Pranahita-Chevella
-
‘ప్రాణహిత’కే జాతీయ హోదా సులభం
ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి సూచన ⇒ అక్కడ 120 టీఎంసీలు తీసుకున్నాకే కాళేశ్వరం వద్దకు వెళ్లాలి ⇒ కాళేశ్వరాన్ని స్టేజ్–2 కింద పరిగణించాలి ⇒ లేదంటే ప్రభుత్వంపై అనవసర నిర్మాణ, నిర్వహణ భారం ⇒ ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రాజెక్టులు పూర్తి చేయాలని హితవు సాక్షి, హైదరాబాద్: ‘ప్రాణహిత–చేవెళ్ల’ ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి దగ్గరే గరి ష్టంగా నీటిని వినియోగించుకునేందుకు ప్రయ త్నించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. అక్కడ కొరతగా ఉండే నీటిని కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ నుంచి తీసుకోవాలని.. అలాచేస్తే ప్రాజెక్టు వ్యయభారం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు. తమ్మిడిహెట్టి వద్ద 120 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశముందని, ఆ ప్రాజెక్టుకు 13 రకాల కేంద్ర డైరెక్టరేట్ల అనుమతులున్న దృష్ట్యా దాన్నే స్టేజ్–1గా తీసుకుని.. కాళేశ్వరాన్ని స్టేజ్–2గా చేర్చాలని చెప్పారు. ఇలాగైతేనే ప్రాజెక్టుకు జాతీయ హోదా సులభంగా వస్తుందని తేల్చి చెప్పారు. అదే కాళేశ్వరం ప్రధాన ప్రాజెక్టుగా చేపడితే అనుమతుల కోసం మళ్లీ తొలినుంచీ ప్రయత్నం చేయాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. మంగళవారం శాసనసభలో సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ‘‘ఈ ప్రాజెక్టు రీడిజైన్ పూర్తిగా లోపభూయిష్టం. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో కేవలం 3 వేల ఎకరాలే ముంపు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. మహారాష్ట్రకు రాష్ట్ర ప్రతినిధుల బృం దాన్ని తీసుకెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా తమ్మిడిహెట్టి వద్ద లభ్యత నీటినంతా వాడుకుని, మిగతా నీటికోసం కాళేశ్వరం వెళ్లడం మంచిది..’’అని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక 450 మీటర్ల ఎత్తున ఉన్న అప్పర్ మానేరు నుంచి 428 మీటర్ల ఎత్తులో ఉన్న నిజాంసాగర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించకుండా.. 557 మీటర్ల ఎత్తున ఉన్న మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్‌కు నీటిని ఎత్తిపోయడం ఏమిటని నిలదీశారు. న్యాయం చేయాలంటే నిందలు వేస్తారా? భూసేకరణ విషయంలో నిర్వాసితులకు, రైతులకు న్యాయం చేయాలని.. భూసేకరణ చట్టం మేరకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయని ప్రభుత్వం విమర్శిం చడం సరికాదన్నారు. గత రెండున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయని సర్కారు.. ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించిందని విమర్శించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో ఈ ఏడాది 100 టీఎంసీలు వృథా అయ్యాయని.. ఇప్పటికైనా విమర్శలు మాని ప్రాజెక్టుల పూర్తికి శ్రద్ధ చూపాలని సూచించారు. తాగునీటి సమస్య తీర్చండి: ఎంఐఎం హైదరాబాద్‌లోని పాతబస్తీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిని వెంటనే పరిష్కరించాలని ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. 20 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటిం చిందని, వెంటనే ఆ పని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో చెత్త నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉందని, రోడ్లన్నీ అధ్వాన స్థితికి చేరుకున్నాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు. ‘పాలమూరు’ అక్రమాలను నిరూపిస్తాం ‘పాలమూరు–రంగారెడ్డి’ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయని, సభా సంఘం ఏర్పాటు చేస్తే అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం ముందుకు వస్తే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్ద అయినా చర్చకు సిద్ధమని చెప్పారు. రెండు కాంట్రాక్టు సంస్థల కోసం టెండర్ నిబంధనలను పూర్తిగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల్లో ఒక్క చుక్క నీటినైనా అదనంగా దక్కించుకోలేకపోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా కొందరు అధికార పక్ష సభ్యులు అడ్డుపడటంతో.. ‘సభ ఉన్నది డబ్బా కొట్టుకోవడానికి కాద’ంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాహుబలిని తలదన్నే ‘యోగి’వస్తాడు! రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్రం సహకరిస్తోందని, సహకరించకపోతే తామూ ఓట్లడగబోమని ప్రభాకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. ఇక్కడా ఒక ‘యోగి’వస్తాడని, ఇక్కడి రూపురేఖలు మారుస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో ‘బాహుబలి వద్దా?’అని కొందరు సభ్యులు వ్యాఖ్యానించడంతో..‘బాహుబలిని సైతం తలదన్నేవాడే యోగి’అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉందని చెప్పారు. -
వైఎస్సార్ కలల ప్రాజెక్టు ప్రాణహిత–చేవెళ్ల
22వ ప్యాకేజీకి లైన్ క్లియర్ త్వరలోనే జీవో విడుదలవుతుంది శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ కామారెడ్డి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన ప్రాణహిత–చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని యథావిధిగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తెలిపారు. సోమవారం కామారెడ్డిలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి దివంగత సీఎం వైఎస్ ప్రాణహిత –చేవెళ్ల పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఈ పథకంలోని 22వ ప్యాకేజీలో మంచిప్ప నుంచి భూంపల్లి ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో 22వ ప్యాకేజీని నిలిపివేసిందని, మల్లన్నసాగర్ నుంచి నీటిని ఇస్తామని చెప్పి సర్వేలు చేయించిందన్నారు. అది సాధ్యం కాకపోవడంతో మిడ్‌మానేరు నుంచి నీరు ఇస్తామన్నారని, అది కూడా సాధ్యం కాదని తేలిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులను పలుమార్లు కలిసి 22వ ప్యాకేజీని యథావిధిగా కొనసాగించాలని కోరామని తెలిపారు. భూంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని అందించవచ్చని, భూసేకరణ కూడా చాలా వరకు జరిగిందని సీఎంకు వివరించామన్నారు. ఇదే విషయమై ఇటీవల ఇరిగేషన్ అధికారులు తనతో చర్చించారని, పాత ప్రణాళికతోనే సాధ్యమని తాను వారికి వివరించానని పేర్కొన్నారు. అధికారులు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు సరైన సూచనలు చేశారని, దీంతో వారు 22వ ప్యాకేజీకే మొగ్గుచూపారని తెలిపారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ ఉన్నతాధికారులు తనకు చెప్పారన్నారు. త్వరలోనే జీవో విడుదలవుతుందన్నారు. ఈ ప్యాకేజీ పనులకు దివంగత సీఎం వైఎస్సార్ కామారెడ్డిలో శంకుస్థాపన చేశారన్నారు. పనులను ప్రారంభిస్తే ఏడాదిన్నరలో ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ప్రాణహిత –చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని తిరిగి చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సీఎం, భారీనీటిపారుదల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లమడుగు సురేందర్, నల్లవెల్లి అశోక్, కైలాస్ శ్రీనివాస్‌రావ్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి లభ్యత ఉన్నందునే మేడిగడ్డకు మార్పు
- తమ్మిడిహెట్టి కన్నా మేడిగడ్డ వద్దే 500 టీఎంసీల నీటి లభ్యత ఎక్కువ - అందుకే మేడిగడ్డ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టితో పోలిస్తే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందునే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తమ ప్రాంతంలో ముంపును అంగీకరించలేమని మహారాష్ట్ర తేల్చిచెప్పడం కూడా డిజైన్ మార్పుకు కారణమైందన్నారు. గురువారం ప్రాణహిత డిజైన్ మార్పుపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మేడిగడ్డ, తమ్మిడిహెట్టి వద్ద 47 ఏళ్ల నీటి లెక్కలను సీఎం కేసీఆర్ వివరించారు. తమ్మిడిహెట్టి వద్ద 1,144.8 టీఎంసీల సరాసరి లభ్యత ఉండగా, కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలిపారు. సరాసరిన 500 టీఎంసీలు ఎక్కువగా ఉంటుందన్నారు. గోదావరిలో ఇంద్రావతి కలిసే పేరూర్ వద్ద సరాసరిన 2,430 టీఎంసీల లభ్యత ఉంటుందన్నారు. ‘తమ్మిడిహెట్టి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు అయితే, మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో 16 టీఎంసీలు ఉంటుంది. 101 మీటర్లకు ఒప్పుకుంటే మరో 3 టీఎంసీల అదనపు నిల్వకు అవకాశం ఉంటుంది. ఇక్కడ రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశముంది. ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం కడుతున్నాం. మేడిగడ్డ వద్ద భవిష్యత్తులో ఎప్పుడైనా కొరత ఏర్పడినా ఇంద్రావతి నీటిని తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్ తరాలకు ఇంద్రావతి, ప్రాణహిత నీళ్లే మిన్న’ అని అన్నారు. ఇకపై ప్రాణహిత-చేవెళ్ల ఉండదని, దాన్ని కాళేశ్వరంగానే భావించాలని చెప్పారు. తానే వ్యతిరేకించానని మహారాష్ట్ర సీఎం చెప్పారు..: ప్రాజెక్టు ముంపు విషయమై మహారాష్ట్రకు వెళ్లి చర్చలు జరిపానని, అయితే తమ ప్రాంతంలో ముంపునకు ఒప్పుకోబోమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో, కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా అగ్రిమెంట్లు జరగలేదు. బీజేఎల్పీ నేతగా తమ్మిడిహెట్టితో జరిగే ముంపును వ్యతిరేకిస్తూ ధర్నా చేశానని, పోలీసులు అరెస్ట్ సైతం చేశారని ఉన్న వార్త, ఫొటోలను చూపారు. బీజేపీలో ఉండగా వ్యతిరేకించినవాణ్ని, సీఎంగా ఎలా అంగీకరిస్తాం అని అన్నారు’ అని సీఎం కేసీఆర్ వివరించారు. అంతకుముందే నిర్మాణం ఏకపక్షంగా, మీకు మీరే ఊహించుకుని నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఈ పనులు ఫలప్రదం కావని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్రానికి లేఖ రాశారని, సీడబ్ల్యూసీలో అనేక అభ్యంతరాలు చెప్పారని తెలిపారు. గోదావరిలో 160 టీఎంసీలకు మించి మరో 20 టీఎంసీలు తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని, తమ్మిడిహెట్టి వద్ద మాత్రం 148 మీటర్ల నిర్మాణం ఉండాలని చెప్పడంతో మేడిగడ్డ ప్రతిపాదన తెచ్చామని తెలిపారు. సామర్థ్యం పెంచితే ధర పెరగదా..?: ప్రాజెక్టు వ్యయ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ‘ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.83 వేల కోట్లకు పెంచారని అంటున్నారు. ప్రాజెక్టులో 16.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను 200 టీఎంసీల కెపాసిటీకి పెంచాం. సామర్థ్యం పెంచితే ఖర్చు పెరగదా’ అని ప్రశ్నించారు. మేడిగడ్డ-ఎస్సారెస్పీల మధ్య లైవ్ స్టోరేజీ పెంచితే ఇక్కడ చేపల పెంపకం, 200 కి.మీ నౌకాయానానికి అనువుగా ఉంటుందన్నారు. -
మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి
తుమ్మిడిహెట్టి ఎత్తు 152 మీటర్లుండాలి: జానా అందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి {పాణహిత నిర్వహణ వ్యయం ఎకరాకు రూ.36 వేలు ఇదంతా ఆయకట్టు రైతులపైనే పడుతుంది పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపులు ఎక్కడ? నీటి లభ్యత లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణమా? పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ చుక్క నీరు అదనంగా తీసుకోడానికి వీల్లేదు హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని విపక్ష నేత కె.జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నీటిపారుదల రంగ నిపుణులు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారని, పారదర్శకత కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బడ్జెట్‌పై సాధారణ చర్చలో భాగంగా గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తుమ్మిడిహెట్టి ఎత్తుతో పోలిస్తే.. కాళేశ్వరం వద్ద కేవలం 101/102 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తుండడంతో అదనంగా మరో 50 మీటర్లు ఎత్తుకి నీళ్లను ఎత్తిపోయాల్సి రావడం భారం కాబోతోందన్నారు. గతంలో రూ.38,500 కోట్లు అవుతుందన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పుడు రూ.84 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయం, పెట్టుబడి వడ్డీలు, విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వం భరించినా.. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం(ఓఅండ్ఎం) ఎకరాకు రూ.36 వేలు ఉంటుందని, ఇదంతా ఆయకట్టు రైతులపైనే పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏఎమ్మార్పీ వెంటనే పూర్తి చేయాలి పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కుల నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రయత్నాలు చేస్తోందని, శ్రీశైలం నుంచి రాష్ట్ర వాటాను పొందడానికి ఏఎమ్మార్పీ ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలని జానారెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఒక్క చుక్క అదనంగా తీసుకోకుండా నిరోధించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాల ఆయకట్టు సాగే కష్టమని, దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల కింద ఒక టీఎంసీతో 15 వేల ఎకరాలకు నీరిస్తామని ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరమన్నారు. సూక్ష్మ సేద్యంతో 15 వేల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పినప్పటికీ ప్రాజెక్టుల డీపీఆర్‌లో అది పొందుపర్చలేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ జోక్యం చేసుకుంటూ... తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం లేఖ రాయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామని సమాధానమిచ్చారు. పాలమూరు - రంగారెడ్డికి నీళ్లు ఎక్కడివి? కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని మిగులు జలాల్లో ఉమ్మడి ఏపీకి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన 194 టీఎంసీల్లో తెలంగాణ వాటా కింద 87 టీఎంసీలు మాత్రమే వస్తాయని జానారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 95 టీఎంసీల మిగులు జలాలపై ఆధారపడి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లకు ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నించారు. నీటి లభ్యత పరిశీలించకుండానే ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్ణయం తగదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి లభ్యతపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీతో అధ్యయనం జరిపించాలని డిమాండ్ చేశారు. కృష్ణా బేసిన్లో 90 రోజుల పాటు మిగులు జలాల లభ్యత ఉంటుందనే అంచనాలపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారని, అయితే వాస్తవానికి మిగులు జలాల లభ్యత 47 రోజులు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అందులో మన వాటా లభ్యత 30 రోజులేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు లిఫ్టు సామర్థ్యాన్ని రోజుకు 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు పెంచాలన్నారు. కేటాయింపులు సరే.. ఆదాయం ఏదీ? బడ్జెట్లో ప్రభుత్వ లక్ష్యాలు, కేటాయింపులతో పోలిస్తే ప్రభుత్వ ఆదాయానికి పొంతన కుదరడం లేదని జానారెడ్డి తెలిపారు. 2014-15, 2015-16 బడ్జెట్లో కేటాయింపులకు తగ్గట్లు ఆదాయం రాకపోవడంతో వ్యయం తగ్గిందన్నారు. 2014-15 బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీలకు 34 శాతం, బీసీలకు 52 శాతం, మైనారిటీలకు 30 శాతమే నిధులు ఖర్చు చేశారన్నారు. 2016-17లో బడ్జెట్ కేటాయింపులకు తగ్గట్లు వ్యయం చేసే అవకాశం లేదని స్పష్టంచేశారు. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం జీవోల వెబ్‌సైట్‌ను ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. -
'ఆ రెండు చోట్ల కూడా టీఆర్ఎస్సే గెలవవచ్చు'
హైదరాబాద్: ప్రాణహిత- చేవెళ్ల రీ డిజైన్ పేరుతో.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా మార్చి వేల కోట్లు పెంచడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విలేరులతో మాట్లాడారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులోని 28 ప్యాకేజీలకు కొత్త టెండర్లు పిలవకుండా పాతవాటి అంచానాలకే 50 నుంచి 80 శాతం పెంచడంలో అవినీతి ఉందని పాల్వాయి విమర్శించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తోనే జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ గెలిచిందని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికలను జీహెచ్ఎంసీతో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అవకతవకలతో ఖమ్మం, వరంగ్ల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలవవచ్చునని చెప్పారు. అయినంతమాత్రాన టీఆర్ఎస్కు ప్రజాదరణ ఉన్నట్లు కాదని ఎంపీ పాల్వాయి తెలిపారు. -
‘ప్రాణహిత’ కోసం టీడీపీ పాదయాత్ర
- 18న శంకర్పల్లి మండలం మహాలింగపురం నుంచి ప్రారంభం - పాల్గొననున్న ఎర్రబెల్లి, రమణ, పెద్దిరెడ్డి తదితరులు చేవెళ్ల: ప్రాణహిత -చేవెళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ పాదయాత్రకు సిద్ధమవుతోంది. 18, 19 తేదీల్లో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి టీడీఎల్పీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ, ఈ.పెద్దిరెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ జిల్లా నాయకులు శేరి పెంటారెడ్డి, చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షుడు శేరి నర్సింహారెడ్డి చేవెళ్లలో ఆదివారం విలేకరులకు వివరించారు. 18న శంకర్పల్లి మండలం మహాలింగపురం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని, 19న కూడా కొనసాగిస్తామని చెప్పారు. జిల్లాకు తాగు, సాగునీరు అందించడంలో జరుగుతున్న అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తెలంగాణలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేయడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008లో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా రైతులకు, ప్రజలకు అన్యాయం చేయడానికి ప్రాజెక్టు డిజైన్ మారుస్తోందని మండిపడ్డారు. మెదక్ జిల్లాకు నీరివ్వడం కోసం రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడం పద్ధతి కాదన్నారు. 19న ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు పైలాన్‌వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీశైలం, సుభాన్‌గౌడ్, శర్వలింగం, రాజశేఖర్, లింగం, మొహినుద్దీన్, వడ్డె రాంచంద్రయ్య, మల్లారెడ్డి, అబీబ్, రాములు, శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, వీరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నీటి ప్రాజెక్టుల పూర్తికి నిపుణుల కమిటీ: కేసీఆర్
ముంబై: మహారాష్ట్ర, తెలంగాణల మధ్య నీటిప్రాజెక్టుల పూర్తికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ నిర్ణయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సమావేశమై నీటిప్రాజెక్టులపై చర్చించారు. అంతేకాకుండా భూసేకరణ, నష్ట పరిహారం, కోర్టు కేసుల పరిహారం, ముంపు ప్రజల అభ్యంతరాలపై నిపుణుల కమిటీ చర్చించనుంది. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పరస్పర సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో ముంపుకు గురయ్యే వారికి మహారాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అనంతరం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాకు సహకరించాలని కేసీఆర్ ఫడ్నవీస్ ను కోరగా దానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా గోదావరిలో 160 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో ముంపుకు గురయ్యే ప్రాంతాలను వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గా న్వేషణకు ఇద్దరు ముఖ్యమంత్రలూ అంగీకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...పొరుగు రాష్ట్రాలతో ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ పూరితంగా వ్యవహరించమని ఆయన పేర్కొన్నారు.