
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ నుంచే తొలి అధికారిక పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. రెండురోజులపాటు జిల్లాలోనే మకాం వేసి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. మొదటిరోజు (మంగళవారం) కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌తోపాటు నందిమేడారం అండర్‌టన్నెల్‌ను సందర్శించనున్నారు. బుధవారం ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పంప్‌హౌస్ పనులను పరిశీలించనున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద 6వ ప్యాకేజీ పనులు, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ వద్ద 8వ ప్యాకేజీ పనులు పరిశీలించి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నట్లు అధికారవర్గాలు సీఎం పర్యటన షెడ్యూల్‌ను వెల్లడించాయి. వచ్చే జూన్, జూలై నాటికి కాళేశ్వరం జలాలను అందించేలా పనులను వేగవంతం చేసేందుకు కాళేశ్వరంబాట పడుతున్నారు. హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నరేళ్ల క్రితం ప్రాజెక్టు రీ డిజైనింగ్‌కు అంకురార్పణ చేశారు. ఇందులోభాగంగా గోదావరిపై వరుస బ్యారేజీలు నిర్మించి 180 టీఎంసీల నీటిని 13 జిల్లాలోని 18.26 లక్షల ఎకరాలకు మళ్లించాలన్న సంకల్పంతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2019 మే వరకు కాళేశ్వరం పూర్తి చేసి జూన్, జూలై వరకు నీటిని రైతులకు అందించాలనే పట్టుదలతో సీఎం ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పంప్‌హౌస్ నిర్మాణం సైతం అనుకున్న స్థాయిలో జరగడం లేదని భావించిన సీఎం కేసీఆర్ స్వయంగా పనులను పరిశీలించేందుకు రెండురోజులపాటు ఉమ్మడి జిల్లా పర్యటనలో ప్రాజెక్టుల బాట పట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలోని అధికారులు అప్రమత్తమయ్యారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే...
మొదటిరోజు
18న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. 10.30 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీ పనులపై అధికారులతో సమీక్షిస్తారు. 12 గంటలకు మేడిగడ్డ నుంచి బయల్దేరి 12.15కు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటారు. 12.15 నుంచి 1.35 గంటలకు వరకు కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.35 నుంచి 2.15గంటల వరకు మధ్యాహ్నభోజనం చేసి అక్కడినుంచి బయలుదేరి 2.30 గంటలకు అన్నారం బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడి పనుల పురోగతిని సమీక్షిస్తారు. 2.30 గంటల నుంచి 3గంటల వరకు అన్నారం బ్యారేజీ పనులపై సమీక్షిస్తారు. అన్నారం బ్యారేజీ నుంచి 3.20గంటలకు బయలుదేరి సుందిళ్ల బ్యారేజీకి చేరుకుని సాయంత్రం 4 గంటల వరకు సమీక్ష నిర్వహిస్తారు. 4.20 గంటలకు గోలివాడ పంప్‌హౌస్‌కు చేరుకుని 4.50 గంటల వరకు సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు గోలివాడ నుంచి బయలుదేరి కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుని ఇక్కడే బస చేయనున్నారు.
రెండవ రోజు...
19న ఉదయం 9.30 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి 9.50 గంటలకు ఉమ్మడి జిల్లా పరిధిలోని మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటలో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనుల వద్దకు చేరుకుంటారు. అక్కడ 10.30 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 10.30 గంటలకు మల్యాల మండలం రాంపూర్‌కు చేరుకుని 10.50 గంటల వరకు పంప్‌హౌస్ పనులపై సమీక్ష నిర్వహిస్తారు. 10.50 గంటల నుంచి 11.30 గంటలవరకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పంప్‌హౌస్ నంబర్‌వన్ పనులపై అధికారులతో సమీక్షిస్తారు. 11.30 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 8 లక్ష్మిపూర్‌కు చేరుకుని 11.55 వరకు అధికారులతో సమీక్షిస్తారు. 11.55 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలవరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–8 పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు రామడుగు మండలం లక్ష్మిపూర్ ప్యాకేజీ –8 పనుల వద్ద మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలనుంచి 3 గంటల వరకు ధర్మారం మండలం శాయంపేట గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–6 పనులను పర్యవేక్షించనున్నారు. 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ –6, 7, 8 పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 4.30 గంటలకు అక్కడినుంచి బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment