పదహారు పద్దులకు ఆమోదం
- రాత్రి తొమ్మిది వరకు నిరాఘాటంగా కొనసాగిన సభ
- అర్థవంతమైన చర్చ కోసమే: హరీశ్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌కు సంబంధించి శాసనసభ పదహారు పద్దులకు ఆమోదం తెలిపింది. పురపాలన -పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, భారీ, మధ్యతరహా నీటిపారుదల, చిన్నతరహా నీటిపారుదల, ఇంధనం, రెవెన్యూ రిజిస్ట్రేషన్ సహాయం, ఆబ్కారీ నిర్వహణ, వాణిజ్య పన్నుల నిర్వహణ, రవాణా నిర్వహణ, హోం పాలన, వ్యవసాయం, పశుసంవర్ధన, మత్స్యాగారాలు, సహకారం, పౌర సరఫరాల నిర్వహణ పద్దులకు సభ ఆమోదం తెలిపింది. ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు నిర్విరామంగా ఈ పద్దులపై చర్చ కొనసాగింది. విపక్షాలు ప్రతిపాదించిన సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయని ప్రకటించిన స్పీకర్ రాత్రి తొమ్మిదింటికి ఆయా పద్దులు ఆమోదం పొందినట్టు ప్రకటించారు.
సభ జరుగుతున్న తీరును విపక్షాలు అభినందించాలి: హరీశ్‌రావు
ప్రజా సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని, దానికి ప్రస్తుతం సభ జరుగుతున్న తీరే నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి పద్దులపై చర్చ అనంతరం ఆయన సభలో మాట్లాడారు. గతంలో ఇలా సభను నిర్వహిం చిన దాఖలాలు లేవని, కనీవినీ ఎరుగని రీతిలో తాము పద్దులపై అర్ధవంతమైన చర్చకు అవకాశం కల్పించామన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షం లేకుండా టీడీఎల్పీ తరహాలో అధికారపక్షం సభను నిర్వహిస్తోందని, దాన్ని గమనించి తెలంగాణ సభ జరుగుతున్న తీరును విపక్షాలు అభినందిస్తాయని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు.
చెరువుల పరిరక్షణకు కమిటీలు
రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ఇతర జలవనరులపై చర్చించడానికి త్వరలోనే అఖిలపక్షంతో సమావేశం కానున్నట్టుగా హరీశ్‌రావు వెల్లడించారు. మిషన్ కాకతీయకు ఇది మొదటి సంవత్సరం కాబట్టి ప్రాథమిక సమస్యలుంటాయని, అన్నింటిపై సమగ్రంగా చర్చించడానికి అన్ని పార్టీలతో సీఎం సమావేశం అవుతారన్నారు.
భూముల రీ-సర్వే: మహమూద్ అలీ
త్వరలో భూములను రీసర్వే చేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. భూములను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.
గీతదాటే వైన్స్‌లపై వేటు: పద్మారావు
నిబంధనలను ఉల్లంఘించిన కల్లు, వైన్స్ దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు స్పష్టంచేశారు. ప్రార్థనామందిరాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకు 100 మీటర్లలోపు వైన్స్‌లు ఉన్నాయని సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మూసేస్తామన్నారు. కల్లుగీత వృత్తిలో ఇతర కులాలకు కొన్ని ప్రాంతాల్లో లెసైన్సులు ఇచ్చామన్నారు.
పన్నులు పెంచేది లేదు: తలసాని
వాణిజ్య పన్నులు పెంచాలని, టెక్స్‌టైల్ వంటివాటికి పన్నును విస్తరించాలనే యోచన ప్రభుత్వానికి లేదని వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
బస్టాపుల్లో టాయిలెట్లు: మహేందర్ రెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న బస్టాపుల్లోనూ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు రోడ్డు, రవాణశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.150 కోట్లతో 500 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. జిల్లా కేంద్రాల నుంచి నడిపించడానికి 100 ఏసీ బస్సులు, గ్రామీణ ప్రాంతాల్లో నడిపించడానికి 400 పల్లెవెలుగు కోసం కేటాయించినట్టు వెల్లడించారు.
వ్యవసాయానికి పదేళ్ల యాక్షన్ ప్లాన్: చెన్నమనేని
అంతకు ముందు పద్దులపై సుదీర్ఘ చర్చ జరిగింది. బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ అన్నారు. ‘సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు అని సరైన ప్రాధాన్యతలనే ప్రభుత్వం నిర్ణయించుకుంది. వ్యవసాయానికి సంబంధించి తక్కువ దిగుబడి, ఎక్కువ వ్యయం అనేది సమస్యగా ఉంది. దీనిని అధిగమించేందుకు పదేళ్ల కాలానికి వ్యవసాయ పర్స్‌పెక్టివ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుంటే ఉత్పాదకతను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు.
జానా బాగుందంటున్నారు..ఎమ్మెల్యేలు బాలేదంటున్నారు
బడ్జెట్ బాగా ఉందని ప్రతిపక్షనేత జానారెడ్డి మెచ్చుకుంటే, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బాగా లేదంటూ విమర్శిస్తున్నారని టీఆర్‌ఎస్ సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యానిం చారు. ‘పనికి ఆహారపథకాన్ని సిమెంట్ పనులు, మిషన్ కాకతీయకు, చెరువుల పూడికతీత ఇతర పనులకు మళ్లించాలి’ అని కోరారు.
విదేశీ మాయగాళ్లను అరెస్ట్ చేయాలి: చింతల రామచంద్రారెడ్డి
విశ్వనగరంలో హైదరాబాద్‌ను పేర్కొంటున్నా అంతర్గతంగా పరిస్థితి భయంకరంగా ఉంది. విదేశీ మాయగాళ్లను అరెస్ట్ చేయాలని బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. ‘వీసా గడువు ముగిసిన విదేశీయులు ఎంత మంది ఇక్కడ ఉన్నారో లెక్కలు తీయాలి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ట్రాఫిక్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలి’ అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
పర్మిట్‌రూమ్‌ల వల్ల ఆగడాలు: ఖాద్రీ
మద్యం దుకాణాల పక్కనే పర్మిట్‌రూమ్‌లకు అనుమతినివ్వడం వల్ల రోడ్లపై ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నారని ఖాద్రీ (ఎంఐఎం) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు.