2016 2:53 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

వరంగల్ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
వరంగల్ సిటీ/పరకాల/కూసుమంచి: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నదని మార్కెటింగ్‌శాఖ, భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం నిర్వహించిన వరంగల్ అర్బన్  జిల్లాలోని ఏనుమాముల, పరకాల వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ఏనుమాముల కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి పాల్గొన్నారు.  పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు.

మిషన్  కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు, దేవాదుల, కాళేశ్వరం, ఎస్సారెస్పీ స్టేజీ-1, 2 ప్రాజెక్టుల పనులను కూడా పూర్తి చేస్తామన్నారు. రబీలోనూ 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని మంత్రి ఆగ్రహించారు.   

ఓర్వలేకనే ధర్నాలు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విపక్షాలు ధర్నాలు చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

నవంబర్ నాటికి భక్త రామదాసు పూర్తి
ఖమ్మం జిల్లాలో కరువుపీడిత పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని సవాల్‌గా తీసుకుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం పాలేరు రిజర్వాయర్ సమీపంలో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్ పనులను పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఎత్తిపోతల పనులు  తుదిదశకు చేరుకున్నాయనీ, నవంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్‌రావు ప్రోద్బలంతో ఎత్తిపోతల పనులు  చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement