
కథలాపూర్/మేడిపల్లి (వేములవాడ): కాళేశ్వరం జలాల రివర్స్ పంపింగ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కథలాపూర్ జెడ్పీటీసీ భూమయ్య, మేడిపల్లి మండలం వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డితో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కడ ఉంది.. దానికి పరిష్కార మార్గాలు.. వరద కాలువలో ప్రవహిస్తున్న కాళేశ్వరం జలాల విషయమై చర్చించారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువలోకి వస్తున్న నీటితో రైతులకు ఏ మేరకు ఉపయోగపడుతోందని ఆరా తీశారు.
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలతోపాటు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలు నాన్ ఆయకట్టు కింద ఉన్నాయని, ఇక్కడ నీటి సమస్య ఉన్నట్లు భూమయ్య, శ్రీపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. వరద కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా కాలువ పై భాగంలోని చెరువులు, కుంటలు నింపితే సమస్య తీరుతుందన్నారు. వేములవాడ, చొప్పదండి, కోరుట్ల, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని నీటి సమస్య ఉన్న గ్రామాలకు నాలుగు నెలల్లో నీరు అందేలా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలసి శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.