నీటి లభ్యత ఉన్నందునే మేడిగడ్డకు మార్పు | Medigadda changes only having resource of water facility | Sakshi
Sakshi News home page

నీటి లభ్యత ఉన్నందునే మేడిగడ్డకు మార్పు

Published Fri, Apr 1 2016 2:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

నీటి లభ్యత ఉన్నందునే మేడిగడ్డకు మార్పు

నీటి లభ్యత ఉన్నందునే మేడిగడ్డకు మార్పు

- తమ్మిడిహెట్టి కన్నా మేడిగడ్డ వద్దే 500 టీఎంసీల నీటి లభ్యత ఎక్కువ
- అందుకే మేడిగడ్డ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయం

 
సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టితో పోలిస్తే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందునే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తమ ప్రాంతంలో ముంపును అంగీకరించలేమని మహారాష్ట్ర తేల్చిచెప్పడం కూడా డిజైన్ మార్పుకు కారణమైందన్నారు. గురువారం ప్రాణహిత డిజైన్ మార్పుపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మేడిగడ్డ, తమ్మిడిహెట్టి వద్ద 47 ఏళ్ల నీటి లెక్కలను సీఎం కేసీఆర్ వివరించారు. తమ్మిడిహెట్టి వద్ద 1,144.8 టీఎంసీల సరాసరి లభ్యత ఉండగా, కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలిపారు. సరాసరిన 500 టీఎంసీలు ఎక్కువగా ఉంటుందన్నారు.
 
 గోదావరిలో ఇంద్రావతి కలిసే పేరూర్ వద్ద సరాసరిన 2,430 టీఎంసీల లభ్యత ఉంటుందన్నారు. ‘తమ్మిడిహెట్టి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు అయితే, మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో 16 టీఎంసీలు ఉంటుంది. 101 మీటర్లకు ఒప్పుకుంటే మరో 3 టీఎంసీల అదనపు నిల్వకు అవకాశం ఉంటుంది. ఇక్కడ రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశముంది.  ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం కడుతున్నాం. మేడిగడ్డ వద్ద భవిష్యత్తులో ఎప్పుడైనా కొరత ఏర్పడినా ఇంద్రావతి నీటిని తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్ తరాలకు ఇంద్రావతి, ప్రాణహిత నీళ్లే మిన్న’ అని అన్నారు. ఇకపై ప్రాణహిత-చేవెళ్ల ఉండదని, దాన్ని కాళేశ్వరంగానే భావించాలని చెప్పారు.
 
 తానే వ్యతిరేకించానని మహారాష్ట్ర సీఎం చెప్పారు..: ప్రాజెక్టు ముంపు విషయమై మహారాష్ట్రకు వెళ్లి చర్చలు జరిపానని, అయితే తమ ప్రాంతంలో ముంపునకు ఒప్పుకోబోమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో, కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా అగ్రిమెంట్‌లు జరగలేదు. బీజేఎల్పీ నేతగా తమ్మిడిహెట్టితో జరిగే ముంపును వ్యతిరేకిస్తూ ధర్నా చేశానని, పోలీసులు అరెస్ట్ సైతం చేశారని ఉన్న వార్త, ఫొటోలను చూపారు. బీజేపీలో ఉండగా వ్యతిరేకించినవాణ్ని, సీఎంగా ఎలా అంగీకరిస్తాం అని అన్నారు’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
 
 అంతకుముందే నిర్మాణం ఏకపక్షంగా, మీకు మీరే ఊహించుకుని నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఈ పనులు ఫలప్రదం కావని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్రానికి లేఖ రాశారని, సీడబ్ల్యూసీలో అనేక అభ్యంతరాలు చెప్పారని తెలిపారు. గోదావరిలో 160 టీఎంసీలకు మించి మరో 20 టీఎంసీలు తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని, తమ్మిడిహెట్టి వద్ద మాత్రం 148 మీటర్ల నిర్మాణం ఉండాలని చెప్పడంతో మేడిగడ్డ ప్రతిపాదన తెచ్చామని తెలిపారు.
 
 సామర్థ్యం పెంచితే ధర పెరగదా..?: ప్రాజెక్టు వ్యయ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ‘ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.83 వేల కోట్లకు పెంచారని అంటున్నారు. ప్రాజెక్టులో 16.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను 200 టీఎంసీల కెపాసిటీకి పెంచాం. సామర్థ్యం పెంచితే ఖర్చు పెరగదా’ అని ప్రశ్నించారు. మేడిగడ్డ-ఎస్సారెస్పీల మధ్య లైవ్ స్టోరేజీ పెంచితే ఇక్కడ చేపల పెంపకం, 200 కి.మీ నౌకాయానానికి అనువుగా ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement