కొత్త ఏడాదిలో మిడ్ మానేరుకు ఎల్లంపల్లి నీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఎల్లంపల్లి, మిడ్ మానేరు పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ చివరి కల్లా పూర్తి చేయాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వచ్చే ఏడాదిలో అడుగుపెట్టే నాటికి ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరులో పడాలన్నారు. ఆదివారం జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని హరీశ్‌రావు సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ఏడు జిల్లాల రైతుల జీవితాలతో ముడిపడిందని మరోసారి గుర్తు చేశారు.
ప్రాజెక్టులోని 6, 7, 8 ప్యాకేజీల పనులు జరుగుతున్న ప్రాంతంలో వారంలో రెండు రోజులపాటు ఉండి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించాలని ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డిని ఆదేశించారు. నవంబర్ చివరి కల్లా ఎలక్ట్రికల్, మెకానికల్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ నాటికి ప్యాకేజీ 6, 7, 8 పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ కల్లా పంప్‌హౌజ్‌లు, టన్నెల్ పనులు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
ప్రాజెక్టు పనులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ వ్యవధిలోగా పూర్తి చేయాలన్నారు. మేడారం రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని, రిజర్వాయర్‌కు సంబంధించిన రైతులకు పంట పరిహారం వెంటనే ఇవ్వాలని సూచించారు. క్రాప్ హాలిడేకు సంబంధించిన ఫైలును వెంటనే క్లియర్ చేయాలని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాసరాజ్‌ను కోరారు. సమీక్షలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జోషి, ఈఎన్‌సీ మురళీధర్ రావు, కాళేశ్వరం సీఈ నల్లా వెంకటేశ్వర్లు, భూసేకరణ సలహాదారు జి.మనోహర్, ఈఈ నూనె శ్రీధర్, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.