సమస్యల్లో ముంపు గ్రామాలు | The villages in the construction of the Srirangasagar project have lost their valuable land. | Sakshi
Sakshi News home page

సమస్యల్లో ముంపు గ్రామాలు

Published Thu, Jul 13 2017 5:22 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

సమస్యల్లో ముంపు గ్రామాలు

సమస్యల్లో ముంపు గ్రామాలు

డీ1 పట్టాలు లేక రుణాలు లేవు
ఇబ్బందుల్లో పునరావాస గ్రామాలు


మామడ(నిర్మల్‌): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఆ గ్రామాల వారు తమ విలువైన భూములను కోల్పొయారు. ప్రాజెక్ట్‌ కోసం త్యాగం చేసిన వారికి ఇప్పటికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందడం లేదు. తమ ఇళ్లు, భూములు సర్వస్వం వదిలివచ్చిన వారు కోలుకోలేకపోతున్నారు.

ముంపునకు గురైన 33 గ్రామాలు
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జిల్లాలోని 33 గ్రామాలు ముంపు గురయ్యాయి. ముంపు గురైన గ్రామాలల్లో వారికి 1970లో పునరావాసంగా ఐదెకరాలతోపాటు, ఇంటిస్థలం, వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.600 నుంచి రూ800 పరిహారంగా ఇచ్చారు. అర్హులైన వారికి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు హామీఇచ్చారు. ముంపు గురై పునరావాసం ఏర్పాటు చేసిన గ్రామాలకు చెందిన సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా 2007లో పునరావాస సాయం కింద రూ.52 కోట్లతో సీసీరోడ్లు, మురుగు కాలువ, ఎత్తిపోతల పథకాలు, ఆలయాలు, సరస్వతీ కాలువ మరమ్మతు నిర్వహించారు. సమస్యలు పరిష్కారం కాక అభివృద్ధికి దూరం అవుతున్నారు.

సమస్యలతో సతమతం
మామడ మండలంలోని కమల్‌కోట్‌ పంచాయతీ పరిధిలో ఆదర్శనగర్, న్యూటెంబుర్ని, కొరిటికల్‌ పంచాయతీ పరిధిలో న్యూలింగంపెల్లి, న్యూసాంగ్వి, లక్ష్మణచాంద మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం, పొట్టపెల్లి(కె), నిర్మల్, దిలావార్‌పూర్‌ గ్రామాలలో పునరావాస గ్రామాలు ఉన్నాయి. ముంపు గ్రామాల పరిష్కరించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు హామీలకే పరిమితం అవుతున్నాయి.

ఆదర్శనగర్, న్యూటెంబుర్ని పునరావాస గ్రామంలో వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి కేటాయించిన భూములకు ఇప్పటికి డీ1 పట్టాలు లేక పోవడంతో బ్యాంకు రుణాలు, ఎరువులు, విత్తనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. కేటాయించిన భూముల సాగు కోసం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన మరమ్మతుకు నోచుకోలేదు. దీంతో నీటి వసతి లేక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇళ్లు,భూములు ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కోల్పోయి చదువుకుని అర్హత కలిగి కొంత మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మరికొంత మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఊరుతో పాటు ఉపాధి కోల్పోయాను
మాది దిలావార్‌పూర్‌ మండలంలోని కొత్తూర్‌ గ్రామం. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మా గ్రామం ముంపునకు గురవడంతో కమల్‌కోట్‌ పంచాయతీ పరిధిలో 1982లో పునరావాసం కల్పించారు. కొత్తూర్‌లో సుంకరిగా పనిచేసేవాడిని. ప్రతి నెల రూ. 12వందలు ఇచ్చేవారు. ఇక్కడికి రావడంతో సుంకరిగా పనిచేద్దామన్నప్పటికి ఇవ్వడం లేదు. ఉన్న ఉపాధిని కోల్పోయాను.   
 – ముత్యం, ఆదర్శనగర్‌

నష్టపరిహారం అందించాలి
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఐదెకరాల కంటే ఎక్కువగా ముంపులో కోల్పోయాను. ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చింది. పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదు. ఇచ్చిన భూములకు డీ1 పట్టాలు ఇవ్వడం లేదు. పాస్‌పుస్తకాలు లేక బ్యాంకు రుణాలు అందడం లేదు. సమస్యలు పరిష్కరించాలి.      
 – గంగారెడ్డి, ఆదర్శనగర్‌

Advertisement
Advertisement