తెలంగాణ పునరుద్ఘాటన
కృష్ణా ట్రిబ్యునల్–2కు ఏపీ సమర్పించిన ఎస్‌వోసీపై కౌంటర్
కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపులు అశాస్త్రీయం
గంపగుత్తగానే కేటాయింపులు..ప్రాజెక్టుల వారీగా చేయలేదు
పంపకాలు జరిగే వరకు ప్రాజెక్టుల అప్పగింత ఉత్పన్నం కాదు
సాక్షి, హైదరాబాద్: జలవిద్యుత్ అవసరాలకే శ్రీశైలం జలాశయాన్ని నిర్మించారని తెలంగాణ రాష్ట్రం మరోసారి స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ ఏదైనా మార్పు చేసేవరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల విషయంలో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కు ఇటీవల ఏపీ సమర్పించిన స్టేట్ ఆఫ్ కేస్ (ఎస్‌వోసీ)పై తెలంగాణ కౌంటర్ దాఖలు చేసింది.
తెలంగాణ దాఖలు చేసిన ఎస్‌వోసీపై ఏపీ సోమవారం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేసింది. ఇరు రాష్ట్రాలు దాఖలు చేసిన కౌంటర్లపై పరస్పర రిజాయిండర్లు దాఖలు చేయడానికి 15 రోజుల సమయాన్ని కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించింది. తెలంగాణ ఎస్‌వోసీలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరగాలి
∙ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఇంకా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్‌లపై ఆధారపడి ఏపీలో నిర్మించిన ప్రాజెక్టులకు 520.7 టీఎంసీలు అవసరమని ఏపీ చేసిన వాదన చెల్లుబాటుకాదు. ∙కృష్ణా పరీవాహక ప్రాంతంలో 70 శాతం నీటి లభ్యతకు పశ్చిమ కనుమల్లో కురిసే వర్షాలే కారణం. ఉప నదులు/సబ్ బేసిన్ల వారీగా కాకుండా బేసిన్‌లో చివరన ఉన్న ప్రకాశం బరాజ్ వద్ద నీటి లభ్యతను మాత్రమే కృష్ణా ట్రిబ్యునల్–1 లెక్కించింది.
ఉమ్మడి ఏపీని ఒక యూనిట్‌గా పరిగణించి గంపగుత్తగా 811 టీఎంసీల జలాలను కేటాయించింది. రాష్ట్రంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల అవసరాలను పరిశీలించకుండానే, రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల ఆధారంగా అప్పటికే ఉన్న ప్రాజెక్టుల కింద వినియోగాన్ని పరిరక్షించింది. ఆంధ్రలో బేసిన్ వెలుపలి ప్రాంతాలకు నీళ్లను తరలించేందుకు, కృష్ణా ప్రధాన పాయపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ నిర్ణయం దారితీసింది.
∙తెలంగాణలో కృష్ణా బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలను తీర్చడానికి చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను మాత్రమే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. బేసిన్ లోపలి ప్రాంతాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన తెలంగాణకు అనుకూలంగా ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. నీటి వాటాల కోసం సరిపడ నీటి లభ్యత లేని ఉప నదులపైనే తెలంగాణ ఆధారపడగా, ఏపీ మాత్రం కృష్ణా ప్రధాన పాయ ద్వారా భారీ లబ్ధిని పొందుతోంది.
సమన్యాయ సిద్ధాంతాన్ని పాటించలేదు
∙కృష్ణా ట్రిబ్యునల్–1 సమన్యాయ సిద్ధాంతాన్ని అమలు చేయలేదు. 1971లో రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ఆధారంగా 751.2 టీఎంసీల (ఏపీ 114.9, మహారాష్ట్ర 386.7, కర్ణాటక 249.6 టీఎంసీలు) వినియోగాన్ని పరిరక్షించింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగాన్ని సమగ్రంగా పరీక్షించకుండానే ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు పరస్పర సమ్మతితో సమర్పించిన ప్రాజెక్టుల జాబితా ఆధారంగా మరో 942.16 టీఎంసీల (ఏపీ 634.26, మహారాష్ట్ర 52.95, కర్ణాటక 254.95 టీఎంసీలు) వినియోగాన్ని సంరక్షించింది.
ప్రాజెక్టుల హైడ్రాలజీ, క్యాచ్‌మెంట్ ఏరియా, వర్షపాతం వంటి అంశాలను పరీక్షించకుండానే ఈ నిర్ణయాలను ట్రిబ్యునల్ తీసుకుంది. ఈ నీళ్లను బేసిన్ లోపలి ప్రాంతాల్లో వాడుతున్నారా? వెలుపలి ప్రాంతాల్లో వాడుతున్నారా? అనే అంశాన్ని సైతం పరీక్షించలేదు. ఎలాంటి శాస్త్రీయ విధానం గానీ సమన్యాయ సిద్ధాంతాన్ని గానీ ట్రిబ్యునల్ అవలంభించలేదు.
50: 50 నిష్పత్తిలో పంపిణీ చేయాలి
» ప్రాజెక్టుల వారీగా కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపులు చేసిందని ఏపీ ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. ఏపీ పేర్కొన్నట్టు ప్రాంతాల వారీగా, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులేమీ జరగలేదు. గుంపగుత్తగానే కేటాయింపులు చేసింది.
» ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలు జరగే వరకు ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే అంశం ఉత్పన్నం కాదు.
» శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు 173.5 టీఎంసీలు అవసరం.
» రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక పంపకాల కోసం 2015లో చేసుకున్న ఒప్పందం ఆ ఒక్క ఏడాది కోసమే. ఇప్పుడు 50: 50 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలి.
కృష్ణా ట్రిబ్యునల్–1 నిర్ణయాలను పునః సమీక్షించరాదు: ఏపీ
ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు కృష్ణా ట్రిబ్యునల్–1 చేసిన కేటాయింపులను పునఃసమీక్షించడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపులను పునః సమీక్షించడానికి ఆస్కారం లేదని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment