మతిభ్రమించే మేడిగడ్డ కుంగుబాటు కుట్ర అంటూ వ్యాఖ్యలు: మంత్రి ఉత్తమ్ ఫైర్
ఆరోపణలు, అబద్ధాలు కాదు.. ఆధారాలుంటే పీసీ ఘోష్ కమిషన్‌కు ఇవ్వండి
కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా నిర్మించడం వల్లే కుంగిపోయాయి
ఉత్తర తెలంగాణ రైతులకు సాగునీటి సమస్య వస్తే దానికి కేసీఆర్, కేటీఆర్‌లే కారణం
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు దారుణమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఓటమిని తట్టుకోలేక కేటీఆర్‌కు మతిభ్రమించి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాల్లో గోబెల్స్‌ను కేటీఆర్ మించిపోయారని.. ఆయన పేరును జోసెఫ్ గోబెల్స్‌రావుగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఆరోపణలు, అబద్ధాలు కాదు.. ఆధారాలుంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అందించాలని సవాల్ చేశారు. ఆదివారం జలసౌధ నుంచి
నీటి పారుదల శాఖ క్షేత్రస్థాయి ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉత్తమ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘మేడిగడ్డ కుంగుబాటు ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని, రాష్ట్రంలో ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు.. బరాజ్‌ను వారు ఏమైనా చేయగలరని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా నిర్మించడంతోనే బరాజ్ కుంగిపోయింది. గత ఏడాది అక్టోబర్ 21న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బరాజ్ కుంగిపోగా.. తర్వాత 45 రోజులు వారే అధికారం ఉన్నారు. ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణ లోపాలతోనే కాళేశ్వరం బరాజ్‌లు ఫెయిల్ అయ్యాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) బీఆర్‌ఎస్ హయాంలోనే నివేదిక ఇచి్చంది.
2019లోనే లోపాలు బయటపడినా..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను 2019లో ప్రారంభించిన నాటి నుంచే లోపాలు, సమస్యలు బయటపడ్డాయి. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులపై 2019 నుంచీ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీతో నీటిపారుదల శాఖ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిందని విజిలెన్స్ విచారణలో తేలింది కూడా. లోపాలను పట్టించుకోకపోవడం వల్లే క్రమంగా నష్టం పెరిగింది. అసలు మేడిగడ్డ వద్ద బరాజ్ వద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి సమస్య తలెత్తితే దానికి కేసీఆర్, కేటీఆర్‌లే కారణం.
ఐదేళ్లలో 30లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.10,820 కోట్లు కేటాయించాం. ఆయా ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని క్షేత్రస్థాయి ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశాం. ఈ ఏడాది నుంచే ఏటా 6లక్షల ఎకరాల చొప్పున.. వచ్చే ఐదేళ్లలో 30లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి 15 రోజులకోసారి పురోగతిపై సమీక్ష నిర్వహిస్తా.
బీఆర్‌ఎస్ వాళ్లు చెప్తే కాదు.. రైతుల కోసం..
గత ఐదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసింది. అంటే సగటున ఏటా 13 టీఎంసీలే తరలించింది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో.. రైతుల కోసం మేం పంపింగ్ ప్రారంభించాం. బీఆర్‌ఎస్ వాళ్లు చెబితేనే చేశామనడం సరికాదు. ఒకవేళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లు నిల్వ చేస్తే.. అవి తెగిపోయి దిగువన భదాచలం పట్టణం, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బరాజ్‌లు, 44 గ్రామాలు నీటిమునిగి భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. వాటి నుంచి నీటిని పంపింగ్ చేసే పరిస్థితి లేకున్నా.. ఎల్లంపల్లి నుంచి లిఫ్టింగ్ చేపట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగతా జలాశయాలను నింపి రైతులకు నీళ్లను అందిస్తాం’’అని ఉత్తమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment