మహారాష్ట్రకు మేలు చేస్తున్న కేసీఆర్: జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తమ్మిడిహెట్టి వద్ద కాకుండా, మేడిగడ్డ వద్ద నిర్మించి మహారాష్ట్రకు మేలు, తెలంగాణకు అన్యా యం చేస్తున్నారని ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే తమ్మిడిహెట్టి వద్ద కాకుండా ప్రాజెక్టులను కిందికి మార్చారన్నారు. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే అయిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా కాళేశ్వరం వద్ద శంకుస్థాపన చేశారన్నారు.
కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టారన్నా రు. ముంపు బాధితులకు పరిహారం, పునరావాసం తేల్చకుండానే పనులు చేయడం వల్ల రైతులు నష్టపోతారన్నారు. తెలంగాణ ప్రయోజనాల కన్నా మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ్మిడిహెట్టి-మేడిగడ్డ మధ్య నీటిని మహారాష్ట్ర అక్రమంగా వాడుకోవడానికి అవకాశం కల్పించారని ఆరోపించారు.