E-Procurement
-
నామినేషన్‌పై మందుల కొను‘గోల్మాల్’
సాక్షి, అమరావతి : కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) పరిధిలోని ఆస్పత్రుల్లో మరో భారీ కుంభకోణానికి అధికారులు తెరతీశారు. గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగాయని తేలడంతో ఓ వైపు విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తుంటే మరోవైపు ఈఎస్ఐ పరిధిలోని ఆస్పత్రుల్లో కనీస మందులు లేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ ఏమీ పట్టని అధికారులు తాము అనుకున్నదే రూలు అన్నట్టు వందల కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు మార్గం సుగమం చేశారు. పారదర్శకంగా మందుల కొనుగోలు జరగాలంటే ఇ–ప్రొక్యూర్మెంట్ పద్ధతి సరైనదని భావించిన అధికారులు కొత్త సర్కారు రాగానే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి కార్మిక శాఖ అధికారిగా ఉన్న ఐఏఎస్ అధికారి మాధవీలత ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే కొద్ది రోజులకే ఆమె కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత లావణ్యవేణి అనే మరో అధికారి ఈ శాఖకు వచ్చారు. ఈమె ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి చేసి, ఎల్1గా నిలిచిన కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తీరా ఎల్1గా నిలిచిన కంపెనీలపై ఫిర్యాదులున్నాయని, మామూలు ధరల కంటే ఎక్కువ రేటు ఉందని ఇ–ప్రొక్యూర్మెంట్ విధానాన్ని నిలిపివేశారు. నామినేషన్ కింద మందుల సరఫరాకు అనుమతి ఇచ్చేందుకు ఈఎస్ఐ డైరెక్టరే కొన్ని కంపెనీలను ఎంపిక చేశారు. నామినేషన్ కింద అయితే భారీగా డబ్బులొస్తాయని భావించిన అధికార వర్గాలు ఈ విధానానికి తెరలేపాయని సమాచారం. ఇదే సమయంలో తక్కువ ధరకు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీలు ఎందుకు ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పాల్గొన లేదన్నదానికి అధికారుల నుంచి జవాబు లేదు. దీంతో రెండు మాసాల పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కసరత్తు చేసిన ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ల విధానం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ధరలు మామూలుగా ఉన్నాయన్న కమిటీ ఇ–ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యాక రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు రాగానే రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసే మందుల ధరకూ, ఈఎస్ఐ ఇప్రొక్యూర్మెంట్లో కోట్ చేసిన ధరలకూ బేరీజు వేయాలని ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. చంద్రశేఖర్, రామకృష్ణ, గాంధి అనే ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ సుమారు 265 రకాల మందుల ధరలను పరిశీలించింది. ఈఎస్ఐ టెండర్లలో పాల్గొన్న కంపెనీలు వేసిన ధరలకూ, ఏపీఎంఎస్ఐడీసీ ధరలకూ తేడా లేదని తేల్చింది. ఇలాంటప్పుడు ఇ–ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నామినేషన్ ద్వారా కొనుగోళ్లవైపే మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలో కూడా నిర్ణయించి వారికి జిల్లాల వారీగా మందుల ఇండెంట్ ఇచ్చారు. తొలి దశలో సుమారు రూ.40 కోట్లతో మందులు కొనుగోలు చేయనున్నారు. ధరలు ఎక్కువని ఇస్తున్నాం ఇ–ప్రొక్యూర్మెంట్ టెండరులో ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే నామినేషన్ కింద ఇస్తున్నాం. ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేసే మందులు అదే ధరకు వచ్చినా వాటినెవరైనా తింటారా? మా రోగులు అలాంటి మాత్రలు తినరు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు లేని విషయం వాస్తవమే. అందుకే నామినేషన్ కింద ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తున్నాం. పైగా ఈఎస్ఐ మందుల టెండర్లలో పాల్గొన్న కంపెనీల ద్వారా మందులు కొంటే రూ.230 కోట్లు నష్టం వస్తుంది. – సామ్రాజ్యం, ఈఎస్ఐ డైరెక్టర్ -
మిషన్ కాకతీయ షురూ !
- మొదటి విడతలో 50 చెరువులకు టెండర్లు - ఈ-ప్రొక్యూర్మెంట్లో నోటిఫికేషన్ - 11 నుంచి ఆన్లైన్లో షెడ్యూళ్లు వరంగల్ రూరల్ : చిన్ననీటి వనరుల పునరుద్ధరణలో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 5,865 చెరువులుండగా అందులో 1,415 చెరువులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి విడత చేపట్టిన చెరువులన్నింటికి ఒకేసారి టెండర్లు నిర్వహించేందుకు సాంకేతికపరంగా ఇబ్బందులున్నందున జిల్లాలో 50 చెరువులకు టెండర్లు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రూ.38.08 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 50 చెరువులకు ఆన్లైన్లో ఈ-ప్రొక్యూర్‌మెంటు ద్వారా టెండర్లు నిర్వహించేందుకు అధికారులు వివరాలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ సీఓటీకి అందించారు. రూ.కోటి వరకు ఖర్చయ్యే చెరువులకు పరిపాలన మంజూరు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం జిల్లాస్థాయిలోని నీటిపారుదల శాఖ ఎస్ఈకు ఇస్తూ జీఓ జారీ చేసింది. దీంతో నవంబర్ 27 నాడే మొదటి విడత టెండర్లు నిర్వహించే చెరువులకు నిధులు కేటాయిస్తూ పరిపాలన మంజూరు ఇచ్చారు. దీంతో ఇరిగే షన్ అధికారులు ఆయా చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లు తయారు చేసి,టెండర్ల ప్రక్రియ నిర్వహించే సంస్థలకు సమర్పించారు. ఈ ఎస్టిమేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు సమయం పడుతుండడంతో ఈ నెల 11 నుంచి ఈ-ప్రొక్యూర్మెంట్లో కాంట్రాక్టర్లకు బిడ్ డాక్యుమెంట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. రూ.38.08 కోట్లతో 50 చెరువుల పునరుద్ధరణ ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు ఈ ఏడాది చేపట్టనున్న 1,415 చెరువులకు ఎస్టిమేట్లు తయారు చేసే పనిలోపడ్డారు. అందులో 276 చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లు తయారు కాగానే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో అందజేశారు. రూ.కోటికి తక్కువ ఉన్న చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లను సర్కిల్ కార్యాలయంలో స్క్రూట్నీ చేశారు. స్న్రూట్నీ పూర్తయినా 50 చెరువులకు రూ.38.08 కోట్లతో టెండర్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మిగిలిన 1,089 చెరువుల ఎస్టిమేట్లను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. -
ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు
చెరువుల పునరుద్ధరణ పై మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలి పారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ..ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లను పిలుస్తామని చెప్పారు. నామినేషన్ల విధానంలో పనులకు ఏమాత్రం ఆస్కారం లేదని చెప్పారు. తూములను, అలుగుల ను పునరుద్ధరిస్తామని తెలిపారు. తెలంగాణలో 10జిల్లాలకు ఐదుగురుఎస్ఈలు మాత్రమే ఉన్నారని, ఇప్పుడు జిల్లాకో ఎస్ఈని నియమిస్తామని చెప్పారు. ప్రతీ రెండు మూడు నియోజకవర్గాలకు కలిపి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ని నియమిస్తామన్నారు. అలాగే ప్రతీ మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)ని నియమిస్తామన్నారు.ప్రతీ ఏఈకి సర్వే పరికరాలు, ఒక ల్యాప్‌టాప్ ఇస్తామన్నారు. పనులకు సంబంధించిన ఫొటోలను, సమాచారాన్ని ఎప్పటికప్పుడు నెట్లో అందరికీ అందుబాటులో ఉండేలా అప్లోడ్ చేస్తారని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో అన్ని చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. రజకులు, ముదిరాజ్‌లు, రైతులందరినీ భాగస్వామ్యం చేస్తామన్నారు. అంతకు ముందు టీడీపీ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, పూడికతీత పనులను పారదర్శకతతో చేయాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ ఒక్క కాకతీయులే చెరువులు తవ్వించలేదని, తమ ప్రాంతంలోని రాజులు కూడా చెరువులు తవ్వించారని, చెరువుల పునరుద్ధరణ పనులకు ‘మిషన్‌కాకతీయ’ పేరు ఎలాపెడతారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి మెగావాట్ల సోలార్‌పార్కు మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక సోలార్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందుకోసం 5,481.86 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం 1500 వ్యవసాయ సోలార్ పంపుసెట్లను మంజూరు చేసిందన్నారు. మార్కెట్ కమిటీల కంప్యూటరీకరణ ఏడాదికి 20 నుండి 30 వ్యవసాయ మార్కెట్ కమిటీలను కంప్యూటరీకరిస్తామని హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేలు ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, వేముల వీరేశంలు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. బహిరంగ వేలంపాటల స్థానంలో ఈ-టెండర్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద్, వి.శ్రీనివాస్‌గౌడ్‌లు అడిగిన ప్రశ్నకు ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ లిఖితపూర్వక సమాధానమిస్తూ 80చదరపు గజాల కంటే ఎక్కువగా ఉన్న 6,707 ఆక్రమిత స్థలాలతోపాటు 13,134 ఇళ్లను క్రమబద్ధీకరించామని తెలిపారు.