నీటిపారుదల శాఖకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నుంచి త్వరగా తుది నివేదిక తెప్పించుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో బరాజ్‌లకు నిర్వహించాల్సిన పరీక్షలు పూర్తి చేసి, వాటికి సంబంధించిన నివేదికలను నిపుణుల కమిటీకి అందజేయాలన్నారు. నీటిపారుదల శాఖపై బుధవారం ఆయన జలసౌధలో సమీక్షించారు.
సమ్మక్క బరాజ్ నిర్మాణంతో ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడనున్న ముంపు విషయంలో ఆ రాష్ట్రం నుంచి ఎన్‌ఓసీని సత్వరంగా రాబట్టుకోవాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి పరిహారం చెల్లింపు విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చ లు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. సమ్మ క్క బరాజ్ డీపీఆర్‌కు అనుమతుల విషయంలో Üడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
భూసేకరణను 2025 మార్చిలోగా పూర్తిచేయాలని చెప్పారు. ఆనకట్టు, కాల్వల భద్రతను పర్యవేక్షించేందుకు 1,800 మంది లష్కర్‌ల నియామకాలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. దీనిపై నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పందిస్తూ ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. దీంతో మంత్రి ఉత్తమ్ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావుతో అక్కడి నుంచి ఫోన్‌లో మాట్లాడి అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు పంపించిన విజ్ఞాపనలను సత్వరంగా పరిష్కరించి, జవాబు పంపించాలన్నారు.
ఆనకట్టు, కాల్వల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ(జనరల్) అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment