'సిరిసిల్ల ఎస్పీ హిట్లర్.. వదిలిపెట్టం'
కొత్తపల్లి(కరీంనగర్): ఇసుకను అక్రమంగా దోస్తున్నది సీఎం కేసీఆర్ బంధువర్గమేనని సీఎల్‌పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో అరెస్టు అయి కొత్తపల్లి ఠాణాలో ఉన్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, అంబేద్కర్ సంఘాల నాయకులు బాపన్న, మేడి మహేశ్, కన్నం అంజయ్య, దామెర సత్యం తదితరులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఇసుకపై వస్తున్న ఆదాయాన్ని చెప్పిన కేటీఆర్.. ఇసుక దోపిడీ వెనక ఉన్నదెవరో చెప్పేందుకు భయమెందుకని ప్రశ్నించారు. ఇసుక క్వారీలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉన్నట్లు ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అక్రమ ఇసుకను కొల్లగొడుతున్న సీఎం బంధువర్గానికి అండగా నిలిచేందుకు సిరిసిల్ల ఎస్పీ హిట్లర్‌లా వ్యవహరించిన తీరును వదిలిపెట్టేది లేదన్నారు. దళితులని చూడకుండా పరుష పదజాలంతో దూషించడమే కాకుండా మాజీ సర్పంచ్ భానయ్య ఛాతీపై తన్నిన ఎస్పీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులను వెనకేసుకొస్తున్న మంత్రి కేటీఆర్‌పైనా అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ.. పౌర హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో మాజీ స్పీకర్ మీరాకుమారి నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు వివరించారు.