‘ప్రాణహిత’ కోసం టీడీపీ పాదయాత్ర
- 18న శంకర్‌పల్లి మండలం మహాలింగపురం నుంచి ప్రారంభం
- పాల్గొననున్న ఎర్రబెల్లి, రమణ, పెద్దిరెడ్డి తదితరులు
చేవెళ్ల: ప్రాణహిత -చేవెళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ పాదయాత్రకు సిద్ధమవుతోంది. 18, 19 తేదీల్లో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి టీడీఎల్పీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ, ఈ.పెద్దిరెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ జిల్లా నాయకులు శేరి పెంటారెడ్డి, చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షుడు శేరి నర్సింహారెడ్డి చేవెళ్లలో ఆదివారం విలేకరులకు వివరించారు. 18న శంకర్‌పల్లి మండలం మహాలింగపురం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని, 19న కూడా కొనసాగిస్తామని చెప్పారు.
జిల్లాకు తాగు, సాగునీరు అందించడంలో జరుగుతున్న అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తెలంగాణలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేయడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008లో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుత ప్రభుత్వం జిల్లా రైతులకు, ప్రజలకు అన్యాయం చేయడానికి ప్రాజెక్టు డిజైన్ మారుస్తోందని మండిపడ్డారు. మెదక్ జిల్లాకు నీరివ్వడం కోసం రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయడం పద్ధతి కాదన్నారు. 19న ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు పైలాన్‌వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు శ్రీశైలం, సుభాన్‌గౌడ్, శర్వలింగం, రాజశేఖర్, లింగం, మొహినుద్దీన్, వడ్డె రాంచంద్రయ్య, మల్లారెడ్డి, అబీబ్, రాములు, శ్రీకాంత్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, వీరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.