బ్యారేజీలపై తుది ఒప్పందం నేడే
సాక్షి, హైదరాబాద్ : తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మంగళవారం మహారాష్ట్ర, తెలంగాణల మధ్య తుది ఒప్పందం జరుగనుంది. గోదావరిపై నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ప్రాణహితపై నిర్మించే తమ్మిడిహెట్టి, పెన్‌గంగ దిగువన నిర్మించే ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్‌లు సంతకాలు చేయనున్నారు. మహారాష్ట్రలో ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో మంగళవారం ఈ కార్యక్రమం జరుగనుంది. కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటి పారుదల ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు హాజరుకానున్నారు.
మేడిగడ్డ 100 మీటర్లే!: ఈ ఏడాది మార్చి 8న కుదిరిన ప్రాథమిక ఒప్పందం మేరకు ఏర్పాటైన అధికారుల స్థాయి స్టాండింగ్ కమిటీ.. 148 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించింది. మేడిగడ్డపై మాత్రం స్పష్టత రాలేదు. మేడిగడ్డను 100 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు అంగీకరించిన మహారాష్ట్ర.. జాయింట్ సర్వే పూర్తయ్యాక అవసరమైతే మరో మీటర్ ఎత్తుకు ఒకే చెబుతామని పేర్కొంది. అయితే 100 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌లతో బ్యారేజీ నిర్మాణానికి మంగళవారం జరిగే బోర్డు సమావేశంలో అంగీకారం తెలుపుతారని... ఈ మేరకు 16 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందని సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. పెన్‌గంగపై నిర్మించే ఛనాఖా-కొరటపై ఎలాంటి అభ్యంతరాలు లేవని మహారాష్ట్ర ఇప్పటికే స్పష్టం చేసింది. మరో రెండు బ్యారేజీలు పింపార్డ్, రాజాపేటలకు సంబంధించి సాంకేతిక అంశాలను పూర్తి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించగా.. వాటిపై డీపీఆర్‌ల తయారీ ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నందున ఒప్పంద పత్రాల్లో చేర్చలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
24న ఘన స్వాగతానికి ఏర్పాట్లు
మహారాష్ట్రతో ఒప్పందం అనంతరం రాష్ట్ర బృందం 24న రాష్ట్రానికి రానుంది. ఈ సమయంలో వారికి ఘన స్వాగతం పలకాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించేలా టీఆర్‌ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి జన సమీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది.
స్వాగత ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రతో ఒప్పందం అనంతరం నగరానికి వచ్చే సీఎంకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఘనంగా స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు, ప్రభుత్వం పరంగా చేయాల్సిన సమన్వయంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం అధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయాన్ని సందర్శించి పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్, వాటర్‌వర్స్క్, జీహెచ్‌ఎంసీ, సాంస్కృతిక, రెవెన్యూ అధికారులతో చర్చించారు. రైతులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరవుతున్నందున బందోబస్తు, పారిశుధ్యం, తాగునీరు ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆకట్టుకునేలా వివిధ కళా ప్రదర్శన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.