ట్రిబ్యునళ్లు గంపగుత్తగా కేటాయింపులు జరిపినా ప్రాజెక్టులకు రక్షణ
వాటి ఆధారంగానే గత 48 ఏళ్లుగా ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కొనసాగింపు
కృష్ణా ట్రిబ్యునల్–2 ముందు ఏపీ తరఫు సాక్షి అనిల్‌కుమార్ గోయల్
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల నికర జలాలు లభ్యతలోకి వస్తే నాగార్జునసార్, శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు ఆ మేరకు నీటి సరఫరా తగ్గిపోతుందని జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ముందు ఏపీ ప్రభుత్వ సాక్షి అనిల్‌కుమార్ గోయల్ వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం ఢిల్లీలో ట్రిబ్యునల్ నిర్వ హించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొన్న ఆయన.. తెలంగాణ న్యాయవాదుల ప్రశ్నల కు సమాధానాలిచ్చారు.
1978 ఆగస్టు 4న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం పోలవరం నుంచి 80 టీఎంసీల గోదావరి జలాల ను విజయవాడ ఆనకట్టకు తరలిస్తే, శ్రీశైలం, సాగర్ నుంచి వచ్చే జలాలపై కృష్ణా డెల్టా ఆధారపడదనే వాదనను అంగీకరిస్తారా? అని ప్రశ్నించగా అవునని ఆయన బదులిచ్చారు.
కృష్ణా ట్రిబ్యునల్–1, 2లు గంపగుత్తగా నీటి కేటాయింపులు జరిపినా, రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాజెక్టులకు రక్షణ కల్పించాయని, వాటి ఆధారంగా పలు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిగాయని చెప్పారు. కేంద్ర జల సంఘం డైరెక్టర్ (హైడ్రాలజీ)గా పదవీ విరమణ పొందిన అనిల్‌కుమార్.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్స్‌ను ప్రతిపాదించారు.
ఆ ప్రొటోకాల్స్‌కు స్వల్ప మార్పులే..
ట్రిబ్యునల్‌కు కేంద్రం జారీ చేసిన కొత్త టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (సూచనలతో కూడిన నిబంధనలు) ఆధారంగా ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాలకు సమ కేటాయింపులు చేస్తే ప్రతిపాదిత ఆపరేషన్ ప్రొటోకాల్స్ పూర్తిగా అసంబద్ధంగా మారిపోతాయని ప్రశ్నించగా, వాటికి స్వల్ప మార్పులే చేయాల్సిరావొచ్చని అనిల్‌కుమార్ బదులిచ్చారు.
ఏపీ, తెలంగాణ మధ్య ఏ ట్రిబ్యునల్ నీటి పంపకాలు జరపలేదని, ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేసిన పరిపాలనపర ఏర్పాట్లనే కేటాయింపులుగా చూపుతున్నారంటూ తెలంగాణ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రక్షిత ప్రాజెక్టులు, అదనపు ప్రాజెక్టుల ఆధారంగా ఉమ్మడి ఏపీకి కేటాయింపులు జరిగాయని, ఈ ప్రాజెక్టులకు కేటాయింపులు గత 48 ఏళ్లుగా కొనసాగుతున్నాయని గోయల్ బదులిచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ కేటాయింపులకు పలు అంతర్రాష్ట్ర సమావేశాల్లో సమ్మతి తెలిపారన్నారు. 2015 జూన్ 18, 19న అపెక్స్ కౌన్సిల్‌లో ఏపీ, తెలంగాణ మధ్య జరిగిన ఒప్పందమే దీనికి ఆధారమన్నారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించి 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని కోరిన విషయం తెలియదా? అని తెలంగాణ న్యాయవాది ప్రశ్నించగా, లేదని బదులిచ్చారు.
జూరాల నుంచి మిగులు జలాలే వాడాలి
కృష్ణా ట్రిబ్యునల్–1, 2లతో పాటు పునర్విభజన చట్టంలో రక్షణ కల్పించకపోవడంతోనే కోయిల్‌సాగర్, ఒకచెట్టివాగు ప్రాజెక్టులకు జూరాల నుంచి నీటి తరలింపును పరిగణనలోకి తీసుకోలేదని గోయల్ చెప్పారు. షెడ్యూల్–11లో పేర్కొన్న ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాలు కాకుండా మిగులు జలాలనే సరఫరా చేయాల్సి ఉంటుందని, అందుకే నెట్టెంపాడు ప్రాజెక్టును సైతం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
జూరాల నుంచి దిగువకు 342 టీఎంసీలను విడుదల చేసిన తర్వాతే మిగులు జలాలను వాడుకోవాల్సి ఉంటుందన్నారు. 2015–16 నుంచి ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి నీళ్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, అవి నికర జలాలు కావని చెప్పారు.
పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవాలని గతంలో ఒప్పందం జరిగిందని, ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలిన 45 టీఎంసీలను ఏపీలోని కృష్ణా డెల్టాకు వాడుకోవాల్సి ఉంటుందని గోయల్ పేర్కొన్నారు. సాగర్‌కి దిగువన వాడినా ఎగువ ప్రాంతంలో వాడినట్టు లెక్కించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment