మిషన్ కాకతీయ షురూ !
- మొదటి విడతలో 50 చెరువులకు టెండర్లు
- ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో నోటిఫికేషన్
- 11 నుంచి ఆన్‌లైన్‌లో షెడ్యూళ్లు
వరంగల్ రూరల్ : చిన్ననీటి వనరుల పునరుద్ధరణలో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 5,865 చెరువులుండగా అందులో 1,415 చెరువులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి విడత చేపట్టిన చెరువులన్నింటికి ఒకేసారి టెండర్లు నిర్వహించేందుకు సాంకేతికపరంగా ఇబ్బందులున్నందున జిల్లాలో 50 చెరువులకు టెండర్లు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
రూ.38.08 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 50 చెరువులకు ఆన్‌లైన్‌లో ఈ-ప్రొక్యూర్‌మెంటు ద్వారా టెండర్లు నిర్వహించేందుకు అధికారులు వివరాలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ సీఓటీకి అందించారు. రూ.కోటి వరకు ఖర్చయ్యే చెరువులకు పరిపాలన మంజూరు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం జిల్లాస్థాయిలోని నీటిపారుదల శాఖ ఎస్‌ఈకు ఇస్తూ జీఓ జారీ చేసింది. దీంతో నవంబర్ 27 నాడే మొదటి విడత టెండర్లు నిర్వహించే చెరువులకు నిధులు కేటాయిస్తూ పరిపాలన మంజూరు ఇచ్చారు.
దీంతో ఇరిగే షన్ అధికారులు ఆయా చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లు తయారు చేసి,టెండర్ల ప్రక్రియ నిర్వహించే సంస్థలకు సమర్పించారు. ఈ ఎస్టిమేట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు సమయం పడుతుండడంతో ఈ నెల 11 నుంచి ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో కాంట్రాక్టర్లకు బిడ్ డాక్యుమెంట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు.
రూ.38.08 కోట్లతో 50 చెరువుల పునరుద్ధరణ
ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు ఈ ఏడాది చేపట్టనున్న 1,415 చెరువులకు ఎస్టిమేట్లు తయారు చేసే పనిలోపడ్డారు. అందులో 276 చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లు తయారు కాగానే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో అందజేశారు. రూ.కోటికి తక్కువ ఉన్న చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లను సర్కిల్ కార్యాలయంలో స్క్రూట్నీ చేశారు. స్న్రూట్నీ పూర్తయినా 50 చెరువులకు రూ.38.08 కోట్లతో టెండర్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మిగిలిన 1,089 చెరువుల ఎస్టిమేట్లను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.