మీ బండారం బయటపెడతాం | Minister Harish Rao on the Uproar of the Congress leaders | Sakshi
Sakshi News home page

మీ బండారం బయటపెడతాం

Published Fri, Mar 18 2016 3:45 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మీ బండారం బయటపెడతాం - Sakshi

మీ బండారం బయటపెడతాం

కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం
మీ హయాంలోని పాపాలను అసెంబ్లీలోనే చెబుతాం
మహారాష్ట్రతో ఒప్పందంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువేనని సీడబ్ల్యూసీ నాడే చెప్పింది
అయినా వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు?

 
హైదరాబాద్: ‘‘గోదావరి జలాలు, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం విషయంలో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు ఆడుతోంది. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. సాగునీరు తెచ్చేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అవాస్తవాలు, అబద్ధాలు చెబుతున్నారు. మీ పాపాలను, తప్పులను అసెంబ్లీలోనే వివరిస్తాం. మీ బండారాన్ని బట్టబయలు చేస్తాం’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మాటలు దొంగే దొంగ అన్నట్లు ఉందని దుయ్యబట్టారు. ఏపీ, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ఎందుకు చొరవచూపలేదని నిలదీశారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘‘152 మీటర్ల కంటే తక్కువ ఎత్తుకు ఒప్పందం చేసుకున్నారని లేనిపోని ప్రచారం చేస్తున్నారు. అసలు మీరు 152 మీటర్ల ఎత్తుతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమన్నా ఉంటే ఆ కాగితాలు తీసుకు రండి. అప్పుడు మేం ఎంత ఎత్తుకు అగ్రిమెంట్ చేసుకున్నామో చెబుతాం..’’ అని అన్నారు.

‘‘ప్రాజెక్టుకు సంబంధించి 2007లో మొదటి జీవో విడుదల చేశారు. 2014 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ఏడేళ్ల కాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదో ఆ పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి సమాధానం చెప్పాలి. ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తును మీకు మీరే  ఊహించుకుని కడుతున్నారు. కనీసం మాతో మాట్లాడలేదు..’ అని అప్పటి మహారాష్ట్ర సీఎం ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. తిరిగి కిరణ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినా.. అందులో ఎక్కడా 152 మీటర్లని ప్రస్తావించలేదు. కేవలం 2009 ఎన్నికల ముందు అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అన్న విషయం కూడా విస్మరించి.. మహారాష్ట్రతో మాట్లాడకుండా 152 మీటర్ల ఎత్తును ఊహించుకుని పనులు మొదలు పెట్టారు’’ అని పేర్కొన్నారు. ఇందుకోసం 25 ప్యాకేజీలకు ఒకే సారి టెండర్లు పిలిచారని, కానీ ఏడేళ్లలో బ్యారేజీ పనులు మాత్రం మొదలు పెట్టలేదన్నారు. ఎలాంటి సూత్రప్రాయ అంగీకారం కూడా లేకుండానే ప్రాజెక్టు మొదలును (హెడ్) వదిలిపెట్టి చివరన (టెయిల్) పనులు చేశారని విమర్శించారు.

సీడబ్ల్యూసీ నాడే లేఖ రాసింది
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉందంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసిందని, ఇందులో 70 నుంచి 75 శాతం కూడా నీటిని డ్రా చేసుకోలేరని వివరించినట్లు హరీశ్ గుర్తుచేశారు. ‘‘బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల వద్ద 5 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 148 మీటర్ల వద్ద కేవలం 1.5 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంటుంది. ఇక నీళ్లెలా తీసుకుంటారు? దీంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం లేదని సీడబ్ల్యూసీ చెప్పినా.. వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టు డిజైన్ సరిగా లేదు. జలాశయాల డిజైన్ సరిగా లేదు. 11 టీఎంసీల డెడ్ స్టోరేజీ పోతే కనీసం 7 టీఎంసీల నీరు కూడా ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లివ్వని ప్రాజెక్టులు చేపట్టారు. దేవాదులకు కూడా బ్యారేజీ లేదు’’ అని పేర్కొన్నారు. తాము 165 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాలు సిద్ధం చేస్తామని, మేడిగడ్డ వద్ద బ్యారేజీ వల్ల 300 రోజులు నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుందని, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ, ఎస్సారెస్పీ వరద కాల్వ ఆయకట్టును స్థిరీకరించవచ్చని వివరించారు. తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ మధ్యనే 70 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందన్నారు.
 
రంగారెడ్డి జిల్లాపై మీకు ప్రేమ ఉందా?
‘‘రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ నేతలకు ప్రేమ ఉందా? 2007లో టెండర్లు పిలిస్తే 2014 వరకు పనులు ఎందుకు చేయలేదు..? 4 ప్యాకేజీల పనులకు ఒకేసారి రూ.165 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. కానీ రూ.26కోట్ల పనులు మాత్రమే చేయించారు. ఇదీ మీకున్న ప్రేమ..’’ అని హరీశ్ ఎద్దేవా చేశారు. ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు వెరసి తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement