తమ్మిడిహెట్టి-సుందిళ్ల గ్రావిటీ సర్వేకు బ్రేక్ | break to Gravity Survey in thummidihetty | Sakshi
Sakshi News home page

తమ్మిడిహెట్టి-సుందిళ్ల గ్రావిటీ సర్వేకు బ్రేక్

Published Fri, Jun 10 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

తమ్మిడిహెట్టి-సుందిళ్ల గ్రావిటీ సర్వేకు బ్రేక్

తమ్మిడిహెట్టి-సుందిళ్ల గ్రావిటీ సర్వేకు బ్రేక్

హెలికాప్టర్‌లో సాంకేతిక లోపంతో ఆగిన పనులు
పునరుద్ధరణకు మరో 3, 4 రోజులు పట్టే అవకాశం

 సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్లకు తరలించేందుకు చేపట్టిన సర్వే పనులకు బ్రేక్ పడింది. సర్వే బాధ్యత తీసుకున్న వ్యాప్కోస్ సంస్థ వినియోగిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 3 రోజులుగా సర్వే పనులు నిలిచిపోయాయి. సర్వే పనులు తిరిగి కొనసాగించేందుకు 3, 4 రోజులు పట్టే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపా యి. ప్రాణహిత మొదటి డిజైన్ ప్రకారం తమ్మిడిహెట్టి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అక్కడ్నుంచి 72 కిలోమీటర్ల మేర గ్రావిటీ, తర్వాత చిన్న లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని అధికారులు ప్రణాళిక వేశారు.

సుమారు 60 క్యూసెక్కుల నీటి తరలింపునకు వీలుగా 69 మీటర్ల వెడల్పుతో కాల్వల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 44 టీఎంసీల నీటి లభ్యత ఉందని సర్వే సంస్థ అంచనా వేయడంతో తమ్మిడిహెట్టి నుంచి తీసుకునే నీటి పరిమాణాన్ని 50 క్యూసెక్కులకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహితను కలుపుకుంటే 5,200 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉండటంతో గ్రావిటీ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. తమ్మిడిహెట్టి రెగ్యులేటర్ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గిస్తే మరో 20 నుంచి 30 టీఎంసీల నీటిని తరలించవచ్చనే అంచనా నేపథ్యంలో వీలైనంత ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా 72వ కిలోమీటర్ వరకు తెచ్చి అక్కడ్నుంచి వేరే కాల్వ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో కలపాలనే ప్రతిపాదన చేశారు.

ఇందుకోసం సర్వే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించారు. 72వ కిలోమీటర్ పాయింట్ నుంచి సుందిళ్లకు నీటిని కలిపే వ్యవస్థపై ఈ సంస్థ లైడార్ సర్వే మొదలుపెట్టింది. సర్వే మేరకు ఈ అలైన్‌మెంట్ దారిలో మైనింగ్ క్షేత్రాలు ఉన్నాయని, వాటిల్లో టన్నెల్ నిర్మాణాలను చేపట్టడం వీలుపడదని సంస్థ గుర్తించింది. దీనిపై లోతుగా పరిశీలించడంతోపాటు గ్రావిటీ ద్వారా వచ్చే నీటి అవకాశాలను మెరుగుపరిచేందుకు లైడార్ సర్వే చేస్తోంది. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలున్న నేపథ్యంలో కాల్వల వెడల్పు తగ్గించడం సబబు కాదంటూ 60 క్యూసెక్కుల నీటి తరలింపు ప్రణాళికనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తయితేనే తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత, అక్కడ్నుంచి సుందిళ్లకు నీటి తరలింపు అంశం కొలిక్కి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement