‘ప్రాణహిత’కే జాతీయ హోదా సులభం | T.jeevan reddy advice to trs party on pranahitha project | Sakshi
Sakshi News home page

‘ప్రాణహిత’కే జాతీయ హోదా సులభం

Published Wed, Mar 22 2017 2:29 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

‘ప్రాణహిత’కే జాతీయ హోదా సులభం

‘ప్రాణహిత’కే జాతీయ హోదా సులభం

ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నేత టి.జీవన్‌రెడ్డి సూచన
అక్కడ 120 టీఎంసీలు తీసుకున్నాకే కాళేశ్వరం వద్దకు వెళ్లాలి
కాళేశ్వరాన్ని స్టేజ్‌–2 కింద పరిగణించాలి
లేదంటే ప్రభుత్వంపై అనవసర నిర్మాణ, నిర్వహణ భారం
ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రాజెక్టులు పూర్తి చేయాలని హితవు


సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రాణహిత–చేవెళ్ల’ ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి దగ్గరే గరి ష్టంగా నీటిని వినియోగించుకునేందుకు ప్రయ త్నించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. అక్కడ కొరతగా ఉండే నీటిని కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ నుంచి తీసుకోవాలని.. అలాచేస్తే ప్రాజెక్టు వ్యయభారం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు. తమ్మిడిహెట్టి వద్ద 120 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశముందని, ఆ ప్రాజెక్టుకు 13 రకాల కేంద్ర డైరెక్టరేట్ల అనుమతులున్న దృష్ట్యా దాన్నే స్టేజ్‌–1గా తీసుకుని.. కాళేశ్వరాన్ని స్టేజ్‌–2గా చేర్చాలని చెప్పారు. ఇలాగైతేనే ప్రాజెక్టుకు జాతీయ హోదా సులభంగా వస్తుందని తేల్చి చెప్పారు. అదే కాళేశ్వరం ప్రధాన ప్రాజెక్టుగా చేపడితే అనుమతుల కోసం మళ్లీ తొలినుంచీ ప్రయత్నం చేయాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. మంగళవారం శాసనసభలో సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు.

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ‘‘ఈ ప్రాజెక్టు రీడిజైన్‌ పూర్తిగా లోపభూయిష్టం. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో కేవలం 3 వేల ఎకరాలే ముంపు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.  మహారాష్ట్రకు రాష్ట్ర ప్రతినిధుల బృం దాన్ని తీసుకెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా తమ్మిడిహెట్టి వద్ద లభ్యత నీటినంతా వాడుకుని, మిగతా నీటికోసం కాళేశ్వరం వెళ్లడం మంచిది..’’అని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక 450 మీటర్ల ఎత్తున ఉన్న అప్పర్‌ మానేరు నుంచి 428 మీటర్ల ఎత్తులో ఉన్న నిజాంసాగర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించకుండా.. 557 మీటర్ల ఎత్తున ఉన్న మల్లన్నసాగర్‌ నుంచి నిజాంసాగర్‌కు నీటిని ఎత్తిపోయడం ఏమిటని నిలదీశారు.

న్యాయం చేయాలంటే నిందలు వేస్తారా?
భూసేకరణ విషయంలో నిర్వాసితులకు, రైతులకు న్యాయం చేయాలని.. భూసేకరణ చట్టం మేరకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయని ప్రభుత్వం విమర్శిం చడం సరికాదన్నారు. గత రెండున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయని సర్కారు.. ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించిందని విమర్శించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో ఈ ఏడాది 100 టీఎంసీలు వృథా అయ్యాయని.. ఇప్పటికైనా విమర్శలు మాని ప్రాజెక్టుల పూర్తికి శ్రద్ధ చూపాలని సూచించారు.

తాగునీటి సమస్య తీర్చండి: ఎంఐఎం
హైదరాబాద్‌లోని పాతబస్తీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిని వెంటనే పరిష్కరించాలని ఎంఐఎం సభ్యుడు జాఫర్‌ హుస్సేన్‌ ప్రభుత్వాన్ని కోరారు. 20 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటిం చిందని, వెంటనే ఆ పని చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో చెత్త నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉందని, రోడ్లన్నీ అధ్వాన స్థితికి చేరుకున్నాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు.

‘పాలమూరు’ అక్రమాలను నిరూపిస్తాం
‘పాలమూరు–రంగారెడ్డి’ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయని, సభా సంఘం ఏర్పాటు చేస్తే అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. ప్రభుత్వం ముందుకు వస్తే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్ద అయినా చర్చకు సిద్ధమని చెప్పారు. రెండు కాంట్రాక్టు సంస్థల కోసం టెండర్‌ నిబంధనలను పూర్తిగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల్లో ఒక్క చుక్క నీటినైనా అదనంగా దక్కించుకోలేకపోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా కొందరు అధికార పక్ష సభ్యులు అడ్డుపడటంతో.. ‘సభ ఉన్నది డబ్బా కొట్టుకోవడానికి కాద’ంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

బాహుబలిని తలదన్నే ‘యోగి’వస్తాడు!
రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్రం సహకరిస్తోందని, సహకరించకపోతే తామూ ఓట్లడగబోమని ప్రభాకర్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. ఇక్కడా ఒక ‘యోగి’వస్తాడని, ఇక్కడి రూపురేఖలు మారుస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో ‘బాహుబలి వద్దా?’అని కొందరు సభ్యులు వ్యాఖ్యానించడంతో..‘బాహుబలిని సైతం తలదన్నేవాడే యోగి’అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అప్రకటిత విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి.. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేవని, డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement