తమ్మిడిహెట్టి పట్టదా?  | Uttam Kumar Reddy And TPCC Members Visit Tummidihatti | Sakshi
Sakshi News home page

తమ్మిడిహెట్టి పట్టదా? 

Published Tue, Aug 27 2019 2:34 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy And TPCC Members Visit Tummidihatti - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. తమ్మిడిహెట్టి వద్ద రూ.100 కోట్లు వ్యయం చేసి బ్యారేజీ ఎందుకు నిర్మించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. వాప్కోస్‌ సంస్థ 70 ఏళ్ల నీటి లభ్యతను లెక్కగట్టి తమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని చెప్పినప్పటికీ.. రీడిజైన్‌ పేరుతో ప్రాణహితను పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు.

కాళేశ్వరం టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని, నామినేషన్ల ప్రాతిపదికన వేల కోట్ల పనులు చేపట్టారని ఆరోపించారు. సోమవారం ఉత్తమ్‌ నేతృత్వంలోని టీపీసీసీ బృందం కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత నదిని సందర్శించింది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్‌ చేరుకుని అక్కడ నుంచి రోడ్డుమార్గాన తమ్మిడిహెట్టికి వెళ్లింది. నదికి మంగళహారతి, పాలాభిషేకం, పూజ చేసిన తర్వాత నేతలంతా నాటుపడవలో వెళ్లి నదిని పరిశీలించారు. 

అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టారని, 16లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు 152 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారని వివరించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తులో కాళేశ్వరంలో నిర్మిస్తామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వంతో 100 మీటర్లకే ఒప్పందం చేసుకుని సంబరాలు చేసుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని దేశంలో పెద్దపెద్ద సాగునీటి ప్రాజెక్టులు కట్టింది తమ పార్టీయేనని పేర్కొన్నారు.

అయితే, కాళేశ్వరంతో పాటు ప్రాణహితపై కూడా బ్యారేజీ నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ తదితర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సాగు, తాగు నీరందించవచ్చని వివరించారు. కేవలం 15 మీటర్ల ఎత్తులో ఒక లిఫ్ట్‌ ఏర్పాటు చేసి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తరలింవచ్చని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి చుక్కకు అధిక వ్యయం చేస్తున్నారని దుయ్యబట్టారు. భారీ వ్యయంతో కాళేశ్వరాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం.. తక్కువ ఖర్చుతో ఒకేసారి మూలధనంతో నిర్మించే ప్రాణహితను మాత్రం విస్మరిస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని ఉత్తమ్‌ వెల్లడించారు. 

‘ఎల్లంపల్లి’పై తాత్సారం ఎందుకు? 
రామగుండం: ఎల్లంపల్లి ప్రారంభోత్సవంపై సీఎం కేసీఆర్‌ ఎందుకు తాత్సారం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి సందర్శనకు హైదరాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌కు రైలులో వెళ్తున్న ఉత్తమ్‌ బృందానికి రామగుండం రైల్వేస్టేషన్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్‌ లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

వైఎస్‌ హయాంలోనే జలయజ్ఞంలో భాగంగానే ఎల్లంపల్లి (శ్రీపాద) ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. ఆ తర్వాత తమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాజెక్టుగా నామకరణం చేసి పనులు ప్రారంభించేందుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఆరేళ్లు గడిచినా ప్రారంభించకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ఎల్లంపల్లి విషయంలో వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు.  

ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా?: భట్టి 
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. 20 శాతం పనులు మాత్రమే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసినట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పి, ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి పేరుతో సీఎం కేసీఆర్‌ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసమే వచ్చిందని, ఇందుకోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఆడుతున్న నాటకాలకు తెలంగాణ ప్రజలు బలవుతున్నారని ఆరోపించారు.

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాశేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రాణహిత బదులు వార్దా నదిపై బ్యారేజీ కడతామని చెబుతున్నారని విమర్శించారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఉండదని సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. ప్రాజెక్టుల విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండింటి తీరు ఒకేలా ఉందని దుయ్యబట్టారు. ఈ పర్యటనలో టీపీసీసీ ఉపా«ధ్యక్షుడు మల్లు రవి, పార్టీ సీనియర్‌ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, రమశే రాథోడ్, చిన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement