యువకుడిది హత్యా.. ప్రమాదమా? | Parents Skeptical of Young Man Death In Karimnagar | Sakshi
Sakshi News home page

యువకుడిది హత్యా.. ప్రమాదమా?

Published Sun, Aug 25 2019 11:27 AM | Last Updated on Sun, Aug 25 2019 11:36 AM

Parents Skeptical of Young Man Death In Karimnagar - Sakshi

బాధిత కుటుంబసభ్యులు

సాక్షి, కథలాపూర్‌(వేములవాడ) : కథలాపూర్‌ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన ముక్కెర మహేశ్‌(21) అనే యువకుడు మూడునెలల క్రితం అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా.. ప్రేమ వ్యవహారం వల్లే అది ముమ్మాటికి హత్యేనని మృతుడి కుటుంబీకులు పేర్కొంటున్నారు. మహేశ్‌ తల్లిదండ్రులు ముక్కెర హన్మంతు– రాజవ్వ శనివారం కథలాపూర్‌ మండలం తాండ్య్రాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహేశ్‌ కోరుట్లలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా.. ఈ ఏడాది మే 17న మేడిపెల్లి మండలం రత్నాలపల్లిలో మిత్రుడి పెళ్లికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. అదేరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.

గంభీర్‌పూర్‌ శివారులో బైక్‌ పక్కన మహేశ్‌ మృతిచెంది ఉండటాన్ని మే 18న ఉదయం స్థానికులు చూశారు. మొదట రోడ్డుప్రమాదంగా భావించారు. ప్రమాదానికి గురైన బైక్‌కు దూరంగా మహేశ్‌ మృతదేహం, చెప్పులు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇటీవల మహేశ్‌ ఇంట్లో ఓ యువతి రాసిన ప్రేమలేఖలు బయటపడ్డాయి. ప్రేమ వ్యవహారం వల్లే మహేశ్‌ను సదరు యువతి కుటుంబీకులు హత్యచేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి తమకు న్యాయం చేయాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై కథలాపూర్‌ ఎస్సై అశోక్‌ మాట్లాడుతూ.. అప్పట్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. రోడ్డుప్రమాదం వల్లే మహేశ్‌ మృతిచెందాడని పోస్టుమార్టంలో నివేదికలు వచ్చాయని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement