రీడిజైన్ పేరుతో అప్పుల భారం పెంచొద్దు: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రీడిజైన్ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల ఖర్చును పెం చి, రాష్ట్రంపై అప్పుల భారాన్ని మోపొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్చి, తద్వారా అంచనా వ్యయాన్ని భారీగా పెంచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దంటే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారంటూ సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు.
తమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల దాకా నీళ్లు తీసుకోవాలని, బాధ్యతలను వ్యాప్కోస్‌కు అప్పగించాలంటూ తీసుకున్న నిర్ణయం ద్వారా కేసీఆర్‌లో కొంత మార్పు వచ్చినట్టుగా భావిస్తున్నామన్నారు. తమ్మిడిహెట్టి ఎత్తును కూడా తగ్గించొద్దని కోరారు. మల్లన్నసాగర్‌లో భూనిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా, బలవంతంగా భూములను సేకరించడం సరికాదన్నారు. వాస్తు నమ్మకాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని కోరారు.