- తెలంగాణ-మహారాష్ట్ర అధికారుల స్థాయి చర్చల్లో నిర్ణయం
- మేడిగడ్డ వద్ద 100 మీటర్ల కనీస మట్టానికి సమ్మతి
- ముంపు సర్వే తేల్చాక ఒకటి రెండు మీటర్లు పెంచే అంశంపై చర్చ
- గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఇరు రాష్ట్రాలకు నీటి వాటా
- అంతకుముందే పర్యావరణ, అటవీ, మైనింగ్ అంశాలపై సంయుక్త సర్వే
- నెలాఖరులో లేదా ఏప్రిల్ తొలివారంలో ముఖ్యమంత్రుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు చివరికి 148 మీటర్లకే పరిమితం కానుంది. ఈ మేరకు తెలంగాణ-మహారాష్ట్ర మధ్య జరిగిన అధికారుల స్థాయి చర్చల్లో అవగాహన కుదిరింది. తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం రాష్ట్రానికి నష్టదాయకమని ప్రతిపక్షాలు మొత్తుకుంటున్న తరుణంలోనే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీని 100 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర ఓకే చెప్పింది. అయితే తమ రాష్ట్రంలో జరిగే ముంపుపై సర్వే ఫలితాలను బట్టి మరో ఒకటి రెండు మీటర్లు ఎత్తు పెంచే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. మొత్తంగా గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై మూడు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర తన సమ్మతిని తెలిపింది.
ఇక గోదావరి జలాలపై ఇదివరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఇరు రాష్ట్రాలు తమ వాటాలను వినియోగించుకోవాలని... మూడు బ్యారేజీలకు సంబంధించిన పర్యావరణ, మైనింగ్, అటవీ అనుమతులపై పది రోజుల్లో సంయుక్త పరిశీలన చేసి నివేదిక తయారు చేయాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఆ నివేదిక ఆధారంగా ‘నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు)’ జారీ చేయాలని అభిప్రాయపడ్డారు.
సాగునీటి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో శనివారం హైదరాబాద్‌లో సమన్వయ కమిటీ, స్టాండింగ్ కమిటీలు సమావేశమయ్యాయి. విడివిడిగా జరిగిన ఈ భేటీల్లో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు ఎస్‌కే జోషి, గవాయి, రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్, మహారాష్ట్ర అధికారులు ఆర్‌బీ శుక్లా, చౌహాన్, రాష్ట్ర సీఈలు వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, అజయ్‌కుమార్, నరేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలతో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మేడిగడ్డ 100 మీటర్లకు ఓకే..
గోదావరిలో కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషీ మొదట వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ అధ్యయనం చేసి గోదావరిపై మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని ప్రతిపాదించిందని తెలిపారు. ఈ ఎత్తులో ముంపు మొత్తం నదీ గర్భంలో ఉంటుందని పేర్కొన్నదని చెప్పారు. ఒకవేళ ఈ ఎత్తులో ముంపు ఉన్నపక్షంలో మేడిగడ్డ బ్యారేజీని 102 మీటర్ల ఎత్తుతో నిర్మించి 100 మీటర్ల వరకే నీటిని నిల్వ చేసే ఉద్దేశంతో ఉన్నామని వివరించారు. ఈ సందర్భంగా 103, 102, 101, 100 మీటర్ల ఎత్తుల్లో ఉండే ముంపు వివరాలను వెల్లడించారు.
ఈ వివరాలన్నీ విన్న మహారాష్ట్ర అధికారులు 100 మీటర్ల కనీస ఎత్తుకు సమ్మతి తెలిపారు. 101, 102, 103 మీటర్ల ఎత్తుల్లో ఉండే ముంపుపై తమ అధికారుల సర్వే పూర్తయ్యాక ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. అయితే ఇక్కడ మహారాష్ట్రకు ఏ మేరకు నీటి వాటా ఇవ్వాలన్న దానిపై తర్వాతి సమావేశంలో నిర్ణయించాలనే అభిప్రాయానికి వచ్చారు. మేడిగడ్డ ద్వారా మహారాష్ట్రకు సుమారు 4.5 టీఎంసీలను కేటాయించి, 45 వేల ఎకరాలకు నీరందించాలనే ప్రతిపాదన ఉంది.
148 మీటర్లతో తమ్మిడిహెట్టి
తమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందకు మహారాష్ట్ర అంగీకరించింది. ఇక్కడ పర్యావరణ, అటవీ అనుమతులు, కేంద్ర జల సంఘం అనుమతులు తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఛనాఖా-కొరటకు సంబంధించి సాంకేతిక అంశాలపై చర్చించారు. ఇక్కడ బ్యారేజీ నిర్మాణంతో కొంత అటవీ, మైనింగ్‌కు సమస్యలు ఉండవచ్చని మహారాష్ట్ర ప్రస్తావించగా... అలాంటిదేమీ లేదని తెలంగాణ తెలిపింది. దీంతో ఈ అంశాలపై సంయుక్త సర్వే నిర్వహిద్దామని, పదిరోజుల్లో దీనిపై తేల్చి ముందుకు వెళదామని అభిప్రాయం వ్యక్తమైంది.
ఈనెల చివరి వారంలో సీఎంల సమావేశం?
అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో బ్యారేజీల ఎత్తుపై అవగాహన కుదిరిన నేపథ్యంలో... ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ తొలి వారంలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం నిర్వహించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇరు రాష్ట్రాల సీఎం ఇచ్చే సమయం ఆధారంగా బోర్డు సమావేశం తేదీలను నిర్ణయించనున్నారు.
తమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లే!
Published Sun, Mar 20 2016 4:10 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement