ప్రధానికి ఘనస్వాగతం పలుకుదాం
- మంత్రి హరీశ్‌రావు
- అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో సమావేశం
- హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
నంగునూరు: రాష్ట్రానికి మొదటి సారిగా వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలకాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. శుక్రవారం సిద్దన్నపేటలో అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని సభకు ఏ గ్రామం నుంచి ఎంత మంది వస్తున్నారు, ఎన్ని బస్సులు అవసరం, ఇన్‌చార్జీలు, వారి ఫోన్ నంబర్ల వివరాలను సేకరించారు.
సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి వస్తున్న ప్రధానికి కనివిని ఎరుగని రీతిలో స్వాగతం పలకాలన్నారు. నంగునూరు మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వారి కోరిక మేరకు బస్సులు పంపుతామన్నారు.
శనివారం రాత్రికి బస్సులు గ్రామాలకు చేరుకుంటాయని, సిద్దిపేట నుంచి వచ్చేవారు ముందు వరుసలో కూర్చోవాల్సి ఉన్నందున సభా ప్రాంగణానికి తొందరగా చేరుకోవాలన్నారు. అన్ని గ్రామాల నుంచి మహిళలు ఎక్కువగా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలి
ప్రతి గ్రామంలో 40 వేలకు తగ్గకుండా మొక్కలు నాటాలని సర్పంచ్‌లు, ఎంపీడీఓను మంత్రి ఆదేశించారు. ఒక్కో గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారో అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులు, ప్రజలు ఏమొక్కలను ఎక్కువగా అడుగుతున్నారో ఆరా తీశారు. సీత ఫలం, నీలగిరి మొక్కలు డిమాండ్ అధికంగా ఉన్నందున వాటిని బయట నుంచి తెప్పించి రైతులకు అందజేస్తామన్నారు. పొలం గట్లు, రైతు భూములకు బౌండరీలుగా వీటిని నాటాలన్నారు.
ప్రతి గ్రామానికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పురేందర్, పీఏసీఎస్ చైర్మన్లు రమేశ్‌గౌడ్, సోమిరెడ్డి, ఎంపీడీఓ ప్రభాకర్, తహీసీల్దార్ గులాం ఫారూక్ అలీ, ఎంఈఓ దేశిరెడ్డి, ఏపీఎం ఆంజనేయులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.