దేశంలోని 19 నదీ బేసిన్లలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం అధ్యయనం చేస్తోంది.
సీడబ్ల్యూసీ అధికారులకు ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ముగిసిన శిక్షణ
వచ్చే ఏడాది జూలైలోగా 19 బేసిన్లలో నీటి లభ్యతపై నివేదిక
సాక్షి, హైదరాబాద్: దేశంలోని 19 నదీ బేసిన్లలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం అధ్యయనం చేస్తోంది. బ్రహ్మపుత్ర, కావేరి, మహానది, నర్మద, యమున వంటి ప్రముఖ నదులతో పాటు కృష్ణా; గోదావరి బేసిన్‌ల్లో నీటి లభ్యతను తెలుసుకునేందుకు కేంద్ర జలసంఘం కసరత్తు వేగిరం చేసింది. నీటి లభ్యతపై కచ్చితమైన అంచనా కోసం నేషన ల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) సహకారం తీసుకుంటున్న సీడబ్ల్యూసీ ఇప్పటికే ఎంపిక చేసిన అధికారులకు శిక్షణ సైతం ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఈ నెల 5 నుంచి మొదలైన శిక్షణ కార్యక్రమాలు 9తో ముగిశాయి.
శిక్షణ పొందిన అధికారులు సోమవారం నుంచి వారికి నిర్దేశించిన బేసిన్‌ల పరిధిలో అధ్యయనం మొదలు పెట్టనున్నారు. నిజానికి నదుల్లో నీటి లభ్యతపై 1993లో ఒకమారు, ఆ తర్వాత 1998లో మారోమారు అధ్యయనం జరిగింది. అప్పటి లెక్కలనే ఇప్పటికీ పరిగణనకు తీసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. నదుల్లో నీటి లభ్యతపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధ్యయనం జరగాల్సి ఉన్నా ఆ పని జరగడం లేదు. దీంతో నీటి వినియోగం విషయంలో అంతర్రాష్ట్ర వివాదాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో నీటి లభ్యత లెక్కలను కొత్తగా తేల్చాలని సీడబ్ల్యూసీ నిర్ణరుుంచింది. దీంతో పాటే నదుల పరీవాహక పరిధిలో గడచిన 30 ఏళ్లుగా నమోదైన వర్షపాతం, పరీవాహక పరిధిలో వాతావరణంలో మార్పులు, భూగర్భజలాల పరిస్థితి, సాగు విస్తీర్ణంపై లెక్కలన్నింటినీ ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహకారంతో శాటిలైట్ చిత్రాలను తీసి, వచ్చే ఏడాది జూలై నాటికి కచ్చితమైన అంచనాలు తయారు చేసి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. ఈ లెక్కల ఆధారంగా భవిష్యత్తులో నదుల అనుసంధానం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి, అంతర్రాష్ట్ర నదీ బేసిన్ల మధ్య వివాదాలను పరిష్కాలను పరిష్కరించాలని భావిస్తోంది.