మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి
తుమ్మిడిహెట్టి ఎత్తు 152 మీటర్లుండాలి: జానా
అందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి
{పాణహిత నిర్వహణ వ్యయం ఎకరాకు రూ.36 వేలు
ఇదంతా ఆయకట్టు రైతులపైనే పడుతుంది
పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపులు ఎక్కడ?
నీటి లభ్యత లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణమా?
పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ చుక్క నీరు అదనంగా తీసుకోడానికి వీల్లేదు
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని విపక్ష నేత కె.జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల రంగ నిపుణులు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారని, పారదర్శకత కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బడ్జెట్‌పై సాధారణ చర్చలో భాగంగా గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తుమ్మిడిహెట్టి ఎత్తుతో పోలిస్తే.. కాళేశ్వరం వద్ద కేవలం 101/102 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తుండడంతో అదనంగా మరో 50 మీటర్లు ఎత్తుకి నీళ్లను ఎత్తిపోయాల్సి రావడం భారం కాబోతోందన్నారు. గతంలో రూ.38,500 కోట్లు అవుతుందన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పుడు రూ.84 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయం, పెట్టుబడి వడ్డీలు, విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వం భరించినా.. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం(ఓఅండ్‌ఎం) ఎకరాకు రూ.36 వేలు ఉంటుందని, ఇదంతా ఆయకట్టు రైతులపైనే పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఏఎమ్మార్పీ వెంటనే పూర్తి చేయాలి
పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కుల నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రయత్నాలు చేస్తోందని, శ్రీశైలం నుంచి రాష్ట్ర వాటాను పొందడానికి ఏఎమ్మార్పీ ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలని జానారెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఒక్క చుక్క అదనంగా తీసుకోకుండా నిరోధించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాల ఆయకట్టు సాగే కష్టమని, దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల కింద ఒక టీఎంసీతో 15 వేల ఎకరాలకు నీరిస్తామని ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరమన్నారు. సూక్ష్మ సేద్యంతో 15 వేల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పినప్పటికీ ప్రాజెక్టుల డీపీఆర్‌లో అది పొందుపర్చలేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ జోక్యం చేసుకుంటూ... తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం లేఖ రాయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామని సమాధానమిచ్చారు.
పాలమూరు - రంగారెడ్డికి నీళ్లు ఎక్కడివి?
కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని మిగులు జలాల్లో ఉమ్మడి ఏపీకి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన 194 టీఎంసీల్లో తెలంగాణ వాటా కింద 87 టీఎంసీలు మాత్రమే వస్తాయని జానారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 95 టీఎంసీల మిగులు జలాలపై ఆధారపడి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లకు ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నించారు. నీటి లభ్యత పరిశీలించకుండానే ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్ణయం తగదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి లభ్యతపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీతో అధ్యయనం జరిపించాలని డిమాండ్ చేశారు. కృష్ణా బేసిన్‌లో 90 రోజుల పాటు మిగులు జలాల లభ్యత ఉంటుందనే అంచనాలపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారని, అయితే వాస్తవానికి మిగులు జలాల లభ్యత 47 రోజులు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అందులో మన వాటా లభ్యత 30 రోజులేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు లిఫ్టు సామర్థ్యాన్ని రోజుకు 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు పెంచాలన్నారు.
కేటాయింపులు సరే.. ఆదాయం ఏదీ?
బడ్జెట్‌లో ప్రభుత్వ లక్ష్యాలు, కేటాయింపులతో పోలిస్తే ప్రభుత్వ ఆదాయానికి పొంతన కుదరడం లేదని జానారెడ్డి తెలిపారు. 2014-15, 2015-16 బడ్జెట్‌లో కేటాయింపులకు తగ్గట్లు ఆదాయం రాకపోవడంతో వ్యయం తగ్గిందన్నారు. 2014-15 బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీలకు 34 శాతం, బీసీలకు 52 శాతం, మైనారిటీలకు 30 శాతమే నిధులు ఖర్చు చేశారన్నారు. 2016-17లో బడ్జెట్ కేటాయింపులకు తగ్గట్లు వ్యయం చేసే అవకాశం లేదని స్పష్టంచేశారు. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం జీవోల వెబ్‌సైట్‌ను ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు.