sri sailam project
-
అటు ఎండబెట్టి.. ఇటు ముంచేసి..
కృష్ణా వరద నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యమే విజయవాడతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో జలప్రళయం సంభవించడానికి.. అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందని జలవనరుల శాఖ అధికార వర్గాలు, సాగునీటిరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను శ్రీశైలం ప్రాజెక్టులో నియంత్రించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు మళ్లించి.. గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదలచేసి ఫ్లడ్ కుషన్ ఉంచుకుని ఉంటే జలప్రళయం సంభవించే అవకాశమే ఉండేది కాదని వారు తేల్చిచెబుతున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి శుక్రవారం ఉ.6 గంటల వరకూ 1,016.19 టీఎంసీల ప్రవాహం వస్తే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 93.21 టీఎంసీలే మళ్లించారు. ఆ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 125.29 టీఎంసీలు అవసరం. నిజానికి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు ఎగువన ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని 2019లో కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో.. వరదల సమయంలో గరిష్ఠస్థాయిలో పోతిరెడ్డిపాడు ద్వారా ఒడిసి పట్టి ఉంటే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులు నిండి ఆ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేవని.. ప్రకాశం బ్యారేజీ దిగువన ముంపు ముప్పు తప్పేదని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టానికి జరిగేది కాదని వారు స్పష్టంచేస్తున్నారు. 2019, 2020, 2021, 2022లలో కృష్ణా వరదను ప్రభుత్వం ఇదే రీతిలో నియంత్రించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందని వారు గుర్తుచేస్తున్నారు. – ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి వరద నియంత్రణ చేసేది ఇలాగేనా..ూ కృష్ణా నది చరిత్రలో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009, సెపె్టంబరు 2న గరిష్ఠంగా 25.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అప్పట్లో ఈ వరదను సమర్థవంతంగా నియంత్రించడంవల్ల ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహాన్ని గరిష్ఠంగా 11.10 లక్షలకు పరిమితం చేశారు. » కృష్ణా బేసిన్లో ఈ ఆగస్టు 30, 31.. సెప్టెంబరు 1 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చరించింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 28న 1,69,303 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. కానీ, ఆ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 30 వేల క్యూసెక్కులను మాత్రమే వదిలారు. ఆ తర్వాత శ్రీశైలంలోకి ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగినా ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో 30 వేల క్యూసెక్కుల చొప్పున.. సెప్టెంబరు 1న 26,042 క్యూసెక్కులను మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మళ్లిస్తూ వచి్చన వరదను వచి్చనట్లు సాగర్, పులిచింతల ద్వారా దిగువకు వదిలేశారు. » దీంతో ప్రకాశం బ్యారేజీని కృష్ణా వరద ముంచెత్తింది. బ్యారేజీ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో సెపె్టంబరు 2న గరిష్ఠంగా 11,43,201 క్యూసెక్కుల వరద రావడానికి దారితీసింది. ఆ రోజున కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 16,417 క్యూసెక్కులు.. సెపె్టంబరు 3న 12 వేల క్యూసెక్కులు మాత్రమే మళ్లించారు. రాష్ట్ర ప్రయోజనాలు ‘కృష్ణా’ర్పణం.. » వరద నియంత్రణలో ప్రభుత్వ ఘోర వైఫల్యంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 647.16 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ప్రభుత్వం ముందుచూపుతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని మళ్లించి ఉంటే.. కడలిలో కలిసిన జలాల్లో కనీసం 100 టీఎంసీలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కి ఉండేవని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సీజన్లో ఏ ఒక్కరోజూ ‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు.» ఇక హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలిస్తేనే 120 రోజుల్లో ప్రస్తుత డిజైన్ మేరకు 40 టీఎంసీలు రాయలసీమకు అందించవచ్చు. కానీ, ఇప్పటికి కేవలం 4.24 టీఎంసీలే తరలించారు. ఈ సీజన్లో గరిష్ఠంగా 1,688 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోశారు. » వరద రోజుల్లో మళ్లించిన జలాలను కృష్ణా బోర్డు కోటాలో కలిపేది కాదు.. దీనివల్ల రాష్ట్ర కోటా 512 టీఎంసీల కంటే అధికంగా వాడుకునే అవకాశం ఉండేది. ఇది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి దారితీసేది. » ఇక శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి చెరి సగం నీటిని వాడుకోవాలి. కానీ, తెలంగాణ జెన్కో కంటే ఏపీ జెన్కో తక్కువ విద్యుదుత్పత్తి చేసింది. శ్రీశైలంలోకి ప్రవాహాలు ఇలా..» ఈ సీజన్లో జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకు » శ్రీశైలానికి వచ్చిన ప్రవాహం : 1,016.19 టీఎంసీలు » ఇందులో జూరాల నుంచి వచ్చింది : 797.68 టీఎంసీలు » సుంకేశుల నుంచి వచ్చింది : 217.51 టీఎంసీలు » హంద్రీ నుంచి వచ్చింది : 1.00 టీఎంసీశ్రీశైలం నుంచి విడుదల చేసింది ఇలా..ఆంధ్రప్రదేశ్..» పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ : 93.21 టీఎంసీలు » హంద్రీ–నీవా : 4.24 టీఎంసీలు »కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 101.45 టీఎంసీలుతెలంగాణ..» కల్వకుర్తి ఎత్తిపోతల : 9.91 టీఎంసీలు » ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 152.74 టీఎంసీలు » గేట్ల ద్వారా నదిలోకి విడుదల : 604.53 టీఎంసీలు -
మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట/నాగార్జునసాగర్/కడెం: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ మళ్లీ పోటెత్తింది. ఎగువన ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకి భీకర వరద పోటెత్తింది. శనివారం సాయంత్రం 6 గంటలకు వరద ప్రవాహం 4,10,581 క్యూసెక్కులకు పెరగడంతో 212.38 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 8 గేట్లను 12 అడుగులు, మరో 2 గేట్లను 10 అడుగుల మేరకు పైకెత్తి 3,12,390 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు.కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,227 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 37,882 క్యూసెక్కులు కలిపి మొత్తం 68,109 క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంకా పోతిరెడ్డిపాడు ద్వారా 25,000, హంద్రీ నీవా ద్వారా 1,688, కల్వకుర్తి లిఫ్టు ద్వారా 2,400 క్యూసెక్కులు కలిపి కాల్వకు మొత్తం 29,088 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం అవుట్‌ఫ్లోలు 4,09,587 క్యూసెక్కులకు పెరిగాయి. సాగర్ 26 గేట్లు ఎత్తివేత..దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 3,87,653 క్యూసె క్కుల వరద వచ్చి చేరుతుండగా, 308.76 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ వచ్చిన వరదను వచ్చినట్టు వదిలేస్తున్నారు. సాగ ర్ 20 గేట్లను 10 అడుగుల మేర, మరో 6 గేట్లను 5 అడుగు లమేర పైకెత్తి 3,43,810 క్యూసె క్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా మరో 29,313 క్యూసెక్కుల ను కిందికి విడుదల చేస్తున్నారు. కుడికాల్వకు 5,496, ఎడమ కాల్వకు 6,634, ఏఎంఆర్పీకి 1,800, ఎల్ఎల్సీకి 600 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో సాగర్ నుంచి మొత్తం అవుట్‌ఫ్లోలు 3,87,653 క్యూసెక్కు లకు పెరిగాయి.దీంతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 2,70,349 క్యూసెక్కుల వరద వస్తుండగా, 3,10,395 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. పులిచింతలకు దిగువన నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఈ ప్రవాహానికి తోడు కావడంతో ప్రకాశం బరాజ్‌కి వరద ఉధృతి పెరిగింది. బరాజ్‌కి 3,31,829 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లు ఎత్తి 3,18,160 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 184 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. ఆల్మట్టికి భారీ వరద..పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువన కృష్ణా ప్రధాన పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆల్మట్టిలోకి వస్తున్న 1.75 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టే కిందికి విడుదల చేస్తున్నారు. దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.78 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో జూరాల ప్రాజెక్టులోకి వరద భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 3.27 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో నిలకడగా వరద కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 34,983 క్యూసెక్కులు చేరు తుండటంతో నీటి నిల్వ 94.55 టీఎంసీలకు చేరుకుంది.అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్భారీ నుంచి అతిభారీ వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరూ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని, సెలవులు తీసుకోరాదని సూచించారు. జలాశయాలు, చెరువుల వద్ద వరద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.కడెం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేతఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు శనివారం 22,696 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఏడు వరద గేట్లు ఎత్తి 57,821 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. -
జలవిద్యుత్ అవసరాలకే శ్రీశైలం
సాక్షి, హైదరాబాద్: జలవిద్యుత్ అవసరాలకే శ్రీశైలం జలాశయాన్ని నిర్మించారని తెలంగాణ రాష్ట్రం మరోసారి స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ ఏదైనా మార్పు చేసేవరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల విషయంలో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కు ఇటీవల ఏపీ సమర్పించిన స్టేట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)పై తెలంగాణ కౌంటర్ దాఖలు చేసింది. తెలంగాణ దాఖలు చేసిన ఎస్వోసీపై ఏపీ సోమవారం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేసింది. ఇరు రాష్ట్రాలు దాఖలు చేసిన కౌంటర్లపై పరస్పర రిజాయిండర్లు దాఖలు చేయడానికి 15 రోజుల సమయాన్ని కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించింది. తెలంగాణ ఎస్వోసీలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరగాలి ∙ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఇంకా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్‌లపై ఆధారపడి ఏపీలో నిర్మించిన ప్రాజెక్టులకు 520.7 టీఎంసీలు అవసరమని ఏపీ చేసిన వాదన చెల్లుబాటుకాదు. ∙కృష్ణా పరీవాహక ప్రాంతంలో 70 శాతం నీటి లభ్యతకు పశ్చిమ కనుమల్లో కురిసే వర్షాలే కారణం. ఉప నదులు/సబ్ బేసిన్ల వారీగా కాకుండా బేసిన్లో చివరన ఉన్న ప్రకాశం బరాజ్ వద్ద నీటి లభ్యతను మాత్రమే కృష్ణా ట్రిబ్యునల్–1 లెక్కించింది.ఉమ్మడి ఏపీని ఒక యూనిట్‌గా పరిగణించి గంపగుత్తగా 811 టీఎంసీల జలాలను కేటాయించింది. రాష్ట్రంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల అవసరాలను పరిశీలించకుండానే, రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల ఆధారంగా అప్పటికే ఉన్న ప్రాజెక్టుల కింద వినియోగాన్ని పరిరక్షించింది. ఆంధ్రలో బేసిన్ వెలుపలి ప్రాంతాలకు నీళ్లను తరలించేందుకు, కృష్ణా ప్రధాన పాయపై ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ నిర్ణయం దారితీసింది. ∙తెలంగాణలో కృష్ణా బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలను తీర్చడానికి చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను మాత్రమే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. బేసిన్ లోపలి ప్రాంతాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన తెలంగాణకు అనుకూలంగా ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. నీటి వాటాల కోసం సరిపడ నీటి లభ్యత లేని ఉప నదులపైనే తెలంగాణ ఆధారపడగా, ఏపీ మాత్రం కృష్ణా ప్రధాన పాయ ద్వారా భారీ లబ్ధిని పొందుతోంది. సమన్యాయ సిద్ధాంతాన్ని పాటించలేదు ∙కృష్ణా ట్రిబ్యునల్–1 సమన్యాయ సిద్ధాంతాన్ని అమలు చేయలేదు. 1971లో రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ఆధారంగా 751.2 టీఎంసీల (ఏపీ 114.9, మహారాష్ట్ర 386.7, కర్ణాటక 249.6 టీఎంసీలు) వినియోగాన్ని పరిరక్షించింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగాన్ని సమగ్రంగా పరీక్షించకుండానే ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు పరస్పర సమ్మతితో సమర్పించిన ప్రాజెక్టుల జాబితా ఆధారంగా మరో 942.16 టీఎంసీల (ఏపీ 634.26, మహారాష్ట్ర 52.95, కర్ణాటక 254.95 టీఎంసీలు) వినియోగాన్ని సంరక్షించింది. ప్రాజెక్టుల హైడ్రాలజీ, క్యాచ్మెంట్ ఏరియా, వర్షపాతం వంటి అంశాలను పరీక్షించకుండానే ఈ నిర్ణయాలను ట్రిబ్యునల్ తీసుకుంది. ఈ నీళ్లను బేసిన్ లోపలి ప్రాంతాల్లో వాడుతున్నారా? వెలుపలి ప్రాంతాల్లో వాడుతున్నారా? అనే అంశాన్ని సైతం పరీక్షించలేదు. ఎలాంటి శాస్త్రీయ విధానం గానీ సమన్యాయ సిద్ధాంతాన్ని గానీ ట్రిబ్యునల్ అవలంభించలేదు. 50: 50 నిష్పత్తిలో పంపిణీ చేయాలి » ప్రాజెక్టుల వారీగా కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపులు చేసిందని ఏపీ ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. ఏపీ పేర్కొన్నట్టు ప్రాంతాల వారీగా, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులేమీ జరగలేదు. గుంపగుత్తగానే కేటాయింపులు చేసింది. » ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలు జరగే వరకు ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే అంశం ఉత్పన్నం కాదు. » శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు 173.5 టీఎంసీలు అవసరం. » రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక పంపకాల కోసం 2015లో చేసుకున్న ఒప్పందం ఆ ఒక్క ఏడాది కోసమే. ఇప్పుడు 50: 50 నిష్పత్తిలో కృష్ణా జలాలను పంపిణీ చేయాలి. కృష్ణా ట్రిబ్యునల్–1 నిర్ణయాలను పునః సమీక్షించరాదు: ఏపీ ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు కృష్ణా ట్రిబ్యునల్–1 చేసిన కేటాయింపులను పునఃసమీక్షించడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపులను పునః సమీక్షించడానికి ఆస్కారం లేదని చెప్పింది. -
కృష్ణా నదిలో స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్‌ల నుంచి మంగళవారం రాత్రి 9గంటల సమయానికి 3,79,822 క్యూసెక్కుల వరద వస్తోంది. పది గేట్లను పది అడుగుల మేరకు తెరచి 2,75,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు జలాశయానికి 4,51,080 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. శ్రీశైలం నుంచి దిగువ ప్రాంతాలైన నాగార్జున సాగర్, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,21,973 క్యూసెక్కులు విడుదలైంది. కుడిగట్టు కేంద్రంలో 15.201 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 18.437 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. రాత్రి 9గంటల సమయానికి జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, డ్యాం నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. కాగా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టిలోకి 3.01 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3 లక్షల క్యూసెక్కులను, నారాయణపూర్ డ్యామ్‌లోకి 2.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 2.77 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.85 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టింది. -
రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/హొళగుంద: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులోకి 3.79 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 61,111 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండిపోతుంది. మంగళవారం ఉదయం ఆరు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటి విడుదలను ప్రారంభించనున్నారు. నాగార్జునసాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.27 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.98 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర ప్రవాహం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. మొత్తం 33 గేట్లను ఎత్తి 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సుంకేశుల బ్యారేజ్‌లోకి 1.49 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులను వదులుతూ 1.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. -
కృష్ణా, తుంగభద్ర పోటాపోటీ
సాక్షి, అమరావతి/హొసపేటె/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పోటాపోటీగా వరదెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 3.12 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు.. సుంకేశుల నుంచి 99,736 క్యూసెక్కుల తుంగభద్ర జలాలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,12,280 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 866.4 అడుగుల్లో 127.59 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కుడి కేంద్రంలో ఏజీ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కులు.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు వదులుతోంది. కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరద వస్తుండటంతో సోమ లేదా మంగళవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయనున్నారు. నాగార్జునసాగర్‌లోకి 52,599 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 507.80 అడుగుల్లో 127.97 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన పాయలో ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వచి్చన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్రలో ఉధృతి మరింత పెరిగింది. డ్యామ్‌లోకి 1.21 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో.. మొత్తం 33 గేట్లు ఎత్తేసి, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 1.58 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. దాంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద మట్టం 311.25 మీటర్లు(సముద్రమట్టానికి)కు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల బ్యారేజ్‌లోకి 1,02,100 క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులు వదులుతూ గేట్లు ఎత్తి దిగువకు 99,736 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
హంద్రీ–నీవాకు నీళ్లిచ్చేదెప్పుడు?
సాక్షి, అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నా, మన రాష్ట్రంలోని హంద్రీ–నీవా ప్రాజెక్టు గురించి మాత్రం ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం నాటికి నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు పైగా చేరింది.. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను ప్రాజెక్టు నుంచి దిగువకు తరలిస్తోంది.. జూన్ 3 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 806.3 అడుగుల్లో 32.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు ప్రారంభించింది.. కానీ ఇప్పటికీ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల రాయలసీమలోని అధిక ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలే కురిశాయి. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన జలాశయాలు.. కాలువకు ఇరు వైపులా ఉన్న చెరువులు నీళ్లు లేక నోళ్లు తెరుచుకోవడం.. భూగర్భ జల మట్టం తగ్గిపోవడంతో తాగు, సాగునీటికి సీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా జూన్ 3 నుంచే తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేయక పోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాయలసీమపై సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో మరోసారి నిరూపితమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ రాయలసీమ సస్యశ్యామలం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది దాహార్తి తీర్చి.. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా రూ.6,850 కోట్లతో 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికే చాలా వరకు పనులు పూర్తవడంతో 2012–13 నుంచి హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు ప్రభుత్వం నీటిని తరలిస్తోంది. ప్రస్తుత డిజైన్ మేరకు హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలు ఎత్తిపోయాలంటే 120 రోజులపాటు రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయాలి. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటంతో 120 రోజులు నీరు నిల్వ ఉండని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా సామర్థ్యం పెంచే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ రెండో వారం నుంచే 800 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోయడం ద్వారా ఏటా సామర్థ్యం కంటే ఎక్కువ నీటిని తరలించి.. రాయలసీమలో చెరువులు, జలాశయాలను నింపారు. ప్రధాన కాలువ కింద, చెరువులు, జలాశయాల ఆయకట్టుతోపాటు భూగర్భ జల మట్టం పెరగడంతో రైతులు బోర్లు, బావుల కింద భారీ ఎత్తున పంటలు సాగు చేసి ప్రయోజనం పొందారు. దాంతో గత ఐదేళ్లూ సీమ సస్యశ్యామలమైంది.నాటి లానే నేడూ రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం హంద్రీ–నీవాకు నీటి విడుదలపై మీనమేషాలు లెక్కించింది. నీటి తరలింపును ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఎన్నడూ సామర్థ్యం మేరకు అంటే ఏటా 40 టీఎంసీలు తరలించిన దాఖలాలు లేవు. నీటి తరలింపును ఆలస్యంగా ప్రారంభించడం.. ఆలోగా శ్రీశైలం నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఏటా సగటున 27.46 టీఎంసీలను మాత్రమే అప్పట్లో చంద్రబాబు సర్కార్ ఇవ్వగలిగింది. కానీ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019–20, 20–21లో సామర్థ్యం కంటే అధికంగా నీటిని తరలించింది. 2021–22, 22–23లలో రాయలసీమలో భారీ వర్షాలు కురవడం.. చెరువులు నిండిపోవడం.. వరదలతో హంద్రీ–నీవా నీటి అవసరం పెద్దగా లేకపోయింది. 2023–24లో కృష్ణా బేసిన్లో తీవ్రమైన వర్షాభావంతో నీటి కొరత ఉన్నప్పటికీ.. హంద్రీ–నీవా ద్వారా 32.49 టీఎంసీలను తరలించి వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ సాగునీటి సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధిని చాటుకుంది. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం హంద్రీ–నీవాకు నీటి విడుదలపై మళ్లీ మీనవేషాలు లెక్కిస్తోంది. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/హొళగుంద/హొసపేటె: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగుపరుగున చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,09,814 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 832.5 అడుగుల్లో 52.14 టీఎంసీలకు చేరుకుంది. పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయతోపాటు ఉపనదులు వరదతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచ్చిన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంటగంటకు పెరుగుతోంది. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,04,972 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 87.42 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారడం, ఎగువ నుంచి భారీవరద వస్తుండటంతో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. క్రమేణ పెంచుతూ రాత్రికి 55 వేల క్యూసెక్కులు విడుదల చేస్తామని, నదీతీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరులశాఖ అధికారులను తుంగభద్ర బోర్డు ఆదేశించింది. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేసే జలాలు సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనున్నాయి. ఇటు జూరాల నుంచి కృష్ణా, అటు సుంకేశుల నుంచి తుంగభద్ర జలాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింతగా పెరగనుంది. -
‘శ్రీశైలం విద్యుత్’కు త్వరలో మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అతి పెద్దదైన శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రానికి మరమ్మతులు నిర్వహించేందుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) చర్యలు చేపట్టింది. విద్యుదుత్పత్తి సంస్థ స్థాపిత సామర్థ్యం 900 (6 ్ఠ150) మెగావాట్లు కాగా, అందులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4వ యూనిట్‌లోని జనరేటర్ స్టేటర్, రోటర్లు గత జూలైలో రెండోసారి కాలిపోయాయి. 2020 ఆగస్టు 20న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని కంట్రోల్ ప్యానెల్స్‌కి డీసీ విద్యుత్‌ను సరఫరా చేసే బ్యాటరీలను మార్చే సమయంలో మంటలు చెలరేగి భారీ అగి్నప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జెన్కోఇంజనీర్లతోపాటు మొత్తం 9 మంది మృత్యువాతపడగా, విద్యుత్ కేంద్రంలోని కొన్ని యూనిట్లు పూర్తిగా, మరికొన్ని యూనిట్లు పాక్షికంగా కాలిపోయాయి. అప్పట్లో 4వ యూనిట్‌కే అత్యధిక నష్టం జరిగింది. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ వైత్ ఆధ్వర్యంలో జెన్కో మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించింది. గతేడాది దాదాపుగా 80 గంటలపాటు విద్యుదుత్పత్తి చేసిన తర్వాత మళ్లీ 4వ యూనిట్లో వాల్ట్ వచ్చి కాలిపోయింది. ఒప్పందం ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లోనే 4వ యూనిట్ కాలిపోవడంతో సొంత ఖర్చుతో మరమ్మతులు నిర్వహించాలని ‘వైత్’గ్రూపును జెన్కో కోరగా, ఆ సంస్థ నిరాకరించింది. 4వ యూనిట్‌కు ఇతర మరమ్మతులు నిర్వహించడంతోనే ఫాల్ట్ ఏర్పడిందని, దీనితో తమకు సంబంధం లేదని వైత్ గ్రూపు స్పష్టం చేసింది. మరమ్మతులకు మళ్లీ డబ్బులు చెల్లించాలని కోరింది. ఏడాది కాలంగా ఆ కంపెనీతో వివాదం నడవడంతో మరమ్మతుల నిర్వహణ మరుగున పడిపోయింది. కొత్తగా మరోసారి టెండర్లు నిర్వహించి మరమ్మతులు నిర్వహించడానికి జెన్కో యత్నించగా, ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించక ప్రక్రియ ముందుకు సాగలేదు. మరమ్మతులకు రూ.3 కోట్ల దాకా ఖర్చు కానుండగా, అంతకు ఎన్నో రెట్లు విలువ చేసే జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం లభించనుంది. ఉత్పత్తి వచ్చే ఏడాదే.. రాష్ట్రంలోని కీలకమైన జలవిద్యుత్ కేంద్రాలకు సకాలంలో మరమ్మతులు నిర్వహించకపోవడంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోయిన అంశంపై ఈ నెల 21న ‘హైడల్ పవర్ డౌన్! ’శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు ప్రభుత్వం స్పందించి తక్షణమే మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో మరమ్మతులు నిర్వహించిన ‘వైత్’సంస్థకు ఇటీవల జెన్కో తుది నోటీసులు జారీ చేసి ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది. మళ్లీ కొత్తగా టెండర్లు నిర్వహించడానికి జెన్కో యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. మరమ్మతులు పూర్తై 4వ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం మూడు నెలల సమయం పట్టొచ్చని, ఆలోగా కృష్ణా నదిలో వరదలు ముగిసిపోతాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
హైడల్ పవర్ డౌన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎగువ, దిగువ జూరాల వంటి నాలుగు ప్రధాన జల విద్యుత్ కేంద్రాలకు గత కొంతకాలంగా మరమ్మతులు నిర్వహించకపోవడంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం క్షీణించిపోయింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా, టెండర్ల నిర్వహణలో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) తాత్సారం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కృష్ణా నదికి ఎగువ నుంచి వరదలు ప్రారంభం కానుండగా, పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని చేసుకునే పరిస్థితి లేకుండా పోయినట్లు తెలిసింది. ఇదే జరిగితే రూ.కోట్లు విలువ చేసే జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోయినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నచిన్న సమస్యలే అయినా.. రాష్ట్రంలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 2441.76 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్రాలుండగా, ఎప్పటికప్పుడు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రస్తుతం 329.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన జలవిద్యుత్ కేంద్రాలన్నింటిలో ఒక్కో యూనిట్ పనిచేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. గత ఆరు నెలలుగా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో మరమ్మతులు ప్రారంభం కాలేదు. చిన్న చిన్న సమస్యలే ఉండడంతో ఒక్కో కేంద్రం మరమ్మతులకు రూ.10 కోట్లలోపు వ్యయమే కానుండగా, టెండర్లు ఖరారు చేయకపోవడంతో వర్షాకాలంలో ఆయా యూనిట్లలో జల విద్యుదుత్పత్తి నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. సాగర్, శ్రీశైలం కేంద్రాలకూ మరమ్మతులు నో రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాలు సగటున ఏటా 3000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. థర్మల్ విద్యుత్‌తో పోల్చితే అత్యంత చౌకగా కాలుష్యం లేకుండా జలవిద్యుత్ లభిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించిన ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 (6్ఠ39) మెగావాట్లు కాగా ఇక్కడ మూడో యూనిట్ జనరేటర్ సమస్యతో పనిచేయడం లేదు. దిగువ జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 240 (6్ఠ40) మెగావాట్లు కాగా, అందులోని అన్ని యూనిట్లలో సీల్ లీకు అవుతోంది. వీటిల్లో కనీసం ఒక యూనిట్ పనిచేయకపోవచ్చని, తద్వారా 40 మెగావాట్ల విద్యుదుత్పత్తికి నష్టం కలగనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జలవిద్యుత్ కేంద్రమైన ‘శ్రీశైలం’స్థాపిత సామర్థ్యం 900 (6్ఠ150) మెగావాట్లు కాగా, అందులో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4వ యూనిట్ పనిచేయడం లేదు. జనరేటర్ స్టేటర్, రోటర్లు కాలిపోవడంతో వాటిని మార్చాల్సి ఉంది.మరో భారీ జలవిద్యుత్ కేంద్రం నాగార్జునసాగర్ స్థాపిత సామర్థ్యం 815.6(1్ఠ110 + 7్ఠ100.8) మెగావాట్లు కాగా, అందులో 100.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్ పనిచేయడం లేదు. రోటర్‌కు సపోరి్టంగ్గా ఉండే స్ట్రక్చర్‌కు పగుళ్లు రాగా మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహిస్తే వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
విద్యుదుత్పత్తిని ఆపేయండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని తెలంగాణ జెన్కోను కృష్ణా బోర్డు ఆదేశించింది. నీటి కేటాయింపులు చేయాలని ఎలాంటి ప్రతిపాదన పంపకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు తరలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ జెన్కో సీఎండీకి కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని కృష్ణా బోర్డుకు బుధవారం ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేసేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కృష్ణాబేసిన్‌లో ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడాన్ని ఎత్తిచూపారు. దాంతో కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గుతుందని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులోను లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని సంరక్షించుకుని తాగు, సాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇకపై ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కానీ.. తెలంగాణ జెన్కో కృష్ణా బోర్డు ఆదేశాల భేఖాతరు చేస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను దిగువకు వదలేస్తుండటం గమనార్హం. -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగింది. నీటి ప్రవాహం తగ్గడంతో రెండ్రోజుల క్రితం గేట్లు మూసివేయగా..బుధవారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లో పెరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రాజెక్టుకు 95వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..పది క్రస్టు గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి 39,580 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. అదేవిధంగా 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 38,864 క్యూసెక్కులు వదులుతుండగా..మొత్తంగా జూరాల నుంచి 83,077 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి జూరాల క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 78,444 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 886 క్యూసెక్కులు మొత్తం 79,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 854.40 అడుగులమేర 90.348 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవు
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియపై తమ అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ మరోసారి కేంద్రానికి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ అవసరాలు పోను, మరో 176 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, ఆ నీటిని అనుసంధాన ప్రక్రియలో వినియోగిస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్సారెస్పీ–ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవని, లభ్యత నీటిని వాడుకునేలా ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపింది. గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై మంగళవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ భూపాల్‌సింగ్ నేతృత్వంలోని గవర్నింగ్ బాడీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసింది. ఈ భేటీకి తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని కావేరీకి తరలించేలా చేసిన ప్రతిపాదనలపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోలేని 247 టీఎంసీల నీటిని అనుసంధానం ద్వారా తరలిస్తామని కేంద్రం చెబుతున్నా.. దీనికి ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న విషయాన్ని రాష్ట్ర ఇంజనీర్లు ఎత్తిచూపారు. భవిష్యత్తులో ఇంద్రావతి నీటిని ఛత్తీస్‌గఢ్ వినియోగిస్తే మిగులు జలాలు ఎలా ఉంటాయో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. కాగా, గోదావరిలో మిగులు జలాలే లేవని పునరుద్ఘాటించారు. ఈ దృష్ట్యా గోదావరి–కావేరీ అనుసంధానం కన్నా ముందు మహానది–గోదావరి అనుసంధానం చేయాలని, మహానది నుంచి నీటిని తరలించాకే కావేరీకి నీటిని తీసుకెళ్లాలని వెల్లడించారు. దీంతోపాటు ఈ అనుసంధాన ప్రక్రియలో నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామన్న ప్రతిపాదనను తెలంగాణ తప్పుపట్టింది. సాగర్‌కు ఉన్న నీటి కేటాయింపులు, దాని ఆపరేషన్ ప్రొటోకాల్‌పై ఇంతవరకు స్పష్టత లేదని, దీనిపై ట్రిబ్యునల్ తేల్చాల్సి ఉందని, అది జరగకుండా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడం లేక అటు నుంచి నీటిని తరలించడం సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేసింది. -
పూర్తిస్థాయి భేటీలోనే చర్చిద్దాం..
చర్చకు కోరిన అంశాలు ఇలా.. ►ఇప్పటివరకు కృష్ణా జలాలకు సంబంధించి ఉన్న నీటి వాటాల నిష్పత్తిని ఈ ఏడాది నుంచి మార్చాలి. ►ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఆపేలా చర్యలు తీసుకోవాలి ►పోతిరెడ్డిపాడు ద్వారా ఇతర బేసిన్, ఇతర ప్రాజెక్టులకు అదనంగా నీటి తరలింపుపై చర్యలు తీసుకోవాలి ►బచావత్ అవార్డు ప్రకారం.. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిన వెంటనే, కృష్ణా జలాల్లో 45 టీఎంసీల వాటాను తెలంగాణకు కేటాయించాలి. ►తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిలో 20 శాతం వినియోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ►బోర్డు ఇచ్చిన నీటి విడుదల ఆదేశాల్లో తెలంగాణ పొదుపు చేసిన జలాలను పక్కాగా లెక్కించాలి. సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాలకు సంబంధించి నెలకొన్న వివిధ వివాదాల తీవ్రత దృష్ట్యా వాటిపై చర్చించేందుకు పూర్తిస్థాయి భేటీ నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. వివాదాస్పదమైన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా, జూలై 20 తర్వాత తెలంగాణ, ఏపీలకు ఆమోదయోగ్యమైన తేదీల్లో సమావేశం నిర్వహించాలని కోరింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులను ఆరంభించే పనుల్లో తెలంగాణ సాంకేతిక బృందాలు తీరిక లేకుండా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ సోమవారం బోర్డుకు లేఖ రాశారు. మూడు రోజుల కిందట సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, త్రిసభ్య కమిటీ భేటీని కాకుండా పూర్తిస్థాయి సమావేశం జరపాలని ఆయన బోర్డును కోరారు. బోర్డుకు ఏపీ రాసిన లేఖలను ఆధారంగా చేసుకొని సభ్య కార్యదర్శి ఈ నెల 9న త్రిసభ్య కమిటీ భేటీ ఏర్పాటు చేశారని పేర్కొంటూ, ఈ మేరకు రాసిన లేఖలో సభ్య కార్యదర్శి కేవలం ఏపీ లేవనెత్తిన అంశాలనే ప్రస్తావించడంపై విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ లేవనెత్తిన అంశాలనుఇందులో చేర్చలేదని తెలిపారు. బోర్డు పూర్తిస్థాయి భేటీలో చర్చించాల్సిన ఆరు అంశాలను రజత్‌కుమార్ తన లేఖలో పొందుపరిచారు. విద్యుత్ అవసరాలకే శ్రీశైలం ఇలావుండగా కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్ అవసరాల కోసం నిర్మించినదేనని రజత్‌కుమార్ మరోమారు పునరుద్ఘాటించారు. తెలంగాణ పూర్తిగా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉందని, ఖరీఫ్‌లో సాగుకు నీరందిం చాలంటే భారీగా విద్యుత్ అవసరాలున్నాయని తెలిపారు. ఈ దృష్ట్యానే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు నీటిని తరలించి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నామని వివరించారు. -
శ్రీశైలంలోకి తగ్గిన వరద
సాక్షి, కర్నూలు: పరీవాహక ప్రాంతంలో వర్షపాత విరామం వల్ల కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 45,560 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 884.8 అడుగుల్లో 214.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 17,692 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 2,500 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి 21,305 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 15,502 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.గోదావరిలో వరద ప్రవాహం తగ్గడంతో ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,38,735 క్యూసెక్కులు చేరుతుండగా.. మిగులుగా ఉన్న 2,25,435 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
ఏపీకి 15 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 15 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు అంగీకరించింది. సాగర్ నుంచి 13 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 2 టీఎంసీలు విడుదల చేసేందుకు సమ్మతించింది. ఈ మేరకు మంగళవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డిల సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం జరిగింది. ఏపీ తన అవసరాలకు సాగర్ కుడి కాల్వ కింద 10 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద 2, హంద్రీనీవాకు 2 టీఎంసీలు కోరింది. అయితే ఇప్పటికే శ్రీశైలంలో కనీస నీటిమట్టాలు 854 అడుగులకు దిగువకు వెళ్లి నీటిని తీసుకుంటున్న విషయాన్ని తెలంగాణ దృష్టికి తెచ్చింది. అయితే తమ అవసరాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ దృష్ట్యా 807 అడుగుల వరకు నీటిని వినియోగించుకుంటామని తెలిపింది. తెలంగాణ సైతం తన అవసరాల నిమిత్తం సాగర్‌లో 510 అడుగుల దిగువకు వెళితే తాము అభ్యంతరం చెప్పబోమని తెలిపింది. ప్రస్తుతం సాగర్‌లో 543 అడుగులకు ఎగువన వినియోగించుకునే నీరు 61 టీఎంసీల మేర ఉండగా, అందులో తెలంగాణ వాటా 53 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి వాటా వాడుకునేందుకు 510 అడుగుల దిగువకు వెళ్లేందుకు అంగీకరించడంతో తెలంగాణ సైతం ఏపీ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ 15 టీఎంసీల నీటి విడుదలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. -
మా అవసరం 157 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో వచ్చే వర్షాకాల సీజన్ ముందు వరకు తమకు 157 టీఎంసీల అవసరాలుంటాయని రాష్ట్రం తేల్చింది. ఈ మేరకు వచ్చే ఏడాది మే చివరి వరకు తమ అవసరాలను పేర్కొంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఇందులో శ్రీశైలంప్రాజెక్టుపై ఆధారపడ్డ కల్వకుర్తి ఎత్తిపోతలకు 22 టీఎంసీలు, నాగార్జునసాగర్ కింద హైదరాబాద్ తాగునీరు, ఏఎంఆర్పీ, మిషన్ భగీరథ అవసరాలకు కలిపి 45 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద అవసరాలకు 90 టీఎంసీలు కలిపి మొత్తంగా 135 టీఎంసీలు అవసరం ఉంటుందని పేర్కొంది. ఇక ఈ వాటర్ ఇయర్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలు 645.36 టీఎంసీల మేర వినియోగించుకోగా తెలంగాణ వాటా 219 టీఎంసీలుగా ఉందని, అయితే అందులో రాష్ట్రం 148 టీఎంసీలు మాత్రమే వినియోగించిందని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 250 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, అందులో తెలంగాణకు 160 టీ ఎంసీల మేర వాటా ఉంటుందని దృష్టికి తెచ్చింది. -
శ్రీశైలం జలాశయం మూడు క్రస్ట్ గేట్లు ఎత్తివేత
సాక్షి, కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆదివారం ఆరోసారి జలాశయం మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను సుమారు పది అడుగుల మేరకు తెరిచి నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. జలాశయానికి సుమారు 1,17,627 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,52,557 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885. 00 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 215.8070 టీఎంసీలు ఉంది. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం సమానంగా కొనసాగటంతో అధికారులు మూడు క్రస్ట్ గెట్లను తెరిచినట్టు మీడియాకు తెలిపారు. -
తవ్వలేక... తోడలేక!
సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో సొరంగా ల తవ్వకాల పరిస్థితి. ఎప్పుడూ ఏదో అవాంతరాల తో ఆగుతున్న ఈ పనులకు ప్రస్తుతం సీపేజీ, పాడైన బోరింగ్ యంత్రానికి తోడు నిధుల సమస్య వచ్చి పడింది. గతేడాది మే నెల నుంచి ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు కొత్తగా సీపేజీ సమస్యతో భారీగా నీరు చేరుతూ మొత్తానికి ఎసరు వచ్చేలా ఉంది. తిరిగి పనులను గాడిలో పెట్టేందుకు రూ.80 కోట్ల వరకు చెల్లిస్తే కానీ పనులు సాగవని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి తేల్చిచెప్పడంతో ఆ నిధులు సర్దడం ఎలా అన్నదానిపై ప్రభుత్వం తల పట్టుకుంటోంది. ఇప్పుడైనా స్పందిస్తారా..? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా తవ్వాల్సిన రెండు సొరంగాలకు గాను మొదటి దాన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.93 కి.మీ. కాగా, ఇప్పటి వరకు 33.20 కి.మీల పని పూర్తయింది. మరో 10.73కి.మీ.ల పని పూర్తి చేయాల్సి ఉంది. ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుండగా.. శ్రీశైలం నుంచి జరుగుతున్న పనులు గత ఏడాది మే నెల నుంచి ఆగాయి. టన్నెల్ బోరింగ్ మెషీన్ పాడవడం, కన్వేయర్ బెల్ట్ మార్చాల్సి ఉండటం, ఇతర యంత్రాల్లో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఇన్లెట్ టన్నెల్ పనుల వద్ద ప్రస్తుతం ఊహించని విధంగా సీపేజీ వస్తోంది. గరిష్టంగా గంటకు 9వేల లీటర్ల మేర నీరు సీపేజీ రూపంలో వస్తుండగా, అంత నీటిని తోడే సామర్ధ్యం పనులు చేస్తున్న జేపీ సంస్థ వద్ద లేకపోవడంతో నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ దృష్ట్యానే యంత్రం మరమ్మతులకు తోడు నీటిని తోడేందుకు తమకు కనిష్టంగా రూ.60 కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వా లని ఏజెన్సీ ప్రభుత్వానికి గత ఏడాది నవంబర్ నెల లో కోరింది. ఎన్నికల నేపథ్యంలో అది ఆగి చివరకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నీటి పారుదల శాఖకు సూచించింది. దీనిపై ఆశాఖ రూ.60 కోట్ల అడ్వాన్సులు కోరుతూ ఆర్థిక శాఖకు పంపినా ఇంతవరకు నిర్ణయం తీసు కోలేదు. నిధులు విడుదల చేయలేదు.దీంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ రూ.60 కోట్లకు తోడు ప్రస్తుతం మరో రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.80 కోట్లు చెల్లిస్తే కానీ పనులు మొదలయ్యే అవకాశం లేదని ఇటీవల మరోమారు నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలో అయినా నిధుల విడుదల జరిగి పనులు మొదలవుతాయో లేదో చూడాలి. అయితే ప్రాజెక్టును రూ.1,925 కోట్లతో ఆరంభించగా, తర్వా త ఈ వ్యయాన్ని రూ.3,074 కోట్లకు సవరించారు.ఇందులో రూ.2,186 కోట్ల మేర నిధులు ఖర్చయ్యా యి. ప్రాజెక్టు పనులను 2022 నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మరో ఏడాది అదనపు సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార వర్గాలే అంటున్నాయి. -
దిగుతారా.. ఆగుతారా..
సాక్షి, హైదరాబాద్: వేసవి ఆరంభానికి ముందే శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. మరో ఆరు నెలల వరకు డ్యామ్ నీటిని సర్దుబాటు చేసుకోవాల్సి ఉండగా ఇప్పుడే నీటి నిల్వలు కనీస మట్టాలకు చేరాయి. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 834 అడుగులు కాగా నేడో రేపో ఆ మట్టానికి నిల్వలు చేరనున్నాయి. ప్రస్తుతం కేవలం 834.20 అడుగుల్లో వినియోగార్హమైన నీటి లభ్యత కేవలం 0.20 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ లభ్యత నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. గతేడాది 101.. ఇప్పుడు 54 టీఎంసీలు ఏపీలోని కేసీ కెనాల్, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు కింది అవసరాలతో పాటు సాగర్ కింది అవసరాలకు శ్రీశైలం ప్రధాన నీటి వనరుగా ఉంది. అయితే ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలు తమ సాగు, తాగునీటి అవసరాలకు గణనీయంగా నీటిని మళ్లించుకోవడంతో ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితి తలెత్తింది. గతేడాది 885 అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 858.70 అడుగుల మట్టంలో 101.92 టీఎంసీల మేర నిల్వలుండగా.. ప్రస్తుతం 834.20 అడుగుల మట్టంలో 54.15 టీఎంసీల మేర నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కనీస నీటి మట్టానికి ఎగువన ఉన్నది కేవలం 0.20 టీఎంసీలు. ఈ నీటితో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల కింది అవసరాలు తీర్చడం సాధ్యమయ్యేది కాదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా దిగువకు వెళ్లాలని ఏపీ ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తోంది. తమ అవసరాలకు అనుగుణంగా కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఏపీ విన్నవించింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా జూలై నెలాఖరు వరకు లభ్యత నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నందున ఆచితూచి వాడుకోవాలని సూచించింది. బోర్డు భేటీలోనే స్పష్టత: కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి నీటిని తీసుకునే అంశంపై కృష్ణా బోర్డు నిర్ణయమే కీలకం కానుంది. భేటీపై స్పష్ట త లేదు. గతనెలలో భేటీ ఉంటుందని భావించగా, తుంగభద్ర బోర్డు భేటీ కారణంగా అది జరగలేదు. ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన కోరినంత మేర నీటి నిల్వలు లేనట్టయితే దిగువకు వెళ్లయినా నీటిని కేటాయించాలన్న ఏపీ వినతిపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. లేకుంటే సాగర్‌పైనే.. శ్రీశైలంలో కనీస నీటి మట్టాలకు వెళ్లలేని పరిస్థితుల్లో నాగార్జున సాగర్ నీటిపైనా ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాగర్‌లో 534.8 అడుగుల మట్టంలో 177.66 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు కేవలం 46 టీఎంసీలు. ఈ నీటినే రెండు రాష్ట్రాలు సర్దుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు కేటాయించిన నీటిలో తెలంగాణకు ఇంకో 29 టీఎంసీలు, ఏపీ మరో 5 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే వీలుంది. మరో 13 టీఎంసీల నీటిని తెలంగాణ అవసరాల కోసం రిజర్వ్ చేసి పెట్టారు. ఈ నేపథ్యంలో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న నీరు ఇరు రాష్ట్రాల అవసరాలను తీర్చడం కష్టమే. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాల దిగువకు వెళ్లి తోడటం ఖాయమేననిపిస్తోంది. -
అడియాసేనా... ?!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : శ్రీశైలం నిర్వాసితులు... ఈ పదం వినగానే టక్కున గుర్తొచ్చేది 98 జీఓ. ఇంతగా జనంలోకి చొచ్చుకుపోయిన అంశమిది. మూడు దశాబ్దాలు గా శ్రీశైలం నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఉద్యమిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకున్నా ఆ ఆశ కూడా అడియాసే అయింది. పాలకులు పట్టించుకోక, ప్రభుత్వాలు ఆదరించక శ్రీశైలం నిర్వాసితుల బతుకుల్లో వెలుగులు కానరాకుండా పోతున్నా యి. స్వరాష్ట్రంలోనూ నిర్వాసితుల అంశం కొలిక్కిరాకపోవడం... ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ అంశంగా మారడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గడిచిన నాలుగేళ్లుగా కాంగ్రెస్ నేత బీరం హర్షవర్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత జి.రాంభూపాల్‌రెడ్డి నిర్వాసితులకు అండగా పోరాటాలు చేయడం... తాజాగా తెలంగాణ నవనిర్మాణ వేదిక అధ్యక్షుడు మురళీధర్‌గుప్తా శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం కోసమే రానున్న ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ప్రకటించడం చర్చనీయాశమైంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ముంపు నిర్వాసితుల అంశం ఉమ్మడి జిల్లాలో ఎన్నికల అజెండాగా మారింది. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం 1981లో శ్రీశైలం బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా నదీ తీరంలోని 67 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగాయి. 11 వేల కుటుంబాలకు చెందిన 27 వేల మందికి పైగా ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర గ్రామాలకు వలస వెళ్లారు. బంగారం వంటి పంట పండే భూములు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోవడంతో రైతులు కూలీలుగా మారారు. కర్నూలు జిల్లాతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజవర్గాల్లోని గ్రామాలు నీటిముంపునకు గురయ్యాయి. నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. జీఓ 98ను రూపొందించారు. నిర్వాసితులకు నష్టపరిహారంగా రూ.17.90కోట్లు చెల్లించారు. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పునరావాసం కోసం కేవలం రూ.2.90కోట్లు మాత్రం ఖర్చు చేశారు. నాటి నుంచి నేటివరకూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కొందరికి ఉద్యోగాలు జీఓ 98 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 1992లో కొందరికి ఉద్యోగాలు కల్పించారు. వీరిలో అధికంగా కర్నూల్ జిల్లా వాసులకే అవకాశం దక్కింది. అర్హులైన వారు ఉద్యోగాల కోసం ధరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో ఇప్పటివరకు 2,435 మంది నిర్వాసిత నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శ్రీశైలం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు, ఉద్యోగ అర్హత లేనివారికి అదనపు పరిహారం చెల్లించాలని భావించారు. ఈ క్రమంలోనే ఆయన అకాల మరణం చెందారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 143 మంది నిర్వాసిత నిరుద్యోగులకు లష్కర్ పోస్టులను ఇచ్చారు. నిర్వాసితులకు ఉద్యోగాల కల్పన కోసం జీఓ నెం 68ను రూపొందించారు. రాష్ట్రం విడిపోవడంతో ఈ అంశం అటకెక్కింది. విభజన తర్వాత.... రాష్ట్ర విభజన జరిగితే తమకు ఉద్యోగాలు వస్తాయని శ్రీశైలం నిర్వాసితులు భావించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోయాక కర్నూలు జిల్లాలోని నిర్వాసిత నిరుద్యోగలందరికీ అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన జరగలేదు. దీంతో నిర్వాసితులు ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో వంద రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు కూడా చేశారు. అప్పట్లో ప్రభుత్వం స్పందించగా.. మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు సాధ్యమైనంత త్వరలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే నెలల తరబడి ఎదురుచూసిన ఆహామి అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం నిర్వాసిత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక, న్యాయబద్దమైన పరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. నిర్వాసితుల పక్షాన టీజేఏసీ, తెలంగాణ నవనిర్మాణ వేదిక, కాంగ్రెస్, వైఎస్సార్సీపీతో పాటు పలు రాజకీయ పార్టీలు నేటికీ పోరాటాలు సాగిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి నిర్వాసితులు సమస్యలు పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. ఉద్యోగాలు కల్పించాలి నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. వారి ఉద్యమంలో న్యాయం ఉంది. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వమే జీఓ ఇచ్చింది. ఆంధ్రా పాలకుల వివక్ష వైఖరి కారణంగా ఉద్యోగాల కల్పనలో ఆలస్యం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిర్వాసిత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అంతా భావించారు. రాష్ట్రం వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిన నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రతీ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలి. – మురళీధర్‌గుప్తా, తెలంగాణ నవనిర్మాణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిర్వాసితులపై ఇంకా వివక్షే... శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులపై పాలక ప్రభుత్వాలు ఇంకా వివక్షత కొనసాగిస్తున్నాయి. అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోటీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 98 జీఓ అమలులో మాత్రం వెనకంజ వేస్తోంది. ఏపీలో నిర్వాసిత నిరుద్యోగులందరికీ దాదాపుగా ఉద్యోగాలు ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్సార్ బతికి ఉంటే నిర్వాసితులందరికీ ఉద్యోగాలు వచ్చి ఉండేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వాసితులకు ఉద్యోగాలిస్తామని కేసీఆర్ కూడా ప్రకటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. నిర్వాసిత కుటుంబాలకు అదనపు పరిహారం ఇవ్వాలి. నిర్వాసితుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుంది. – జి.రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఏపీలో భారీ వర్షాలతో పొంగుతున్న నదులు
-
కానరావా కన్నీళ్లు?!
కర్నూలు సిటీ: దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా రాయలసీమ గుర్తింపు పొందింది. అలాంటి ప్రాంతానికి సాగు, తాగునీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటాయింపులు ఉన్న రిజర్వాయర్లు కాదని, ఎలాంటి కేటాయింపులూ లేని ప్రాంతానికి నీటిని తరలిస్తున్నా జిల్లాకు చెందిన నేతలు పట్టించుకోవడం లేదు. కృష్ణా జలాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతున్నప్పటికీ జిల్లాలోని గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లకు నీరందని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సీమకు కృష్ణా జలాలు తరలించి గోరుకల్లులో 10 టీఎంసీలు, అవుకులో 4 టీఎంసీలు నింపుతామని, గండికోటకు కూడా నీరు తీసుకుపోతామని గత నెల 28న జరిగిన నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీర్మానం చేశారు. కానీ ఇంత వరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి 3.63 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం ఉంది. దీంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి (885 అడుగులు) చేరువలో ఉంది. దీంతో నేడు (శనివారం) రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ్రీశైలం క్రస్ట్ గేట్లు పైకెత్తి దిగువనున్న సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. అవకాశమున్నా అన్యాయమే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకు అవకాశం ఉన్నా.. నిన్న, మొన్నటి వరకు కేవలం 2 నుంచి4 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే ఇచ్చారు. ఈ నీటిలో నుంచి కూడా కేసీ ఎస్కేపు ఛానల్ నుంచి నిప్పులవాగు ద్వారా నెల్లూరు జిల్లాలోని సోమశిలకు పంపించారు. ఎస్ఆర్బీసీకి ఇవ్వలేదు. ఎక్కువ నీటిని తీసుకునేందుకు అవకాశం లేదని, మీరు గట్టిగా మాట్లాడితే పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో బంద్ చేయాలని కూడా జల వనరుల శాఖలోని ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. గురువారం శ్రీశైలానికి భారీ వరద రావడంతో తప్పనిసరి పరిస్థితిలోనే పోతిరెడ్డిపాడు నుంచి 26 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కానీ ఎస్ఆర్బీసీకి మాత్రం తక్కువగానే నీటిని విడుదల చేస్తున్నారు. గోరుకల్లు నిండేదెప్పుడు? శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద జిల్లాలో 1.55 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువకు 19 టీఎంసీల శ్రీశైలం నీటి వాటా ఉంది. దీని ప్రధాన కాలువ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ప్రారంభమవుతుంది. 16.34 కి.మీ దగ్గర ఉన్న బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నుంచి 16 బ్లాకులు 198 కి.మీ వరకు ఉన్నాయి. ఇదేమార్గంలో 50.22 కి.మీ దగ్గర గోరుకల్లు రిజర్వాయర్ 12.34 టీఎంసీల సామ«ర్థ్యంతో, 112 కి.మీ వద్ద 4.62 టీఎంసీల సామర్థ్యంతో అవుకు స్టేజీ–1,2 రిజర్వాయర్లు ఉన్నాయి. కాలువ నిర్మాణ సమయంలో 11,150 క్యూసెక్కుల మేరకు మాత్రమే డిజైన్ చేశారు. ఈ కాలువ నుంచి గాలేరుకు నీరు పంపించడం కోసం 21 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేందుకు చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అయినా ఇప్పుడు 10 వేల క్యూసెక్కుల నీటిని ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ మూడు వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇలా అయితే 12.34 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరుకల్లు నిండేదెప్పుడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఇందులో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు ఆవుకు టన్నెల్ ద్వారా 10 వేల క్యూసెక్కులకుపైగా పంపిస్తామన్న ఇంజినీర్లు ఇంత వరకు ఆ స్థాయిలో పనులు పూర్తి చేలేదని తెలుస్తోంది. అదే విధంగా అవుకు రిజర్వాయర్‌లో మూడు టీఎంసీలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. ఇందుకు కారణం ఆ స్థాయిలో నీటి నిల్వకు అటవీశాఖ అనుమతులు లేకపోవడమే. అనుమతులు తీసుకోవడంలో నాలుగేళ్లుగా నాన్చుతున్నారు. ఇక వైఎస్సార్ జిల్లాలోని గండికోటకు నీరు పంపించాలంటే ఎస్ఆర్బీసీకి నీటి విడుదల పెంచాలని ఆ జిల్లా రైతులు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరుకు నీటి తరలింపులో ఆంతర్యమేమిటి? రాయలసీమకు చెందిన రిజర్వాయర్లు నింపకుండానే గత నెల 25 నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేస్తున్న నీటిని గుట్టుచప్పుడు కాకుండా కేసీ ఎస్కేపు ఛానల్ ద్వారా నిప్పులవాగుకు, అక్కడి నుంచి కుందూ నది గుండా నేరుగా నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయరుకు పంపుతున్నారు. ఇప్పటికే 15 టీఎంసీలకుపైగా నీటిని పంపించారు. ఇంజినీర్లు మాత్రం 4.8 టీఎంసీలే పంపించినట్లు చెబుతున్నారు. వాస్తవానికి సోమశిలకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎలాంటి హక్కు కానీ, వాటా కానీ లేదు. కేవలం చెన్నైకు తాగునీరు ఇచ్చేందుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. దీన్ని సాకుగా చూపి ప్రతి ఏటా రాయలసీమ కాలువలకు నీరు ఇవ్వకుండా సోమశిలకు తరలించడంలో ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఇంజినీర్లే అభిప్రాయపడుతున్నారు. -
శ్రీశైలం జలాలే కీలకం
వాటర్‌గ్రిడ్ ద్వారా 3 జిల్లాలకు నీరు ఎల్లూరు లిఫ్ట్ నుంచే నీటితరలింపు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘వాటర్‌గ్రిడ్’ పథకానికి శ్రీశైలం జలాశయమే కీలకం కానుంది. రాష్ట్రంలోని దాదాపు నాలుగోవంతు మండలాలకు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచే తాగునీటిని పంపింగ్ చేయనున్నారు. రక్షితమంచినీటి జలాలు అందించేందుకు వాటర్‌గ్రిడ్ పథకాన్ని రెండు సెగ్మెంట్లుగా విభజించారు. రెండు సెగ్మెంట్లకూ కృష్ణానది నీటిని పంపింగ్ చేసేలా డిజైన్లు రూపొందించారు. అత్యంత కీలకమైన మొదటి సెగ్మెంటుకు మాత్రం శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా నీటిని పంపింగ్ చేస్తారు. దీనిద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని 128 మండలాలు, ఎనిమిది మున్సిపాలిటీల్లో దాహార్తి తీరనుంది. తొలుత వాటర్‌గ్రిడ్ కోసం ఎల్లూరు కోతిగుండు వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మించాలని నిర్ణయించినా, ఆప్రతిపాదన విరమించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూరు వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను తోడేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను ఉపయోగించనున్నారు. వాటర్‌గ్రిడ్ మొదటి సెగ్మెంటుకు ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 13.11 టీఎంసీలను వినియోగిస్తారు. మహబూబ్‌నగర్‌కు 5.10, నల్లగొండకు 4.59, రంగారెడ్డికి 3.41టీఎంసీల చొప్పున తరలిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి (53.85 టీఎంసీలు) చేరినా వాటర్‌గ్రిడ్ ద్వారా నీటి సరఫరాకు అంతరాయం లేకుండా డిజైన్ రూపొందించారు. పారిశ్రామిక అవసరాలనూ దృష్టిలో పెట్టుకుని నీటి కేటాయింపులు చేసినట్లు చెబుతున్నారు. కాగా, శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి తాగునీటిని పంప్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పథకం పూర్తిస్థాయిలో పనిచేయడం కష్టమేనన్న అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి వాటర్‌గ్రిడ్‌కు నీటిని తరలించడంపై స్థానికంగా నిరసనలూ వ్యక్తమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పది శాతం మేర నీటిని తాగునీటికి వాడొచ్చనే నిబంధన మేరకే వాటర్‌గ్రిడ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఐదు అడుగులు తగ్గిన సాగర్ నీటిమట్టం
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం క్రమేపీ తగ్గుతోంది. కృష్ణానది ఎగువ నుంచి ఇన్‌ఫ్లో తగ్గింది. ఆయకట్టు అవసరాలకు కృష్ణాడెల్టా, కుడి, ఎడమ, ఏఎమ్మార్పీ,వరదకాల్వలకు నీటిని వదులుతున్నారు. దీంతో ఈ 18 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు నీటిమట్టం ఐదు అడుగుల మేర తగ్గింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.10 అడుగుల మేర ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 589.10 అడుగులు. ఈ ఏడు సాగర్ జలాశయానికి వరద నీటి రాక ఆలస్యంగా మొదలైంది. గత నెల 15వ తేదీ నాటికి సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో వారంరోజులపాటు సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ఎగువనుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ జలాశయానికి 28,323 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సాగునీటి అవసరాలకు సాగర్ నుంచి 38,340 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.