ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు
- చెరువుల పునరుద్ధరణ పై మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలి పారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ..ఈ-ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో టెండర్లను పిలుస్తామని చెప్పారు. నామినేషన్ల విధానంలో పనులకు ఏమాత్రం ఆస్కారం లేదని చెప్పారు. తూములను, అలుగుల ను పునరుద్ధరిస్తామని తెలిపారు.
తెలంగాణలో 10జిల్లాలకు ఐదుగురుఎస్‌ఈలు మాత్రమే ఉన్నారని, ఇప్పుడు జిల్లాకో ఎస్‌ఈని నియమిస్తామని చెప్పారు. ప్రతీ రెండు మూడు నియోజకవర్గాలకు కలిపి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ని నియమిస్తామన్నారు. అలాగే ప్రతీ మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)ని నియమిస్తామన్నారు.ప్రతీ ఏఈకి సర్వే పరికరాలు, ఒక ల్యాప్‌టాప్ ఇస్తామన్నారు. పనులకు సంబంధించిన ఫొటోలను, సమాచారాన్ని ఎప్పటికప్పుడు నెట్‌లో అందరికీ అందుబాటులో ఉండేలా అప్‌లోడ్ చేస్తారని పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో అన్ని చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. రజకులు, ముదిరాజ్‌లు, రైతులందరినీ భాగస్వామ్యం చేస్తామన్నారు. అంతకు ముందు టీడీపీ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, పూడికతీత పనులను పారదర్శకతతో చేయాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ ఒక్క కాకతీయులే చెరువులు తవ్వించలేదని, తమ ప్రాంతంలోని రాజులు కూడా చెరువులు తవ్వించారని, చెరువుల పునరుద్ధరణ పనులకు ‘మిషన్‌కాకతీయ’ పేరు ఎలాపెడతారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి మెగావాట్ల సోలార్‌పార్కు
మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక సోలార్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందుకోసం 5,481.86 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం 1500 వ్యవసాయ సోలార్ పంపుసెట్లను మంజూరు చేసిందన్నారు.
మార్కెట్ కమిటీల కంప్యూటరీకరణ
ఏడాదికి 20 నుండి 30 వ్యవసాయ మార్కెట్ కమిటీలను కంప్యూటరీకరిస్తామని హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేలు ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, వేముల వీరేశంలు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. బహిరంగ వేలంపాటల స్థానంలో ఈ-టెండర్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద్, వి.శ్రీనివాస్‌గౌడ్‌లు అడిగిన ప్రశ్నకు ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ లిఖితపూర్వక సమాధానమిస్తూ 80చదరపు గజాల కంటే ఎక్కువగా ఉన్న 6,707 ఆక్రమిత స్థలాలతోపాటు 13,134 ఇళ్లను క్రమబద్ధీకరించామని తెలిపారు.