తమ్మిడిహెట్టి వద్దే గరిష్ట నీటి వినియోగం!
ప్రభుత్వానికి రిటైర్డ్ ఈఎన్‌సీ హనుమంతరావు సూచన
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి వద్దే గరిష్ట నీటిని వినియోగించుకునేందుకు ప్రయత్నించాలని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచించారు. ఎత్తు తగ్గింపుతో కొరతగా ఉండే నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలని, దాంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యయభారం గణనీ యంగా తగ్గుతుం దని స్పష్టం చేశారు. తమ్మిడిహెట్టి ఎత్తుతో సంబంధం లేకుండా అక్కడ గరిష్టంగా 100 టీఎంసీల లభ్యత ఉంటుందని.. అయితే లభ్యతపై వాస్తవాలు తెలియాలంటే రూర్కీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు, మేడిగడ్డ నుంచి నీటి తరలింపు చర్చనీయాంశమైన నేపథ్యంలో దీనిపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తమ్మిడిహెట్టి బ్యారేజీ, రిజర్వాయర్ నిర్మాణం, నీటి లభ్యత ఎలా ఉండాలన్న దానిపై పలు వివరణలు, సూచనలు ఇచ్చారు. హనుమంతరావు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..
ఎత్తు ఏదైనా నీటికి కొదవ లేదు
‘‘తమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లా.. 152 మీటర్లా అన్న చర్చ జరుగుతోంది. సాంకేతికంగా అక్కడ ఏ ఎత్తు ఉన్నా సమస్య లేదు. ఎత్తులో తేడా వల్ల నీటి కొరత ఉండేది కేవలం 3 టీఎంసీలే. ఆ నీటిని ప్రస్తుతం 180 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న రిజర్వాయర్లలో ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చు. అదీగాక తమ్మిడిహెట్టి వద్ద 26,500 క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఇక్కడ కనిష్టంగా 20 వేల క్యూసెక్కులు లభించినా నీటికి కొదవలేదు. మహారాష్ట్రతో గొడవ పడటం కన్నా 148 మీటర్లకు అంగీకరించడం మంచిదే..
గరిష్ట నీటి వినియోగం అక్కడే..
వ్యాప్కోస్ సర్వేలో ఒకసారి తమ్మిడిహెట్టి వద్ద 70 నుంచి 100 టీఎంసీల లభ్యత ఉంటుందని, మరోసారి 110 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని చెప్పారు. నా ఉద్దేశం మేరకు అక్కడ 100 టీఎంసీల లభ్యత ఉంటుంది. అలాకాకుంటే అక్కడ ఎంత లభ్యతగా ఉంటే అంత నీటిని తీసుకుని, తక్కువ పడిన నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలి. మేడిగడ్డ కన్నా తమ్మిడిహెట్టి 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్పుడు పంపింగ్ సులభమవుతుంది. సాంకేతికం గా, ఆర్థికంగా ఇది మంచిది. విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. అయితే తమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత శాస్త్రీయంగా తెలియాలంటే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నిపుణులతో అధ్యయనం చేయించాలి.
తమ్మిడిహెట్టి-ఎల్లంపల్లి మధ్య రిజర్వాయర్లు నిర్మించాలి
71 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను మెదక్ జిల్లాలో చేపడుతున్నారు. ఇక్కడ తాగు, సాగు అవసరాల కోసం ఏడాది పొడవునా నీరుంచాలంటే.. ఆ నీటిలో 20 శాతం ఆవిరి నష్టాలు, సీపేజ్ నష్టాలు ఉంటా యి. అంతేగాకుండా ఈ రిజర్వాయర్లను నింపేందుకు 148 మీటర్ల ఎత్తున ఉన్న ఎల్లంపల్లి నుంచి 600 మీటర్ల ఎత్తున్న మల్లన్నసాగర్‌కు పంపింగ్ చేయాలి. దీనికి విద్యుత్ అవసరం చాలా ఎక్కువ. అయితే ఇదే తరహాలో రెండు బ్యారేజీలను అదే సామర్థ్యంతో తమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి మధ్య ఏర్పాటు చేస్తే గ్రావిటీ ద్వారా నీరొస్తుంది. పంపింగ్‌కు విద్యుత్ అవసరం ఉండదు, వ్యయం చాలా తగ్గుతుంది. అయితే రిజర్వాయర్ల ఏర్పా టు నైసర్గికంగా సాధ్యపడే అంశాలపై లైడార్ సర్వే చేయాలి. దీంతోపాటే ఎల్లంపల్లి నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీకి నీటిని గోదావరి మార్గం ద్వారా తీసుకెళ్లేందుకు 14 బ్యారేజీలు నిర్మించాలి. దీని ద్వారా వరదలు వచ్చినప్పుడు విద్యుదుత్పాదనకు అవకాశం ఉంటుంది. నిజాంసాగర్, సింగూరు మధ్య వరుస బ్యారేజీలు నిర్మించాలి. ఇలా చేస్తే గరిష్ట నీటి వినియోగం, ఆర్థిక వ్యయం, విద్యుత్ అవసరాలు తగ్గుతాయి.’’