tammidihetti
-
తమ్మిడిహెట్టి పట్టదా?
సాక్షి, ఆసిఫాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. తమ్మిడిహెట్టి వద్ద రూ.100 కోట్లు వ్యయం చేసి బ్యారేజీ ఎందుకు నిర్మించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. వాప్కోస్ సంస్థ 70 ఏళ్ల నీటి లభ్యతను లెక్కగట్టి తమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని చెప్పినప్పటికీ.. రీడిజైన్ పేరుతో ప్రాణహితను పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని, నామినేషన్ల ప్రాతిపదికన వేల కోట్ల పనులు చేపట్టారని ఆరోపించారు. సోమవారం ఉత్తమ్ నేతృత్వంలోని టీపీసీసీ బృందం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత నదిని సందర్శించింది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్ చేరుకుని అక్కడ నుంచి రోడ్డుమార్గాన తమ్మిడిహెట్టికి వెళ్లింది. నదికి మంగళహారతి, పాలాభిషేకం, పూజ చేసిన తర్వాత నేతలంతా నాటుపడవలో వెళ్లి నదిని పరిశీలించారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు డా.బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారని, 16లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు 152 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారని వివరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తులో కాళేశ్వరంలో నిర్మిస్తామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వంతో 100 మీటర్లకే ఒప్పందం చేసుకుని సంబరాలు చేసుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని దేశంలో పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టులు కట్టింది తమ పార్టీయేనని పేర్కొన్నారు. అయితే, కాళేశ్వరంతో పాటు ప్రాణహితపై కూడా బ్యారేజీ నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సాగు, తాగు నీరందించవచ్చని వివరించారు. కేవలం 15 మీటర్ల ఎత్తులో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలింవచ్చని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి చుక్కకు అధిక వ్యయం చేస్తున్నారని దుయ్యబట్టారు. భారీ వ్యయంతో కాళేశ్వరాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం.. తక్కువ ఖర్చుతో ఒకేసారి మూలధనంతో నిర్మించే ప్రాణహితను మాత్రం విస్మరిస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని ఉత్తమ్ వెల్లడించారు. ‘ఎల్లంపల్లి’పై తాత్సారం ఎందుకు? రామగుండం: ఎల్లంపల్లి ప్రారంభోత్సవంపై సీఎం కేసీఆర్ ఎందుకు తాత్సారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి సందర్శనకు హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు రైలులో వెళ్తున్న ఉత్తమ్ బృందానికి రామగుండం రైల్వేస్టేషన్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలోనే జలయజ్ఞంలో భాగంగానే ఎల్లంపల్లి (శ్రీపాద) ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. ఆ తర్వాత తమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాజెక్టుగా నామకరణం చేసి పనులు ప్రారంభించేందుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఆరేళ్లు గడిచినా ప్రారంభించకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎల్లంపల్లి విషయంలో వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా?: భట్టి ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. 20 శాతం పనులు మాత్రమే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసినట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పి, ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి పేరుతో సీఎం కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసమే వచ్చిందని, ఇందుకోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలకు తెలంగాణ ప్రజలు బలవుతున్నారని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాశేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రాణహిత బదులు వార్దా నదిపై బ్యారేజీ కడతామని చెబుతున్నారని విమర్శించారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఉండదని సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. ప్రాజెక్టుల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండింటి తీరు ఒకేలా ఉందని దుయ్యబట్టారు. ఈ పర్యటనలో టీపీసీసీ ఉపా«ధ్యక్షుడు మల్లు రవి, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, రమశే రాథోడ్, చిన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రాణహిత’కే జాతీయ హోదా సులభం
ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి సూచన ⇒ అక్కడ 120 టీఎంసీలు తీసుకున్నాకే కాళేశ్వరం వద్దకు వెళ్లాలి ⇒ కాళేశ్వరాన్ని స్టేజ్–2 కింద పరిగణించాలి ⇒ లేదంటే ప్రభుత్వంపై అనవసర నిర్మాణ, నిర్వహణ భారం ⇒ ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రాజెక్టులు పూర్తి చేయాలని హితవు సాక్షి, హైదరాబాద్: ‘ప్రాణహిత–చేవెళ్ల’ ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి దగ్గరే గరి ష్టంగా నీటిని వినియోగించుకునేందుకు ప్రయ త్నించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. అక్కడ కొరతగా ఉండే నీటిని కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ నుంచి తీసుకోవాలని.. అలాచేస్తే ప్రాజెక్టు వ్యయభారం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు. తమ్మిడిహెట్టి వద్ద 120 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశముందని, ఆ ప్రాజెక్టుకు 13 రకాల కేంద్ర డైరెక్టరేట్ల అనుమతులున్న దృష్ట్యా దాన్నే స్టేజ్–1గా తీసుకుని.. కాళేశ్వరాన్ని స్టేజ్–2గా చేర్చాలని చెప్పారు. ఇలాగైతేనే ప్రాజెక్టుకు జాతీయ హోదా సులభంగా వస్తుందని తేల్చి చెప్పారు. అదే కాళేశ్వరం ప్రధాన ప్రాజెక్టుగా చేపడితే అనుమతుల కోసం మళ్లీ తొలినుంచీ ప్రయత్నం చేయాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. మంగళవారం శాసనసభలో సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ‘‘ఈ ప్రాజెక్టు రీడిజైన్ పూర్తిగా లోపభూయిష్టం. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో కేవలం 3 వేల ఎకరాలే ముంపు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. మహారాష్ట్రకు రాష్ట్ర ప్రతినిధుల బృం దాన్ని తీసుకెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా తమ్మిడిహెట్టి వద్ద లభ్యత నీటినంతా వాడుకుని, మిగతా నీటికోసం కాళేశ్వరం వెళ్లడం మంచిది..’’అని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక 450 మీటర్ల ఎత్తున ఉన్న అప్పర్ మానేరు నుంచి 428 మీటర్ల ఎత్తులో ఉన్న నిజాంసాగర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించకుండా.. 557 మీటర్ల ఎత్తున ఉన్న మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్‌కు నీటిని ఎత్తిపోయడం ఏమిటని నిలదీశారు. న్యాయం చేయాలంటే నిందలు వేస్తారా? భూసేకరణ విషయంలో నిర్వాసితులకు, రైతులకు న్యాయం చేయాలని.. భూసేకరణ చట్టం మేరకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయని ప్రభుత్వం విమర్శిం చడం సరికాదన్నారు. గత రెండున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయని సర్కారు.. ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించిందని విమర్శించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో ఈ ఏడాది 100 టీఎంసీలు వృథా అయ్యాయని.. ఇప్పటికైనా విమర్శలు మాని ప్రాజెక్టుల పూర్తికి శ్రద్ధ చూపాలని సూచించారు. తాగునీటి సమస్య తీర్చండి: ఎంఐఎం హైదరాబాద్‌లోని పాతబస్తీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిని వెంటనే పరిష్కరించాలని ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. 20 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటిం చిందని, వెంటనే ఆ పని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో చెత్త నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉందని, రోడ్లన్నీ అధ్వాన స్థితికి చేరుకున్నాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు. ‘పాలమూరు’ అక్రమాలను నిరూపిస్తాం ‘పాలమూరు–రంగారెడ్డి’ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయని, సభా సంఘం ఏర్పాటు చేస్తే అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం ముందుకు వస్తే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్ద అయినా చర్చకు సిద్ధమని చెప్పారు. రెండు కాంట్రాక్టు సంస్థల కోసం టెండర్ నిబంధనలను పూర్తిగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల్లో ఒక్క చుక్క నీటినైనా అదనంగా దక్కించుకోలేకపోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా కొందరు అధికార పక్ష సభ్యులు అడ్డుపడటంతో.. ‘సభ ఉన్నది డబ్బా కొట్టుకోవడానికి కాద’ంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాహుబలిని తలదన్నే ‘యోగి’వస్తాడు! రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్రం సహకరిస్తోందని, సహకరించకపోతే తామూ ఓట్లడగబోమని ప్రభాకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. ఇక్కడా ఒక ‘యోగి’వస్తాడని, ఇక్కడి రూపురేఖలు మారుస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో ‘బాహుబలి వద్దా?’అని కొందరు సభ్యులు వ్యాఖ్యానించడంతో..‘బాహుబలిని సైతం తలదన్నేవాడే యోగి’అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉందని చెప్పారు. -
నీటి లభ్యత ఇప్పుడేమైంది..?
తమ్మిడిహెట్టి నీటి లభ్యతపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నలు సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోని తమ్మిడిహెట్టి వద్ద ఏడేళ్ల కింద 160 టీఎంసీలుగా ఉన్న గోదావరి జలాల నీటి లభ్యత.. తర్వాతి కాలంలో ఎక్కడికి పోయిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స ప్రశ్నించింది. 2007లో ఇంజనీర్లు, సలహాదారులు అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసి నీటి లభ్యతపై నివేదికలు ఇచ్చారని, ప్రస్తుతం అదే ఇంజనీర్లు, సలహాదారులు నీటి లభ్యత లేదంటూ మరో నివేదిక ఇవ్వడం విడ్డూరంగా ఉందంది. ఈ ఏడేళ్లలో ప్రాణహిత కింద రూ.12,333 కోట్లు ఖర్చు చేశారని, రూ.1,937 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇచ్చారని, ఇవన్నీ ఇప్పుడు వృథా అయ్యాయని ఆరోపించింది. ప్రజాధనం వృథా అవ్వడానికి కారకులైన ఇంజనీర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, సలహాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆర్థిక దుర్వినియోగంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో, లేదా ఉన్నత స్థారుు కమిటీతో విచారణ చేపట్టాలని కోరింది. మంగళవారం ఈ మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్ప రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి విలేకరుల సమావేశంలో మట్లాడారు. ప్రభుత్వం ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడె టెరుుల్పాండ్ల పనులను రూ.వేల కోట్లతో ఆరంభించి మధ్యలో నిలిపివేసిందని, దీని వల్ల రూ.2,250 కోట్లు వృథా అయ్యాయని తెలిపారు. మొత్తంగా ఇంజనీర్ల తప్పుడు నిర్ణయాలతో రూ.14,483 కోట్లు వృథా చేశారని ఆరోపించారు. అవసరమున్నా లేకున్నా అడ్వాన్సులు అవసరమున్నా లేకున్నా ఇంజనీర్లు మొబిలైజేషన్ అడ్వాన్సుకు రికమండ్ చేయడం, దానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆమోదం తెలపడం ద్వారా అన్ని ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా రూ.3,644 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారని, ఇందులో రూ.2,735 కోట్లు తిరిగి రాబట్టగా.. రూ.909 కోట్లు మొండి బకారుుగా ఉందని తెలిపారు. -
బ్యారేజీలపై తుది ఒప్పందం నేడే
సాక్షి, హైదరాబాద్ : తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మంగళవారం మహారాష్ట్ర, తెలంగాణల మధ్య తుది ఒప్పందం జరుగనుంది. గోదావరిపై నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ప్రాణహితపై నిర్మించే తమ్మిడిహెట్టి, పెన్‌గంగ దిగువన నిర్మించే ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్‌లు సంతకాలు చేయనున్నారు. మహారాష్ట్రలో ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో మంగళవారం ఈ కార్యక్రమం జరుగనుంది. కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటి పారుదల ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు హాజరుకానున్నారు. మేడిగడ్డ 100 మీటర్లే!: ఈ ఏడాది మార్చి 8న కుదిరిన ప్రాథమిక ఒప్పందం మేరకు ఏర్పాటైన అధికారుల స్థాయి స్టాండింగ్ కమిటీ.. 148 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించింది. మేడిగడ్డపై మాత్రం స్పష్టత రాలేదు. మేడిగడ్డను 100 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు అంగీకరించిన మహారాష్ట్ర.. జాయింట్ సర్వే పూర్తయ్యాక అవసరమైతే మరో మీటర్ ఎత్తుకు ఒకే చెబుతామని పేర్కొంది. అయితే 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్లతో బ్యారేజీ నిర్మాణానికి మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో అంగీకారం తెలుపుతారని... ఈ మేరకు 16 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందని సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. పెన్‌గంగపై నిర్మించే ఛనాఖా-కొరటపై ఎలాంటి అభ్యంతరాలు లేవని మహారాష్ట్ర ఇప్పటికే స్పష్టం చేసింది. మరో రెండు బ్యారేజీలు పింపార్డ్, రాజాపేటలకు సంబంధించి సాంకేతిక అంశాలను పూర్తి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించగా.. వాటిపై డీపీఆర్‌ల తయారీ ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నందున ఒప్పంద పత్రాల్లో చేర్చలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. 24న ఘన స్వాగతానికి ఏర్పాట్లు మహారాష్ట్రతో ఒప్పందం అనంతరం రాష్ట్ర బృందం 24న రాష్ట్రానికి రానుంది. ఈ సమయంలో వారికి ఘన స్వాగతం పలకాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించేలా టీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి జన సమీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. స్వాగత ఏర్పాట్లపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో ఒప్పందం అనంతరం నగరానికి వచ్చే సీఎంకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఘనంగా స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు, ప్రభుత్వం పరంగా చేయాల్సిన సమన్వయంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం అధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయాన్ని సందర్శించి పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్, వాటర్‌వర్స్క్, జీహెచ్ఎంసీ, సాంస్కృతిక, రెవెన్యూ అధికారులతో చర్చించారు. రైతులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరవుతున్నందున బందోబస్తు, పారిశుధ్యం, తాగునీరు ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆకట్టుకునేలా వివిధ కళా ప్రదర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. -
తమ్మిడిహెట్టి-సుందిళ్ల గ్రావిటీ సర్వేకు బ్రేక్
♦ హెలికాప్టర్లో సాంకేతిక లోపంతో ఆగిన పనులు ♦ పునరుద్ధరణకు మరో 3, 4 రోజులు పట్టే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్లకు తరలించేందుకు చేపట్టిన సర్వే పనులకు బ్రేక్ పడింది. సర్వే బాధ్యత తీసుకున్న వ్యాప్కోస్ సంస్థ వినియోగిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో 3 రోజులుగా సర్వే పనులు నిలిచిపోయాయి. సర్వే పనులు తిరిగి కొనసాగించేందుకు 3, 4 రోజులు పట్టే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపా యి. ప్రాణహిత మొదటి డిజైన్ ప్రకారం తమ్మిడిహెట్టి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అక్కడ్నుంచి 72 కిలోమీటర్ల మేర గ్రావిటీ, తర్వాత చిన్న లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని అధికారులు ప్రణాళిక వేశారు. సుమారు 60 క్యూసెక్కుల నీటి తరలింపునకు వీలుగా 69 మీటర్ల వెడల్పుతో కాల్వల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 44 టీఎంసీల నీటి లభ్యత ఉందని సర్వే సంస్థ అంచనా వేయడంతో తమ్మిడిహెట్టి నుంచి తీసుకునే నీటి పరిమాణాన్ని 50 క్యూసెక్కులకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహితను కలుపుకుంటే 5,200 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉండటంతో గ్రావిటీ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. తమ్మిడిహెట్టి రెగ్యులేటర్ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గిస్తే మరో 20 నుంచి 30 టీఎంసీల నీటిని తరలించవచ్చనే అంచనా నేపథ్యంలో వీలైనంత ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా 72వ కిలోమీటర్ వరకు తెచ్చి అక్కడ్నుంచి వేరే కాల్వ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో కలపాలనే ప్రతిపాదన చేశారు. ఇందుకోసం సర్వే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించారు. 72వ కిలోమీటర్ పాయింట్ నుంచి సుందిళ్లకు నీటిని కలిపే వ్యవస్థపై ఈ సంస్థ లైడార్ సర్వే మొదలుపెట్టింది. సర్వే మేరకు ఈ అలైన్మెంట్ దారిలో మైనింగ్ క్షేత్రాలు ఉన్నాయని, వాటిల్లో టన్నెల్ నిర్మాణాలను చేపట్టడం వీలుపడదని సంస్థ గుర్తించింది. దీనిపై లోతుగా పరిశీలించడంతోపాటు గ్రావిటీ ద్వారా వచ్చే నీటి అవకాశాలను మెరుగుపరిచేందుకు లైడార్ సర్వే చేస్తోంది. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలున్న నేపథ్యంలో కాల్వల వెడల్పు తగ్గించడం సబబు కాదంటూ 60 క్యూసెక్కుల నీటి తరలింపు ప్రణాళికనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తయితేనే తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత, అక్కడ్నుంచి సుందిళ్లకు నీటి తరలింపు అంశం కొలిక్కి వస్తుంది. -
రీడిజైన్ పేరుతో అప్పుల భారం పెంచొద్దు: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రీడిజైన్ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల ఖర్చును పెం చి, రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్చి, తద్వారా అంచనా వ్యయాన్ని భారీగా పెంచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దంటే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారంటూ సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. తమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల దాకా నీళ్లు తీసుకోవాలని, బాధ్యతలను వ్యాప్కోస్‌కు అప్పగించాలంటూ తీసుకున్న నిర్ణయం ద్వారా కేసీఆర్‌లో కొంత మార్పు వచ్చినట్టుగా భావిస్తున్నామన్నారు. తమ్మిడిహెట్టి ఎత్తును కూడా తగ్గించొద్దని కోరారు. మల్లన్నసాగర్లో భూనిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా, బలవంతంగా భూములను సేకరించడం సరికాదన్నారు. వాస్తు నమ్మకాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని కోరారు. -
మహారాష్ట్రకు మేలు చేస్తున్న కేసీఆర్: జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తమ్మిడిహెట్టి వద్ద కాకుండా, మేడిగడ్డ వద్ద నిర్మించి మహారాష్ట్రకు మేలు, తెలంగాణకు అన్యా యం చేస్తున్నారని ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే తమ్మిడిహెట్టి వద్ద కాకుండా ప్రాజెక్టులను కిందికి మార్చారన్నారు. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే అయిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా కాళేశ్వరం వద్ద శంకుస్థాపన చేశారన్నారు. కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టారన్నా రు. ముంపు బాధితులకు పరిహారం, పునరావాసం తేల్చకుండానే పనులు చేయడం వల్ల రైతులు నష్టపోతారన్నారు. తెలంగాణ ప్రయోజనాల కన్నా మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ్మిడిహెట్టి-మేడిగడ్డ మధ్య నీటిని మహారాష్ట్ర అక్రమంగా వాడుకోవడానికి అవకాశం కల్పించారని ఆరోపించారు. -
తమ్మిడిహెట్టి వద్దే గరిష్ట నీటి వినియోగం!
ప్రభుత్వానికి రిటైర్డ్ ఈఎన్సీ హనుమంతరావు సూచన సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి వద్దే గరిష్ట నీటిని వినియోగించుకునేందుకు ప్రయత్నించాలని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచించారు. ఎత్తు తగ్గింపుతో కొరతగా ఉండే నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలని, దాంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యయభారం గణనీ యంగా తగ్గుతుం దని స్పష్టం చేశారు. తమ్మిడిహెట్టి ఎత్తుతో సంబంధం లేకుండా అక్కడ గరిష్టంగా 100 టీఎంసీల లభ్యత ఉంటుందని.. అయితే లభ్యతపై వాస్తవాలు తెలియాలంటే రూర్కీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు, మేడిగడ్డ నుంచి నీటి తరలింపు చర్చనీయాంశమైన నేపథ్యంలో దీనిపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తమ్మిడిహెట్టి బ్యారేజీ, రిజర్వాయర్ నిర్మాణం, నీటి లభ్యత ఎలా ఉండాలన్న దానిపై పలు వివరణలు, సూచనలు ఇచ్చారు. హనుమంతరావు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఎత్తు ఏదైనా నీటికి కొదవ లేదు ‘‘తమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లా.. 152 మీటర్లా అన్న చర్చ జరుగుతోంది. సాంకేతికంగా అక్కడ ఏ ఎత్తు ఉన్నా సమస్య లేదు. ఎత్తులో తేడా వల్ల నీటి కొరత ఉండేది కేవలం 3 టీఎంసీలే. ఆ నీటిని ప్రస్తుతం 180 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న రిజర్వాయర్లలో ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చు. అదీగాక తమ్మిడిహెట్టి వద్ద 26,500 క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఇక్కడ కనిష్టంగా 20 వేల క్యూసెక్కులు లభించినా నీటికి కొదవలేదు. మహారాష్ట్రతో గొడవ పడటం కన్నా 148 మీటర్లకు అంగీకరించడం మంచిదే.. గరిష్ట నీటి వినియోగం అక్కడే.. వ్యాప్కోస్ సర్వేలో ఒకసారి తమ్మిడిహెట్టి వద్ద 70 నుంచి 100 టీఎంసీల లభ్యత ఉంటుందని, మరోసారి 110 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని చెప్పారు. నా ఉద్దేశం మేరకు అక్కడ 100 టీఎంసీల లభ్యత ఉంటుంది. అలాకాకుంటే అక్కడ ఎంత లభ్యతగా ఉంటే అంత నీటిని తీసుకుని, తక్కువ పడిన నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలి. మేడిగడ్డ కన్నా తమ్మిడిహెట్టి 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్పుడు పంపింగ్ సులభమవుతుంది. సాంకేతికం గా, ఆర్థికంగా ఇది మంచిది. విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. అయితే తమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత శాస్త్రీయంగా తెలియాలంటే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నిపుణులతో అధ్యయనం చేయించాలి. తమ్మిడిహెట్టి-ఎల్లంపల్లి మధ్య రిజర్వాయర్లు నిర్మించాలి 71 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను మెదక్ జిల్లాలో చేపడుతున్నారు. ఇక్కడ తాగు, సాగు అవసరాల కోసం ఏడాది పొడవునా నీరుంచాలంటే.. ఆ నీటిలో 20 శాతం ఆవిరి నష్టాలు, సీపేజ్ నష్టాలు ఉంటా యి. అంతేగాకుండా ఈ రిజర్వాయర్లను నింపేందుకు 148 మీటర్ల ఎత్తున ఉన్న ఎల్లంపల్లి నుంచి 600 మీటర్ల ఎత్తున్న మల్లన్నసాగర్‌కు పంపింగ్ చేయాలి. దీనికి విద్యుత్ అవసరం చాలా ఎక్కువ. అయితే ఇదే తరహాలో రెండు బ్యారేజీలను అదే సామర్థ్యంతో తమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి మధ్య ఏర్పాటు చేస్తే గ్రావిటీ ద్వారా నీరొస్తుంది. పంపింగ్‌కు విద్యుత్ అవసరం ఉండదు, వ్యయం చాలా తగ్గుతుంది. అయితే రిజర్వాయర్ల ఏర్పా టు నైసర్గికంగా సాధ్యపడే అంశాలపై లైడార్ సర్వే చేయాలి. దీంతోపాటే ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీటిని గోదావరి మార్గం ద్వారా తీసుకెళ్లేందుకు 14 బ్యారేజీలు నిర్మించాలి. దీని ద్వారా వరదలు వచ్చినప్పుడు విద్యుదుత్పాదనకు అవకాశం ఉంటుంది. నిజాంసాగర్, సింగూరు మధ్య వరుస బ్యారేజీలు నిర్మించాలి. ఇలా చేస్తే గరిష్ట నీటి వినియోగం, ఆర్థిక వ్యయం, విద్యుత్ అవసరాలు తగ్గుతాయి.’’ -
నీటి లభ్యత ఉన్నందునే మేడిగడ్డకు మార్పు
- తమ్మిడిహెట్టి కన్నా మేడిగడ్డ వద్దే 500 టీఎంసీల నీటి లభ్యత ఎక్కువ - అందుకే మేడిగడ్డ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టితో పోలిస్తే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందునే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తమ ప్రాంతంలో ముంపును అంగీకరించలేమని మహారాష్ట్ర తేల్చిచెప్పడం కూడా డిజైన్ మార్పుకు కారణమైందన్నారు. గురువారం ప్రాణహిత డిజైన్ మార్పుపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మేడిగడ్డ, తమ్మిడిహెట్టి వద్ద 47 ఏళ్ల నీటి లెక్కలను సీఎం కేసీఆర్ వివరించారు. తమ్మిడిహెట్టి వద్ద 1,144.8 టీఎంసీల సరాసరి లభ్యత ఉండగా, కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉంటుందని తెలిపారు. సరాసరిన 500 టీఎంసీలు ఎక్కువగా ఉంటుందన్నారు. గోదావరిలో ఇంద్రావతి కలిసే పేరూర్ వద్ద సరాసరిన 2,430 టీఎంసీల లభ్యత ఉంటుందన్నారు. ‘తమ్మిడిహెట్టి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు అయితే, మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో 16 టీఎంసీలు ఉంటుంది. 101 మీటర్లకు ఒప్పుకుంటే మరో 3 టీఎంసీల అదనపు నిల్వకు అవకాశం ఉంటుంది. ఇక్కడ రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశముంది. ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం కడుతున్నాం. మేడిగడ్డ వద్ద భవిష్యత్తులో ఎప్పుడైనా కొరత ఏర్పడినా ఇంద్రావతి నీటిని తీసుకునే అవకాశం ఉంది. భవిష్యత్ తరాలకు ఇంద్రావతి, ప్రాణహిత నీళ్లే మిన్న’ అని అన్నారు. ఇకపై ప్రాణహిత-చేవెళ్ల ఉండదని, దాన్ని కాళేశ్వరంగానే భావించాలని చెప్పారు. తానే వ్యతిరేకించానని మహారాష్ట్ర సీఎం చెప్పారు..: ప్రాజెక్టు ముంపు విషయమై మహారాష్ట్రకు వెళ్లి చర్చలు జరిపానని, అయితే తమ ప్రాంతంలో ముంపునకు ఒప్పుకోబోమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో, కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా అగ్రిమెంట్లు జరగలేదు. బీజేఎల్పీ నేతగా తమ్మిడిహెట్టితో జరిగే ముంపును వ్యతిరేకిస్తూ ధర్నా చేశానని, పోలీసులు అరెస్ట్ సైతం చేశారని ఉన్న వార్త, ఫొటోలను చూపారు. బీజేపీలో ఉండగా వ్యతిరేకించినవాణ్ని, సీఎంగా ఎలా అంగీకరిస్తాం అని అన్నారు’ అని సీఎం కేసీఆర్ వివరించారు. అంతకుముందే నిర్మాణం ఏకపక్షంగా, మీకు మీరే ఊహించుకుని నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఈ పనులు ఫలప్రదం కావని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్రానికి లేఖ రాశారని, సీడబ్ల్యూసీలో అనేక అభ్యంతరాలు చెప్పారని తెలిపారు. గోదావరిలో 160 టీఎంసీలకు మించి మరో 20 టీఎంసీలు తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని, తమ్మిడిహెట్టి వద్ద మాత్రం 148 మీటర్ల నిర్మాణం ఉండాలని చెప్పడంతో మేడిగడ్డ ప్రతిపాదన తెచ్చామని తెలిపారు. సామర్థ్యం పెంచితే ధర పెరగదా..?: ప్రాజెక్టు వ్యయ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ‘ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.83 వేల కోట్లకు పెంచారని అంటున్నారు. ప్రాజెక్టులో 16.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను 200 టీఎంసీల కెపాసిటీకి పెంచాం. సామర్థ్యం పెంచితే ఖర్చు పెరగదా’ అని ప్రశ్నించారు. మేడిగడ్డ-ఎస్సారెస్పీల మధ్య లైవ్ స్టోరేజీ పెంచితే ఇక్కడ చేపల పెంపకం, 200 కి.మీ నౌకాయానానికి అనువుగా ఉంటుందన్నారు. -
తమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లే!
- తెలంగాణ-మహారాష్ట్ర అధికారుల స్థాయి చర్చల్లో నిర్ణయం - మేడిగడ్డ వద్ద 100 మీటర్ల కనీస మట్టానికి సమ్మతి - ముంపు సర్వే తేల్చాక ఒకటి రెండు మీటర్లు పెంచే అంశంపై చర్చ - గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇరు రాష్ట్రాలకు నీటి వాటా - అంతకుముందే పర్యావరణ, అటవీ, మైనింగ్ అంశాలపై సంయుక్త సర్వే - నెలాఖరులో లేదా ఏప్రిల్ తొలివారంలో ముఖ్యమంత్రుల సమావేశం సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు చివరికి 148 మీటర్లకే పరిమితం కానుంది. ఈ మేరకు తెలంగాణ-మహారాష్ట్ర మధ్య జరిగిన అధికారుల స్థాయి చర్చల్లో అవగాహన కుదిరింది. తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం రాష్ట్రానికి నష్టదాయకమని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్న తరుణంలోనే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీని 100 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర ఓకే చెప్పింది. అయితే తమ రాష్ట్రంలో జరిగే ముంపుపై సర్వే ఫలితాలను బట్టి మరో ఒకటి రెండు మీటర్లు ఎత్తు పెంచే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. మొత్తంగా గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై మూడు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర తన సమ్మతిని తెలిపింది. ఇక గోదావరి జలాలపై ఇదివరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఇరు రాష్ట్రాలు తమ వాటాలను వినియోగించుకోవాలని... మూడు బ్యారేజీలకు సంబంధించిన పర్యావరణ, మైనింగ్, అటవీ అనుమతులపై పది రోజుల్లో సంయుక్త పరిశీలన చేసి నివేదిక తయారు చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఆ నివేదిక ఆధారంగా ‘నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు)’ జారీ చేయాలని అభిప్రాయపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో శనివారం హైదరాబాద్‌లో సమన్వయ కమిటీ, స్టాండింగ్ కమిటీలు సమావేశమయ్యాయి. విడివిడిగా జరిగిన ఈ భేటీల్లో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు ఎస్కే జోషి, గవాయి, రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్, మహారాష్ట్ర అధికారులు ఆర్బీ శుక్లా, చౌహాన్, రాష్ట్ర సీఈలు వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, అజయ్‌కుమార్, నరేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలతో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మేడిగడ్డ 100 మీటర్లకు ఓకే.. గోదావరిలో కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషీ మొదట వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అధ్యయనం చేసి గోదావరిపై మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని ప్రతిపాదించిందని తెలిపారు. ఈ ఎత్తులో ముంపు మొత్తం నదీ గర్భంలో ఉంటుందని పేర్కొన్నదని చెప్పారు. ఒకవేళ ఈ ఎత్తులో ముంపు ఉన్నపక్షంలో మేడిగడ్డ బ్యారేజీని 102 మీటర్ల ఎత్తుతో నిర్మించి 100 మీటర్ల వరకే నీటిని నిల్వ చేసే ఉద్దేశంతో ఉన్నామని వివరించారు. ఈ సందర్భంగా 103, 102, 101, 100 మీటర్ల ఎత్తుల్లో ఉండే ముంపు వివరాలను వెల్లడించారు. ఈ వివరాలన్నీ విన్న మహారాష్ట్ర అధికారులు 100 మీటర్ల కనీస ఎత్తుకు సమ్మతి తెలిపారు. 101, 102, 103 మీటర్ల ఎత్తుల్లో ఉండే ముంపుపై తమ అధికారుల సర్వే పూర్తయ్యాక ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. అయితే ఇక్కడ మహారాష్ట్రకు ఏ మేరకు నీటి వాటా ఇవ్వాలన్న దానిపై తర్వాతి సమావేశంలో నిర్ణయించాలనే అభిప్రాయానికి వచ్చారు. మేడిగడ్డ ద్వారా మహారాష్ట్రకు సుమారు 4.5 టీఎంసీలను కేటాయించి, 45 వేల ఎకరాలకు నీరందించాలనే ప్రతిపాదన ఉంది. 148 మీటర్లతో తమ్మిడిహెట్టి తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందకు మహారాష్ట్ర అంగీకరించింది. ఇక్కడ పర్యావరణ, అటవీ అనుమతులు, కేంద్ర జల సంఘం అనుమతులు తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఛనాఖా-కొరటకు సంబంధించి సాంకేతిక అంశాలపై చర్చించారు. ఇక్కడ బ్యారేజీ నిర్మాణంతో కొంత అటవీ, మైనింగ్‌కు సమస్యలు ఉండవచ్చని మహారాష్ట్ర ప్రస్తావించగా... అలాంటిదేమీ లేదని తెలంగాణ తెలిపింది. దీంతో ఈ అంశాలపై సంయుక్త సర్వే నిర్వహిద్దామని, పదిరోజుల్లో దీనిపై తేల్చి ముందుకు వెళదామని అభిప్రాయం వ్యక్తమైంది. ఈనెల చివరి వారంలో సీఎంల సమావేశం? అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో బ్యారేజీల ఎత్తుపై అవగాహన కుదిరిన నేపథ్యంలో... ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ తొలి వారంలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇరు రాష్ట్రాల సీఎం ఇచ్చే సమయం ఆధారంగా బోర్డు సమావేశం తేదీలను నిర్ణయించనున్నారు.