kathalapur
-
రివర్స్ పంపింగ్‌తో ఉపయోగం ఉందా?
కథలాపూర్/మేడిపల్లి (వేములవాడ): కాళేశ్వరం జలాల రివర్స్ పంపింగ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కథలాపూర్ జెడ్పీటీసీ భూమయ్య, మేడిపల్లి మండలం వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డితో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కడ ఉంది.. దానికి పరిష్కార మార్గాలు.. వరద కాలువలో ప్రవహిస్తున్న కాళేశ్వరం జలాల విషయమై చర్చించారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువలోకి వస్తున్న నీటితో రైతులకు ఏ మేరకు ఉపయోగపడుతోందని ఆరా తీశారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలతోపాటు చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలు నాన్ ఆయకట్టు కింద ఉన్నాయని, ఇక్కడ నీటి సమస్య ఉన్నట్లు భూమయ్య, శ్రీపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకొచ్చారు. వరద కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా కాలువ పై భాగంలోని చెరువులు, కుంటలు నింపితే సమస్య తీరుతుందన్నారు. వేములవాడ, చొప్పదండి, కోరుట్ల, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని నీటి సమస్య ఉన్న గ్రామాలకు నాలుగు నెలల్లో నీరు అందేలా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలసి శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. -
మరణంతో ఏకం.. ఒకే గోతిలో ప్రేమజంట ఖననం
సాక్షి, కథలాపూర్(కరీంనగర్) : బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట మరణంలో ఏకమయ్యారు. ప్రేమ పెళ్లికి అంగీకరించని పెద్దలు ఇద్దరినీ ఒకే గోతిలో పూడ్చిపెట్టి వారికి కన్నీటీ వీడ్కోలు పలికిన హృదయ విదారకర సంఘటన ఆదివారం కథలాపూర్ మండలంలోని రాజారాం తండాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రాజారాం తండాకు చెందిన భూక్య శిరీష, లకావత్ మహిపాల్ పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. శిరీష తల్లిదండ్రులు ఇటీవలే వేరే యువకుడితో పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ప్రేమికులు ఇద్దరు తీవ్రమనస్తాపానికి గురయ్యారు. పెద్దలను ఎదురించలేక, ప్రేమ పెళ్లి చేసుకోలేక చావే శరణ్యమని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో కరీంనగర్లో చదువుతున్న మహిపాల్ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన శిరీష, మహిపాల్‌లు శనివారం సిరికొండ శివారులోని అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరికి ఆదివారం బంధువులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపారు. ఇద్దరిని ఒకే గోతిలో ఖననం చేశారు. బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట చివరికి మరణంలో ఏకం కావడం, వారిద్దరిని కూడా ఒకే గోతిలో ఖననం చేసిన హృదయ విదారకర సంఘటన ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. -
జీవితాంతం కలిసుందామనుకున్నారు కానీ..
సాక్షి, కథలాపూర్(వేములవాడ): జీవితాంతం కలిసి ఉండలేక ఒక్కటిగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం కథలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. యువతికి ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం కావడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పూనుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు. కథలాపూర్ మండలం రాజారాం తండాలో భూక్యా బుల్లి–తిరుపతి దంపతుల కూతురు భూక్యా శిరీష(18), అదే గ్రామానికి చెందిన లకావత్ సూర్యనాయక్– ప్రమీల దంపతుల కుమారుడు లకావత్ మహిపాల్(18) పాఠశాల స్థాయి నుంచే ఒకరిపై మరొకరికి ప్రేమ ఏర్పడింది. శిరీష ప్రస్తుతం కోరుట్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా.. మహిపాల్ కరీంనగర్‌లోని ఎస్సాఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చుదువుతున్నాడు. వీరి ప్రేమవ్యవహారం పెద్దలకు తెలియడంతో నాలుగునెలలక్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలకు చెందిన యువకుడితో శిరీషకు నిశ్చితార్థం చేశారు. మరో రెండునెలల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే మహిపాల్ కరీంనగర్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం వీరిద్దరు గ్రామం నుంచి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రం సిరికొండ శివారులోని అటవీప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. సంఘటన స్థలం పక్కనే ఇద్దరి బ్యాగులు, పుస్తకాలు, నోటుబుక్కులు పడేసి ఉన్నాయి. విషయం తెలుసుకున్న మెట్పల్లి సీఐ రవికుమార్, కథలాపూర్ ఎస్సై రాజప్రమీల సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
యువకుడిది హత్యా.. ప్రమాదమా?
సాక్షి, కథలాపూర్(వేములవాడ) : కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన ముక్కెర మహేశ్(21) అనే యువకుడు మూడునెలల క్రితం అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా.. ప్రేమ వ్యవహారం వల్లే అది ముమ్మాటికి హత్యేనని మృతుడి కుటుంబీకులు పేర్కొంటున్నారు. మహేశ్ తల్లిదండ్రులు ముక్కెర హన్మంతు– రాజవ్వ శనివారం కథలాపూర్ మండలం తాండ్య్రాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహేశ్ కోరుట్లలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా.. ఈ ఏడాది మే 17న మేడిపెల్లి మండలం రత్నాలపల్లిలో మిత్రుడి పెళ్లికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. అదేరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. గంభీర్పూర్ శివారులో బైక్ పక్కన మహేశ్ మృతిచెంది ఉండటాన్ని మే 18న ఉదయం స్థానికులు చూశారు. మొదట రోడ్డుప్రమాదంగా భావించారు. ప్రమాదానికి గురైన బైక్‌కు దూరంగా మహేశ్ మృతదేహం, చెప్పులు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇటీవల మహేశ్ ఇంట్లో ఓ యువతి రాసిన ప్రేమలేఖలు బయటపడ్డాయి. ప్రేమ వ్యవహారం వల్లే మహేశ్‌ను సదరు యువతి కుటుంబీకులు హత్యచేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి తమకు న్యాయం చేయాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై కథలాపూర్ ఎస్సై అశోక్ మాట్లాడుతూ.. అప్పట్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. రోడ్డుప్రమాదం వల్లే మహేశ్ మృతిచెందాడని పోస్టుమార్టంలో నివేదికలు వచ్చాయని పేర్కొన్నారు. -
కొడుకు ఇక లేడని ఆగిన తల్లి గుండె
కథలాపూర్(వేములవాడ): ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్‌బాట పట్టిన కొడుకు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన తల్లి గుండె ఆగిపోయింది. తల్లీకొడుకుల మృతితో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన గుంటుక నర్మద–మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అప్పులు పెరిగిపోవడం, ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో ఇద్దరు కొడుకులు గల్ఫ్‌బాట పట్టారు. కాగా, చిన్నకొడుకు గుంటుక గణేశ్ ఈనెల 3న బహ్రెయిన్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి గణేశ్ తల్లి నర్మద విలపిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం నర్మద (58) ఆకస్మికంగా మృతిచెందింది. కాగా, మృతురాలి భర్త మల్లయ్య మూడేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకు శవాన్ని చివరిచూపు చూడకుండానే తల్లి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
లబ్ధిదారుల్లో ‘పింఛన్’ టెన్షన్
సాక్షి, కథలాపూర్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్.. ఆసరా పింఛన్ పథకాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్‌కు వయస్సును 57 ఏళ్లకు కుదిస్తామని ప్రకటించారు. కొత్త ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి అమలవుతుందని ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు. కానీ ఏప్రిల్ నెల సమీపిస్తున్నప్పటికి అధికారులు అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పార్లమెంట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వరుసగా ఉండటంతో ఎన్నికల కోడ్ తో జాప్యమవుతుందని పేదలు నిరాశకు గురవుతున్నారు. పెరిగిన పింఛన్ వస్తుందో లేదోనని అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన పింఛన్‌ను త్వరగా వర్తింపజేయాలనిలబ్ధిదారులు కోరుతున్నారు. మండలంలో 10 వేల మంది లబ్ధిదారులు.. మండలంలో 19 గ్రామాలలో అన్ని రకాల పింఛన్లు పొందుతున్న 4,982 మంది లబ్దిపొందుతున్నారు. అయితే పింఛన్ డబ్బులను రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో కొత్త విధానంలో పింఛన్ డబ్బుల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల హడావుడి ఉండటంతో పెరిగిన పింఛన్ డబ్బులు మంజూరయ్యేందుకు మరింత జాప్యం జరుగుతుందేమోనని లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. 57 ఏళ్లకు కుదింపుతో 2,393 మందికి లబ్ధి ఆసరా పింఛన్‌కు కొత్తగా కనీస వయస్సు అర్హతను 57 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ నిబంధనతో మండలంలోని 19 గ్రామాల్లో కొత్తగా 2,393 మందికి లబ్ధి చేకూరనుంది. 57 ఏళ్లకు పైబడినవారు సుమారు 11,341 మంది ఉన్నారు. 57 ఏళ్ల నిబంధన సైతం ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇవ్వడంతో ఆశావహులు ఏప్రిల్ నెల ఎప్పుడు వస్తుందా అంటూ ఆతృతగా ఎదిరిచూస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి కొత్త పింఛన్ ప్రక్రియను త్వరగా అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నెలల తరబడి జాప్యం వద్దు ఆసరా పింఛన్ 57 ఏళ్లకే మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో పేదల్లో సంతోషం వ్యక్తమైంది. ఎప్పుడు వస్తాయోనని నెలల తరబడి ఎదిరిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఆసరా పింఛన్ డబ్బులను రెట్టింపు చేసి మంజూరు చేయాలి. 57 ఏళ్లున్న వారికి త్వరగా పింఛను మంజూరు చేయాలి. – ఎం.డీ సత్తార్, గంభీర్పూర్ ప్రతి నెల ఒకటో తేదీన అందించాలి ఆసరా పింఛన్ డబ్బులు ప్రతి నెల ఒకటో తేదిన అందించాలి. పింఛన్ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో తెలియని పరిస్థితులున్నాయి. డబ్బులు సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులపాలువుతున్నారు. ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి ప్రతి నెల ఒకటో తేదిన పింఛన్ డబ్బులు మంజూరు చేయాలి. – గుగ్లొత్ రవినాయక్, దివ్యాంగుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రభుత్వ ఆదేశాలు రాగానే అమలు ఆసరా పింఛన్ డబ్బులను పెంచడంతోపాటు 57 ఏళ్లకు ఆసరా పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. గతంలో మంజూరైన పింఛన్లు యథావిధిగా లబ్ధిదారులకు అందుతున్నాయి. కొత్త విధానం అమలు చేయాలంటే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంటుంది. – కట్కం ప్రభు, ఎంపీడీవో, కథలాపూర్ -
పెళ్లయిన మూడు నెలలకే...
కథలాపూర్: కడుపునొప్పితో బాధపడుతూ కథలాపూర్ మండలం తాండ్య్రాలకు చెందిన ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన మూడు నెలలకే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో తాండ్య్రాలలో కలకలం రేపింది. స్థానికులు, ఎస్సై ఆరీఫ్‌ఖాన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చందన అలియాస్ రాధను రాయికల్ మండలం రామోజీపేటకు చెందిన చుక్క క్రాంతికిచ్చి మూడునెలల క్రితం పెళ్లిచేశారు. 45 రోజుల క్రితం క్రాంతి ఉపాధికోసం గల్ఫ్‌వెళ్లాడు. అప్పటినుంచి చందన పుట్టినింట్లో ఉంటోంది. నాలుగురోజులుగా చందన కడుపునొప్పితో బాధపడుతోంది. మంగళవారం రాత్రి తన దాబాపైకి చేరుకుని క్రిమిసంహారకమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కోరుట్ల ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. చందన తల్లి ఇజ్జపు గంగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
కథలాపూర్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భూషన్‌రావుపేటలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామంలో దసరా ఉత్సవాల సందర్భంగా లైటింగ్ పని చేస్తున్న కథలాపూర్‌కు చెందిన గుండేటి రమేష్ (30) అనే కార్మికుడు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. -
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం నిరాహారదీక్ష
కథలాపూర్ (కరీంనగర్ జిల్లా) : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలపై దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వాటి యాజమాన్యాలు ఒక్క రోజు నిరాహారదీక్షకు దిగాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో గురువారం జరిగింది. ఒక్కరోజు పాటు జరుగుతున్న ఈ దీక్షలో మండలంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నాయి. -
వివాహిత ఆత్మహత్య
కతాలాపూర్: ఒంటిపై కిరోసిన్ పోసుకోని నిప్పంటించుకొని ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కతాలాపూర్ మండలం బోమ్మెన గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. బోమ్మెన గ్రామానికి చెందిన పడిగెల సుమలత గురువారం రాత్రి తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. విషయం తెలిసిన భర్త ఆమెను వెంటనే కోరుట్లలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. కాగా,చికిత్స పోందుతున్న ఆమె శుక్రవారం మరణించింది. సుమలతకు ఇద్దరు కుమారులున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కాగా,ఆమె ఆత్మాహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.