పంద్రాగస్టు.. అదిరేట్టు
- - వేడుకలకు భారీ ఏర్పాట్లు
- - ముస్తాబైన పరేడ్ గ్రౌండ్
- - ముఖ్యఅతిథిగా రానున్న మంత్రి హరీశ్‌రావు
- - పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు
సంగారెడ్డి టౌన్: 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. జెండా గద్దెను ముస్తాబు చేశారు. మైదానంలో ప్రభుత్వ శాఖల తరఫున ఏర్పాటు చేయనున్న స్టాళ్లు, శకటాలను సిద్ధం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, అతిథులు, ప్రజలు వీక్షించేందుకు వీలుగా షామియానాలు వేశారు.
సోమవారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు జాతీయ జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారు. పోలీసు కవాతు ద్వారా గౌరవ వందనం స్వీకరిస్తారు. ఏడాది కాలంలో జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులను జిల్లా ప్రజలకు వివరిస్తారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక, కళారూప ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శిస్తారు.
వివిధ శాఖల్లో పని చేస్తోన్న ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందజేస్తారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, అనధికారులు, ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.