సాక్షి, హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా సమ కేటాయింపులు జరిపే అధికారం తమకు లేదని కృష్ణా ట్రిబ్యునల్–2 చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ మరోసారి స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన తెలంగాణకు కేవలం 299 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించడం..బేసిన్ ప్రమాణాల ప్రకారం ఏమాత్రం సమంజసమని తెలంగాణ రాష్ట్రం వాదించగా.. ఆయన పై విధంగా స్పందించారు.
దీంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలను కేటాయిస్తూ తాము జారీ చేసిన జీవోను సమీక్షించే అధికారంసైతం కృష్ణా ట్రిబ్యునల్–2కి ఉండదని, అపెక్స్ కౌన్సిల్ పరిధిలోకి ఈ అంశం వస్తుందని తెలంగాణ స్పష్టం చేసింది.
ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్‌లాక్యూటరీ అప్లికేషన్(ఐఏ)ను తోసిపుచ్చాలని కోరింది. బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 గురువారం ఢిల్లీలో ఏపీ దాఖలు చేసిన ఐఏపై విచారణ నిర్వహించగా, తెలంగాణ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ ఈ మేరకు వాదనలు వినిపించారు.
కేటాయించింది నికర జలాలే
బచావత్ ట్రిబ్యునల్(కృష్ణా ట్రిబ్యునల్–1) ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని వివరించింది. ఆ నీళ్లను ఏ ప్రాజెక్టులకైనా కేటాయించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పిస్తూ గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని తెలంగాణ గుర్తు చేసింది. దీని ఆధారంగానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయింపులు చేసుకున్నామని స్పష్టం చేసింది.
మైనర్ ఇరిగేషన్‌లో తెలంగాణకు కేటాయించిన 89 టీఎంసీల్లో వాడుకోని 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించినట్టు వివరించింది. పోలవరం ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున, నాగార్జునసాగర్ ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన 80 టీఎంసీల కోటా నుంచి మరో 45 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయించినట్టు తెలిపింది. ప్రాజెక్టుకు నికర జలాలనే కేటాయించినట్టు వాదనలు వినిపించింది.
గోదావరికి కృష్ణా జలాల మళ్లింపునకు ప్రతిఫలంగా వచ్చిన 80 టీఎంసీల నుంచి 30 టీఎంసీలను 2013లో ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ)కి కేటాయించిందని గుర్తు చేసింది. ఎస్‌ఎల్‌బీసీకి ప్రాజెక్టుకు కేటాయించిన 30 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు తిరిగి కేటాయించినట్టు వెల్లడించింది.
ఏ ప్రాజెక్టుకూ కేటాయించని జలాలను బేసిన్ లోపలి ప్రాజెక్టులకు కేటాయించాల్సి ఉంటుందని, అందుకే పాలమూరు–రంగారెడ్డికి కేటాయించినట్టు తెలిపింది. నికర జలాలనే కేటాయించినందున ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చాలని సూచించింది. తెలంగాణ వాదనలు గురువారంతో ముగియగా, శుక్రవారం ఏపీ వాదనలు వినిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment